Home > Movies - Movie News
రానా, కాజల్‌.. నువ్వులేక నేను లేను.!

రానా, కాజల్‌ అగర్వాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' స్పెషల్‌ టీజర్‌ తాజాగా విడుదలయ్యింది. కాజల్‌ అగర్వాల్‌ 32వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్‌ టీజర్‌ని విడుదల చేశారు.

ఇందులో కాజల్‌ కళ్ళకున్న గంతల్ని హీరో రానా విప్పుతున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో అదిరిపోయే మ్యూజిక్‌.. కళ్ళకు గంతలు విప్పే కార్యక్రమం పూర్తయ్యాక, 'నా పేరు రాధా జోగేంద్ర.. రాధ లేనిదే జోగేంద్ర లేడు..' అంటూ రాణా చెప్పే డైలాగ్‌ వస్తుంది. 

కాజల్‌ అగర్వాల్‌కి తొలి తెలుగు సినిమా 'లక్ష్మీకళ్యాణం'. దాదాపు పదేళ్ళ కెరీర్‌లో కాజల్‌ ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసింది. 'మగధీర' లాంటి సూపర్‌ సక్సెస్‌ మాత్రమే కాదు, డిజాస్టర్స్‌ కూడా ఆమె ఖాతాలో వున్నాయి.

నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.. ఇంకా కాజల్‌ స్టార్‌డమ్‌ తెలుగులో అలాగే వుంది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'బ్రహ్మూెత్సవం' వైఫల్యాల తర్వాత, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా రూపంలో మరో బంపర్‌ హిట్‌ కాజల్‌ ఖాతాలో చేరింది. 

దశాబ్దానికి పైగా సాగిన, సాగుతున్న కాజల్‌ కెరీర్‌లో ఆమె మొత్తం 50 సినిమాలు చేసింది. తొలి సినిమా 'లక్ష్మీకళ్యాణం', 50వ సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' తేజ డైరెక్షన్‌లోనే కావడం గమనార్హం. 32వ పుట్టినరోజు శుభాకాంక్షలు, 50వ సినిమా.. ఈ రెండు అకేషన్స్‌ నేపథ్యంలో 'నేనే రాజు నేనే మంత్రి' టీమ్‌ ఈ స్పెషల్‌ టీజర్‌ని తీసుకొచ్చింది. 

'నువ్వు లేక నేను లేను..' అనే స్థాయిలో రాధా - జోగేంద్ర 'బంధం' గురించి టీజర్‌ విడుదల చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' టీమ్‌ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసిందనే చెప్పొచ్చు.