Home > Movies - Movie News
రోజాకి జబర్‌దస్త్‌ తలనొప్పి.!

ఓ టీవీ కార్యక్రమంలో పనిచేస్తున్నందుకుగాను, మాజీ క్రికెటర్‌, ఇటీవల పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచి, మంత్రి కూడా అయిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ వివాదాల్లోకెక్కిన విషయం విదితమే. మరి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా 'జబర్దస్త్‌' టీవీ ప్రోగ్రామ్‌లో నటించడం తప్పు కాదా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందిప్పుడు. మంత్రిగా వుండి టీవీ ప్రోగ్రామ్‌లో కన్పించడం వేరు, కేవలం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తూ, తన వృత్తి అయిన నటనను కొనసాగించడం వేరు.

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం విదితమే. ఓ పక్క ఎమ్మెల్యేగా పనిచేస్తూనే, ఇంకోపక్క వెండితెరపై వెలిగిపోతున్నారాయన. ఎమ్మెల్యేని కదా.. అని ఆయనెక్కడ, వెండితెర శృంగారం విషయంలో వెనక్కి తగ్గడంలేదు. పైగా, ఓ సినిమా ఫంక్షన్‌లో 'కన్పిస్తే కడుపు చేసెయ్యడమే..' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య. అది అప్పట్లో పెద్ద వివాదమయ్యిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, 'జబర్దస్త్‌' కామెడీ ప్రోగ్రామ్‌ విషయానికొస్తే, పేరుకి కామెడీ షో అయినా.. అందులో అడల్ట్‌ కంటెంట్‌ ఎక్కువయిపోయిందన్న విమర్శలు ఎప్పటినుంచో విన్పిస్తున్నాయి. అయినాసరే, బుల్లితెరపై నెంబర్‌ వన్‌ షోగా 'జబర్దస్త్‌' ఓ వెలుగు వెలుగుతోంది. తాజాగా, నందనం దివాకర్‌ అనే వ్యక్తి 'జబర్దస్త్‌'కి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సినిమాలకు సెన్సార్‌ వున్నప్పుడు, బుల్లితెరకు ఎందుకు సెన్సార్‌ వుండదన్నది ఆయన వాదన.

మహిళా ఎమ్మెల్యే అయి వుండీ, మహిళల్ని కించపర్చేలా వున్న కామెడీ స్కిట్స్‌, అందులోని పాత్రల్ని ఆమె జడ్జిగా ఎంకరేజ్‌ చేయడమేంటన్న ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతోంది. అయితే, ప్రోగ్రామ్‌ నిర్వహణలో రోజా పాత్ర ఎంత.? అన్నది కీలకమిక్కడ. ఛానెల్‌ యాజమాన్యం బాధ్యత వహించాలే తప్ప, జడ్జిగా వ్యవహరించినంతమాత్రాన రోజాపైనే ఈ రచ్చ ఎంతవరకు సమంజసం.. అన్న వాదనా లేకపోలేదు. అయినాసరే, మహిళా ప్రజా ప్రతినిథి గనుక, రాజకీయంగా, నైతికంగా 'జబర్దస్త్‌' రోజాకి బ్యాడ్‌ నేమ్‌ తీసుకొస్తోందన్నది నిర్వివాదాంశం.