Advertisement


Home > Movies - Movie News
రోజా కంటే బెటర్‌ ఆప్షన్‌ ఇంకెవరు.?

రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తానంటోన్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సెట్స్‌ మీదకు వెళ్ళి, ప్రేక్షకుల ముందుకొచ్చేదాకా ఆ సినిమాపై అనుమానాలు అలాగే వుంటాయి. ఎందుకంటే, అక్కడున్నది రామ్‌గోపాల్‌ వర్మ. ఈలోగా వర్మ, తనకు కావాల్సిన పబ్లిసిటీ సంపాదించేసుకుంటాడు. అదే ఆయన ప్రత్యేకత. వర్మ పబ్లిసిటీ సంగతేమోగానీ, వర్మ తన సినిమా కోసం ఎంచుకునే కాన్సెప్ట్‌, సహజంగానే సమాజంలో కొంత అలజడిని అయితే సృష్టించేస్తుందనుకోండి.. అది వేరే విషయం. 

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కథాంశమేంటో వర్మ, టైటిల్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు. పైగా, ఈ సినిమాకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి నిర్మాత. నటీనటులు ఎవరన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. లక్ష్మీపార్వతి పాత్రలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వర్మ ఖండించలేదు, సమర్థించలేదు. మరోపక్క, ప్రకాష్‌రాజ్‌ - ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తాడంటూ ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. 

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టైటిల్‌ కాబట్టి, ఎన్టీఆర్‌ పాత్రకు వుండే ప్రాధాన్యతకు సమానంగా, ఇంకొంచెం ఎక్కువగా లక్ష్మీపార్వతి పాత్రకు వుంటుంది. సో, ఆ లెక్కన ఆ పాత్రకి రోజా అయితే పెర్‌ఫెక్ట్‌ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా, స్వర్గీయ ఎన్టీఆర్‌ అంటే రోజాకి ప్రత్యేకమైన అభిమానం. ఆ ఛాన్స్‌ వస్తే, ఆమె వదులుకునే అవకాశమే వుండదు. 

మొత్తమ్మీద, వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళడమే నిజమైతే అందులో ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి పాత్రలు - ఆ పాత్రల్లోని పాత్రధారులు వెరీ వెరీ స్పెషల్‌ అవుతారన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే, వీరప్పన్‌ పాత్ర కోసం, వంగవీటి రంగా పాత్ర కోసం, పరిటాల రవి కోసం ఆయా సినిమాల్లో వర్మ ఎంపిక చేసిన నటులు, ఆ నటులు ఆ పాత్రల్లో ఒదిగిపోయిన వైనం చాలా చాలా ప్రత్యేకం.