Advertisement


Home > Movies - Movie News
స్పెషల్ స్టేటస్ కోల్పోయిన పవన్ కల్యాణ్

"సంక్రాంతి హీరో".. ఈ ట్యాగ్ లైన్ యమ కిక్ ఇస్తుంది. మిగతా రోజుల్లో హిట్ కొట్టడం ఒకెత్తు. సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అందుకోవడం మరో ఎత్తు. అందుకే హీరోలు సంక్రాంతిని వెరీ వెరీ స్పెషల్ గా చూస్తారు. అలాంటి స్పెషల్ స్టేటస్ ను పవన్ కల్యాణ్ కోల్పోయాడు. సంక్రాంతి హీరో అనిపించుకోలేకపోయాడు.

పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. సంక్రాంతికి ఇదే సిసలైన సినిమా అనుకున్నారంతా. అత్తారింటికి దారేది మేజిక్ రిపీట్ అవుతుందని ఆశించారు. కానీ ఆడియన్స్ కు షాకిచ్చాడు అజ్ఞాతవాసి. అలా సంక్రాంతి హీరో స్టేటస్ ను అందుకోలేకపోయాడు పవన్ కల్యాణ్.

నిజానికి ఈ హీరో సంక్రాంతికి చాలా దూరం. తన పాతిక సినిమాల ప్రస్థానంలో సంక్రాంతి రేసులో నిలిచి సూపర్ హిట్ అందుకున్న సందర్భం ఒకే ఒక్కటి. సరిగ్గా 2 దశాబ్దాల కిందట 1998లో సుస్వాగతం సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాడు పవన్. అంతే.. ఆ తర్వాత ఏ సంక్రాంతి ఈ హీరోకు అచ్చి రాలేదు.

సంక్రాంతి కానుకగా 2005లో బాలు సినిమాను విడుదల చేశాడు. 2015లో గోపాల గోపాల విడుదలైంది. తాజాగా ఈ ఏడాది అజ్ఞాతవాసి థియేటర్లలోకొచ్చింది. ఇవేవీ పవన్ కు సంక్రాంతి హీరో అనే స్పెషల్ స్టేటస్ ను అందించలేకపోయాయి.

అజ్ఞాతవాసి పోవడంతో ఇప్పుడు అందరి కళ్లు బాలయ్యపై పడ్డాయి. బాలయ్యకు, సంక్రాంతికి మంచి అవినాభావ సంబంధం ఉంది. బాలయ్య కెరీర్ లో చాలా సూపర్ హిట్స్ సంక్రాంతికే పడ్డాయి. దీంతో అతడు నటించిన లేటెస్ట్ మూవీ జై సింహాపై అంచనాలు పెరిగాయి. ఇది హిట్ అయితే, ఈ సంక్రాంతికి పవన్ పై బాలయ్యదే పైచేయి అవుతుంది.