Advertisement


Home > Movies - Movie News
తేజ మారాడు.. చాలా చాలా మారాడు.!

రాక రాక హిట్టొచ్చింది.. ఇకనేం, ఫుల్‌ ఖుషీ అయిపోతున్నాడాయన. ఎలాంటోడు, ఎలాగయిపోయాడు.? అని జనం అనుకున్నారు ఇన్నాళ్ళూ. 'పోన్లే సక్సెస్‌ వచ్చింది..' అని జనం అనుకుంటోంటే, ఇంకొందరేమో, అతనికెంత కష్టమొచ్చిందో.. అంట ఆ కొత్త కష్టం గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఆయనెవరో కాదు, దర్శకుడు తేజ. 

'చిత్రం', 'జయం', 'నువ్వు నేను' ఈ మూడు సినిమాలతో తేజ స్టార్‌ డైరెక్టర్‌ అయిపోయాడు. సక్సెస్‌ మాత్రమే కాదు, అంతకు మించిన 'కిక్‌' తేజలో కన్పించేది అప్పట్లో. తేజ చెయ్యి పడితే చాలు, తమ జన్మ ధన్యమైపోయినట్లేనని చాలామంది భావించేవారు. అందుకే, తేజతో చెంప దెబ్బలు తినడానికీ వెనుకాడేవారు కాదు. కొత్తవారిని వెండితెరకి పరిచయం చేయడంలో తేజ ప్రత్యేకతే వేరు. తేజ, ఏదన్నా సినిమా చేస్తున్నాడంటే చాలు.. ఆ సినిమాపై విపరీతమైన హైప్‌ వుండేది. 

కానీ, తేజ దూకుడే అతన్ని వెనక్కి నెట్టేసింది. 'ఎవరి మాటా వినడు' అనే నైజమే టాప్‌ డైరెక్టర్‌ అనే ప్లేస్‌ నుంచి ఫ్లాప్‌ డైరెక్టర్‌ అనే స్థాయికి పడేసింది. ఇంతలోనే అనూహ్యంగా అవకాశం.. అదీ రానాతో. ఎలాగైతేనేం, రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తీసి హిట్టు కొట్టాడు. 'ఈ సినిమాతో తేజ కూడా హిట్టు కొట్టగలడు' అని నిరూపితమయ్యిందని సాక్షాత్తూ తేజ చెప్పడం గమనార్హం. 

'ఈ సక్సెస్‌ నా ఒక్కడిదే కాదు. నేనేది చేసినా, నన్ను ప్రశ్నించేవారు.. ఆ ప్రశ్నల్లోంచే కొత్తదనం పుట్టుకొచ్చింది.. తప్పిదాలన్నీ కవర్‌ అయిపోయాయి..' అని తేజ చెప్పడమంటే, తేజ చాలా చాలా చాలా మారినట్టే. నేను అన్న మాట దగ్గరనుంచి 'మేము' అన్నదాకా వచ్చింది పరిస్థితి. 'నేనొక్కడ్నే కష్టపడితే సరిపోదు. నాకు సరైన టీమ్‌, సరైన నటీనటులు దొరకడం వల్లే మంచి విజయాన్ని అందుకున్నాను..' అని సెలవిచ్చాడు తేజ. 

అంతా బాగానే వుందిగానీ, తేజలోని ఈ మార్పు ఇకపై చేయబోయే సినిమాలకీ 'ఇంప్రూవ్‌' అవుతుందా.? మళ్ళీ తేజ మునుపటిలా దర్శకుడిగా స్టార్‌డమ్‌ అందుకుంటాడా.? వేచి చూడాల్సిందే.