Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: తారకరాముడి బర్త్‌డే జోష్‌.!

జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు నేడు. చిన్న వయసులోనే బాల నటుడిగా తెరంగేట్రం చేసిన ఎన్టీఆర్‌ తొలి సినిమాతోనే తాతకు తగ్గ తనయుడినన్పించుకున్నాడు. స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా, తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. బాల నటుడిగా తొలి సినిమా 'రామాయణం', ఆ తర్వాత హీరోగా 'స్టూడెంట్‌ నెంబర్‌.1', ఆ వెంటనే 'ఆది', 'సింహాద్రి' చిత్రాలతో టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ ఛెయిర్‌ వైపు వడి వడిగా అడుగులేశాడు. 

మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనా, మాస్‌ మెచ్చిన కథానాయకుడిగా ఎన్టీఆర్‌ తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్‌' వంటి విభిన్న చిత్రాలతో కొత్త ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌, లేటెస్ట్‌ మూవీ 'జై లవ కుశ' నిర్మాణంలో వుందిప్పుడు. ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ స్టిల్స్‌ని నిన్ననే విడుదల చేసిన విషయం విదితమే. 

ఇక, తన పుట్టినరోజు సందర్భంగా తనకు మొట్టమొదటగా తన కొడుకు శుభాకాంక్షలు చెప్పాడంటూ, ఆ ఆనంద క్షణాల్ని అభిమానులతో ఫొటోల రూపంలో పంచుకున్నాడు. మరోపక్క, ఎన్టీఆర్‌ అన్నయ్య కళ్యాణ్‌రామ్‌, తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్‌డే నాన్నా' అని పేర్కొనడం గమనార్హం. మొత్తమ్మీద, జూనియర్‌ తారకరాముడు ఫుల్‌ జోష్‌లో పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడన్నమాట.