Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: పొలిటికల్‌ లీడర్‌ కమల్‌హాసన్‌

కమల్‌హాసన్‌ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. నిజానికి రాజకీయాల్లోకి వచ్చేశానని ఇప్పటికే ఆయన ప్రకటించేసుకున్నాడు కూడా.! కొత్త పార్టీ పెట్టడమొక్కటే తరువాయి. రాజకీయ కార్యాచరణ షురూ చేయడం, రాజకీయ విమర్శలు మొదలెట్టేయడం ద్వారా కమల్‌హాసన్‌, రాజకీయాల్లో 'వేగం' ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోన్న విషయం విదితమే. 

తాజాగా, కమల్‌హాసన్‌ పొలిటికల్‌ గెటప్‌లో కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. సినిమా అంటేనే బోల్డంత పబ్లిసిటీ అవసరం. రాజకీయాల్లో ఆ పబ్లిసిటీ ఇంకా కీ రోల్‌ పోషిస్తుంది. కటౌట్లు, పోస్టర్లు.. ఆ హంగామానే వేరు. అందుకేనేమో ముందస్తుగా కమల్‌, పొలిటికల్‌ గెటప్‌లో ఫొటో సెషన్లు చేయించుకున్నట్టున్నాడు. తప్పదు మరి, రాజకీయాల్లో ఇలాంటి విషయాల్లో ఏమాత్రం తగ్గకూడదు.! 

అతి త్వరలో కమల్‌ కొత్త రాజకీయ పార్టీ పేరు తెరపైకి రాబోతోంది. కేవలం తమిళనాడులోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా నటుడిగా కమల్‌హాసన్‌కి మంచి గుర్తింపు వుంది. అయితే, ప్రస్తుతానికి తమిళ రాజకీయాలకు మాత్రమే పరిమితం కానున్నాడు కమల్‌హాసన్‌. ముందు ముందు జాతీయ రాజకీయాలపైనా ప్రభావితం చూపేలా రాజకీయంగా ఎదుగుతానంటున్నాడాయన. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. పొలిటికల్‌ లీడర్‌గా 'కమల్‌' పంచెకట్టులో భలేగున్నాడు కదా.!