Home > Movies - Movie News
సమ్మర్ ఎఫెక్ట్.. విదేశాలకు క్యూ కడుతున్న హీరోలు

ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. చల్లగా ఎక్కడైనా సెటిల్ అయిపోతే సూపర్ అని ఎవరికైనా అనిపిస్తుంది. ఔట్ డోర్ లో మండుటెండల్లో షూటింగ్ చేసే హీరోలకు ఈ కోరిక మరింత ఎక్కువ. అందుకే దాదాపు హీరోలంతా ఫారిన్ టూర్స్ ప్లాన్ లో ఉన్నారు. కొందరు తమ సినిమాల షెడ్యూల్స్ ను విదేశాల్లో ప్లాన్ చేసుకుంటుంటే, మరికొందరు సినిమాలకు గ్యాప్ ఇచ్చి చల్లగా చెక్కేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈమధ్యే పూరిజగన్నాధ్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. త్వరలోనే యూనిట్ అంతా యూరోప్ టూర్ ప్లాన్ చేసింది. కథ ప్రకారం అక్కడ కొన్ని సన్నివేశాలు తీస్తారట. అటు మహేష్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ ను విదేశాల్లోనే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు సంబంధించి సాంగ్ షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లబోతున్న మహేష్... కొరటాల శివ సినిమా షెడ్యూల్స్ ను లండన్ లో  ప్లాన్ చేశాడట.

నితిన్, మంచు విష్ణు, అఖిల్, రవితేజ కూడా ఫారిన్ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. తన కొత్త సినిమా కోసం అమెరికా షెడ్యూల్ ఖరారు చేసుకున్నాడు నితిన్. అటు మంచు విష్ణు కూడా ఆచారి అమెరికా యాత్ర సినిమా కోసం యూఎస్ టూర్ స్టార్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పాండిచ్చేరిలో షూటింగ్ చేస్తున్న రవితేజ కూడా మరోసారి విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేశారట. అఖిల్ కూడా తన కొత్త సినిమాతో సంబంధం లేకుండా కొన్నాళ్ల పాటు అమెరికాలో ఉండి రావాలనే ఆలోచనలో ఉన్నాడట.