Home > Movies - Movie News
'సంఘమిత్ర' రేంజ్‌ ఆ స్థాయిలోనా.?

తమిళ దర్శకుడు సుందర్‌ తెరకెక్కించనున్న 'సంఘమిత్ర' సినిమాకి సంబంధించి రెండు లుక్స్‌ విడుదలయ్యాయి. వీటిల్లో ఒకటి హీరో ఆర్యకి సంబంధించినది కాగా, ఇంకొకటి శృతిహాసన్‌కి సంబంధించినది. రెండు లుక్స్‌ దేనికదే అన్నట్లుగా వున్నాయన్నది నిర్వివాదాంశం. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో సుందర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండడం గమనార్హం. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. 

'బాహుబలి' స్ఫూర్తితో, గ్రాఫిక్స్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించేందుకు తమిళ, హిందీ పరిశ్రమల్లో ప్రయత్నాలు ఇటీవలి కాలంలో బాగా జోరందుకున్నాయి. అలాంటి ప్రయత్నాల్లో 'సంఘమిత్ర' కూడా ఒకటి. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా విదేశాల్లో 'కత్తి యుద్ధాలకు' సంబంధించిన శిక్షణ తీసుకుంది శృతిహాసన్‌. మరోపక్క, ఆర్య ఇప్పటికే ఆయా విద్యల్లో ప్రావీణ్యం సంపాదించేశాడు. 

'సంఘమిత్ర' సినిమాకి సంబంధించి శృతిహాసన్‌ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు లుక్స్‌నీ భారీ స్థాయిలో డిజైన్‌ చేయడం చూస్తోంటే, సినిమా ఏ స్థాయి భారీతనంతో రూపొందనుందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క, బాలీవుడ్‌లో 'శివాజీ' చారిత్రక గాధను బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ నిర్మించనున్న విషయం విదితమే. 

అందరి అనుమానాల్నీ పటాపంచలు చేస్తూ, 'బాహుబలి ది కంక్లూజన్‌' వెయ్యి కోట్ల వసూళ్ళు దాటేయడంతో, ఇప్పుడంతా ఆ స్థాయి వసూళ్ళే లక్ష్యంగా భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించేందుకు ముందుకొస్తుండడం విశేషమే మరి. అయితే, అన్ని సినిమాలూ 'బాహుబలి'లా ట్రెండ్‌ సెట్టింగ్‌ అవుతాయా.? అవ్వాలనే ఆకాంక్షిద్దాం.