Advertisement


Home > Movies - Movie News
ప్చ్‌.. మెహ్రీన్‌ ఎంత కష్టపడ్తోందో.!

ఉదయాన్నే నాలుగ్గంటలకల్లా నిద్రలేచి, ఆ తర్వాత ఓ సినిమా షూటింగ్‌కి రెడీ అయి, సాయంత్రం మరో సినిమా ప్రమోషన్‌ కోసం వెళ్ళడమంటే ఎంత కష్టం.? అసలే హీరోయిన్లు.. అందం మీద ఒకింత జాగ్రత్త తీసుకోవాల్సిందే. మేకప్‌కే టైమ్‌ పట్టేస్తుంటుంది.. ఫిట్‌నెస్‌ యాక్టివిటీ తప్పనిసరి.. ఈ కోణంలో చూస్తే, ఏ హీరోయిన్‌కి అయినా ఇంత బిజీ షెడ్యూల్‌ చాలా చాలా కష్టమే కదా.! 

అసలు విషయానికొస్తే, ఆమె పేరు మెహ్రీన్‌ కౌర్‌ పిర్జాదా. తెలుగులో తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాద'తో బంపర్‌ హిట్‌ అందుకుంది మెహ్రీన్‌. ఆ సినిమాలో హీరోగా నటించిన నాని, ఆ తర్వాత చాలా సినిమాలు చేసేశాడు. కానీ, మెహ్రీన్‌ మాత్రం చాలా గ్యాప్‌ తీసుకుంది. చేతిలో అవకాశాలైతే వున్నాయిగానీ, సినిమాలే ప్రేక్షకుల ముందుకు రాలేదింకా. 

ప్రస్తుతం 'జవాన్‌'లో సాయిధరమ్‌తేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది మెహ్రీన్‌. ఆమె నటిస్తోన్న మరో సినిమా 'రాజా ది గ్రేట్‌'. రవితేజ ఈ సినిమాలో హీరో. ఇది కాకుండా, మెహ్రీన్‌ చేస్తున్న ఇంకో సినిమా 'మహానుభావుడు'. ఈ దసరాకే ఈ 'మహానుభావుడు' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఓ వైపు 'జవాన్‌' షూటింగ్‌, ఇంకో వైపు 'మహానుభావుడు' ప్రమోషన్‌.. వెరసి, క్షణం తీరిక లేకుండా పోతోందట మెహ్రీన్‌కి. అయినాసరే, తనకి ఈ బిజీ లైఫే ఇష్టమని మెహ్రీన్‌ అంటోంది. 2017 తనకు వెరీ వెరీ స్పెషల్‌ అని చెబుతోన్న మెహ్రీన్‌, ఈ ఏడాదిలోనే తాను నటించిన మూడు సినిమాలూ విడుదల కానున్నందుకు చాలా ఆనందంగా వుందంటోంది.