Advertisement


Home > Movies - Movie News
కళ్లుగప్పి కౌన్సిలింగ్ కు ప్రదీప్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయి, కొన్ని రోజులుగా తప్పించుకు తిరుగుతున్న యాంకర్ ప్రదీప్ ఎట్టకేలకు కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. అయితే ఇక్కడ కూడా తన మార్క్ చూపించాడు. అందరి కళ్లు గప్పి కౌన్సిలింగ్ కు హాజరయ్యాడు. ఉదయం పోలీసులకు ఫోన్ చేసి బేగంపేట్ లో కౌన్సిలింగ్ కు వస్తున్నట్టు సమాచారం అందించాడు ప్రదీప్. ఆ విషయం అలా అలా మీడియాకు పొక్కి అంతా బేగంపేట్ వద్ద కాపుకాశారు.

అదే టైమ్ లో ఎవరికీ కనిపించకుండా గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు ప్రదీప్. తండ్రితో కలిసి కౌన్సిలింగ్ లో పాల్గొన్నాడు. తాగి బండి నడిపితే జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో తెలిపే డాక్యుమెంటరీని తండ్రితో కలిసి కూర్చొని బుద్ధిగా చూశాడు. అధికారులు చెప్పిన సమాచారాన్ని శ్రద్ధగా ఆలకించాడు. 

రేపు ప్రదీప్ కోర్టుకు హాజరయ్యే అవకాశముంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది సర్వత్రా ఆసక్తికర అంశంగా మారింది. సాధారణంగా బ్రీత్ ఎనలైజర్ లో 50 పాయింట్లు దాటి నమోదైతే కనీసం 1రోజు జైలు శిక్ష విధించే అధికారం జడ్జికి ఉంది. అలాంటిది ప్రదీప్ కు ఏకంగా 178పాయింట్లు వచ్చాయి. అందుకే అతడికి కనీసం 3నుంచి 5రోజులు జైలుశిక్ష పడే అవకాశముందంటూ కథనాలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంలో జడ్జి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించవచ్చు. తొలిసారి తాగి పట్టుబడిన సందర్భంలో, పోలీసులకు చిక్కిన వ్యక్తి సెలబ్రిటీ అయిన కేసుల్లో జడ్జి కాస్త సౌమ్యంగా వ్యవహరించే అవకాశముంది. ట్రాఫిక్ కూడళ్లలో ప్లకార్డులు పట్టుకొని నిలబెట్టే శిక్షల్లాంటివి అస్సలు వేయరు. న్యాయనిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. తొలిసారి పట్టుబడిన కేసు కాబట్టి జరిమానాతో ప్రదీప్ ను విడిచిపెట్టే అవకాశాలున్నాయి.

మరోవైపు కారుకు బ్లాక్ ఫిలిం వేశాడనే కేసు కూడా ప్రదీప్ పై నమోదైంది. వీఐపీ కార్లకు కూడా బ్లాక్ ఫిలిం తీసేస్తున్న ఈ రోజుల్లో ప్రదీప్ మాత్రం తన కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారుకు బ్లాక్ ఫిలిం వేయించాడు. ఈ కేసుకు సంబంధించి కూడా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.

డిసెంబర్ 31రాత్రి తప్పతాగి పోలీసులకు బుక్ అయిపోయాడు ప్రదీప్. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన పోలీసులకు ఇంట్లో, ఆఫీస్ లో ఎక్కడా కనిపించలేదు. తను అజ్ఞాతంలో లేనని, త్వరలోనే కౌన్సిలింగ్ కు హాజరవుతానని గత శుక్రవారం వీడియో పోస్ట్ చేసిన ప్రదీప్.. ఈరోజు గోషామహల్ లో కౌన్సిలింగ్ తీసుకున్నాడు.