Home > Movies - Movie News
రైతుల కోసం విశాల్‌ 'ఒక్క రూపాయి'

తమిళ హీరో విశాల్‌, తమిళ రైతుల సంక్షేమం కోసం నడుం బిగించాడు. సినీ రాజకీయాలకు సంబంధించి తమిళ సినీ పరిశ్రమలో విశాల్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? తమిళ సినీ రాజకీయాల్లో విశాల్‌ హాట్‌ సెన్సేషన్‌. తలపండిన సినీ ప్రముఖులకే ఝలక్‌ ఇచ్చి, తమిళ సినీ రంంగలో 'నాయకుడిగా' ఎదిగాడు విశాల్‌. త్వరలో, రాజకీయాల్లోకి వచ్చేందుకూ విశాల్‌ ప్రయత్నిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతున్న వేళ, తమిళ రైతుల సంక్షేమం కోసం తన తాజా సినిమాని ఫుల్లుగా వాడేసుకుంటున్నాడు. 

తన కొత్త సినిమా 'తుప్పరివాలన్‌' సినిమా టిక్కెట్‌లోంచి 'ఒక్క రూపాయి'ని తమిళ రైతుల సంక్షేమం కోసం కేటాయించనున్నట్లు విశాల్‌ వెల్లడించాడు. ప్రతి టికెట్ మీద వచ్చే దానిలో ఒక్క రూపాయి ఇస్తారన్నమాట.  మరీ చీప్‌గా 'ఒక్క రూపాయి' ఏంటనుకుంటున్నారా.? ఇదీ ఉడతా భక్తి సాయమట. సాయం సంగతేమోగానీ, ఈ పేరుతో విశాల్‌ సినిమా 'తుప్పరివాలన్‌'కి విపరీతమైన పబ్లిసిటీ వచ్చిపడే అవకాశముందండోయ్‌. 

తమిళనాడులో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మాటకొస్తే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. తమిళనాడులో పరిస్థితి ఇంకాస్త దయనీయంగా వుందంతే. ఢిల్లీ వేదికగా తమిళ రైతులు తమను ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆందోళనలు చేశారు. నగ్నంగా ఢిల్లీ నడివీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. అయినా, ప్రభుత్వాలు కదిలిరాలేదాయె. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు రైతులకు మద్దతుగా నిలబడ్డారు కూడా. అందులో విశాల్‌ కూడా వున్నాడు. 

మొత్తమ్మీద, తన కొత్త సినిమా 'తుప్పరివాలన్‌' పబ్లిసిటీ కోసం విశాల్‌ 'ఒక్క రూపాయి'తో భలే 'స్టంట్‌' చేస్తున్నాడన్నమాట. మరి, ఈ స్టంట్‌ వర్కవుట్‌ అవుతుందా.? వేచి చూడాల్సిందే.