Home > Movies - Movie News
స్నేహమంటే ఇదేనా కమల్‌హాసన్‌.!

స్నేహితుడు.. స్నేహితుడంటూనే రజనీకాంత్‌పై ఎడాపెడా విమర్శలు చేసేయడం కమల్‌హాసన్‌కి కొత్తేమీ కాదు. అందుకే, 'స్నేహం' విషయంలో కమల్‌తో రజనీకాంత్‌ ఒకింత జాగ్రత్తగా వుంటుంటాడు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం నేపథ్యంలో, 'కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్‌ వుంటారు..' అంటూ సెటైర్‌ వేసిన కమల్‌, తాజాగా రజనీకాంత్‌కి భారతీయ జనతా పార్టీనే కరెక్ట్‌.. అంటూ మరో చురక వేసేశాడు. 

కమల్‌హాసన్‌కి కులమతాలతో సంబంధం లేదు. అసలాయన దేవుడ్ని నమ్మడు కూడా. అది ఆయన వ్యక్తిగతం. అలాగని, దేవుడ్ని విశ్వసించేవాళ్ళ మీద సెటైర్లు వేసే నైతిక హక్కు కమల్‌హాసన్‌కి ఎక్కడిది.? రజనీకాంత్‌ భక్తుడు. మామూలు భక్తి కాదు ఆయనది. హిమాలయాలకు వెళ్ళి వస్తుంటాడు రజనీకాంత్‌. అలాగని, తన భక్తిని రజనీకాంత్‌ ఎప్పుడూ ఎవరి మీదా బలవతంగా రుద్దిన దాఖలాలు లేవు. కానీ, కమల్‌ తన భావాల్ని జనం మీద రుద్దేందుకు ప్రయత్నిస్తుంటాడు.. సెటైర్లు వేస్తాడు, విమర్శిస్తుంటాడు, చాలా చాలానే చేస్తాడు. 

కమల్‌హాసన్‌కి భక్తి వున్నంత మాత్రాన భారతీయ జనతా పార్టీలో చేరతాడా.? ఏమో, రజనీకాంత్‌ - బీజేపీలో చేరాలనుకుంటే, అది ఆయనిష్టం. రాజకీయాల్లో రజనీకాంత్‌ని ఆదరిస్తారా.? లేదా.? అన్నది వేరే విషయం. అసలంటూ, రాజకీయ రంగ ప్రవేశం విషయంలోనే రజనీకాంత్‌ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈలోగా కమల్‌హాసన్‌కి తొందర ఆగడంలేదాయె.! 

రాజకీయాలకి కమల్‌ కొత్త. అప్పుడే ఇంత తొందరా.? అయినా, రజనీకాంత్‌ ఇంకా రాజకీయాల్లోకి రాకుండానే ఆయనపై కమల్‌ ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నాడంటే, రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే ఇంకేమన్నా వుందా.? అయినా, రాజకీయాల్లోకి రావాలనుకుంటే రజనీకి కమల్‌ పోటీనా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.