Advertisement


Home > Movies - Movie News
రాజమౌళీ.. అది నిజమేనా.?

టాలీవుడ్‌ 'జక్కన్న' రాజమౌళి లండన్‌కి వెళ్ళాడు. సినిమా పనుల నిమిత్తం కాదు, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం. అమరావతికి సంబంధించి అసెంబ్లీ, హైకోర్టు తదితర భవనాల డిజైన్ల విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజమౌళిని సంప్రదించడం, తన ఆలోచనల్ని రాజమౌళి ద్వారా లండన్‌కి చెందిన నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థకు తెలియజేయడం.. ఇదీ అసలు కథ. 

'చంద్రబాబు ఆలోచనల్ని, నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థకి వివరించడమే నా పని.. అంతే తప్ప, అమరావతి డిజైన్లలో నా ప్రమేయం పెద్దగా వుండదు.. నేనేమీ, వాటిని డిజైన్‌ చేయడంలేదు..' అని రాజమౌళి ఈ ఎపిసోడ్‌పై గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే, 'బాహుబలి' సినిమాలోని 'మాహిష్మతి' సామ్రాజ్యాన్ని చూసి, చంద్రబాబు - రాజమౌళి మీద మమకారం పెంచుకున్నారనీ, ఈ నేపథ్యంలోనే అమరావతి డిజైన్ల కోసం రాజమౌళిని చంద్రబాబు ప్రత్యేకంగా 'నియమించుకున్నారనీ' గుసగుసలు ఇంకా విన్పిస్తూనే వున్నాయి. 

ఆ సంగతి పక్కన పెడితే, లండన్‌కి వెళ్ళిన రాజమౌళి - నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థతో చర్చలు జరిపారు. అక్కడో వర్క్‌ షాప్‌ కూడా జరిగింది. రాజమౌళితోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రతినిథుల బృందం కూడా లండన్‌కి వెళ్ళిందండోయ్‌. ఇంతా చేసి, అక్కడ రాజమౌళి సూచించిన మార్పులతో కూడిన కొత్త డిజైన్ల పట్ల చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారన్నది తాజాగా విన్పిస్తోన్న గుసగుసల సారాంశం. 

'పాత డిజైన్లతోనే ముందుకు వెళదాం..' అంటూ నార్మన్‌ ఫోస్టర్స్‌ సంస్థకి చంద్రబాబు సంకేతాలు కూడా పంపారట. దాంతో, సహజంగానే రాజమౌళి ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈమాత్రందానికి రాజమౌళిని వార్తల్లోకెక్కించి, వివాదాలకు కేంద్ర బిందువుగా చేయడమెందుకట.? అయినా, చంద్రబాబుకి ఇలాంటివి అలవాటే.! తాజా బాధితుడు రాజమౌళి.. అంతే అనుకోవాలి.