Home > Movies - Movie News
త్రిష.. రాజకీయంపై లౌక్యమైన సమాధానం!

మొత్తానికి మళ్లీ ట్విటర్లో యాక్టివ్ అయ్యింది త్రిష. ఆ మధ్య జల్లికట్టు వ్యవహారం అప్పుడు ఈ అమ్మడు పెట్టిన ట్వీట్లు తమిళులకు ఆగ్రహాన్ని కలిగించాయి. దీంతో ఆమె ట్విటర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం జరిగే పని కాదు కదా సెలబ్రిటీలకు. అందుకు త్రిష మళ్లీ ట్విటర్లో యాక్టివ్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఈమె అభిమానులతో చాట్ చేసింది. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలే వచ్చి పడ్డాయి త్రిషకు. ప్రత్యేకించి రాజకీయ సంబంధమైనవి. త్రిషకు రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువే. అది కూడా జయలలితకు పెద్ద ఫ్యాను. జయ బతికున్న రోజుల్లోనే ఈమె అన్నాడీఎంకే వైపు చూసిందని అంటారు. అయితే.. అప్పటికి సినిమా అవకాశాలు బాగానే ఉండటంతో అటువైపు వెళ్లలేదు.

అయితే జయలలితను తన ఫేవరెట్ నాయకురాలిగా త్రిష తరచూ చెబుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే మాటే చెప్పింది ఈ అమ్మడు. జయలలిత తన ఫేవరెట్ లేడీ అని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు జయలలితను అభిమానించినా, అభిమానించకపోయినా.. పెద్దగా పోయేది, వచ్చేది ఏమీ లేదు. తమిళ రాజకీయం ఇప్పుడు రూటు మారింది కదా.. రజనీయా, కమలా? అని అడిగే సందర్భం వచ్చేసింది. మరి ఇదే ప్రశ్న త్రిషకు కూడా ఎదురైంది.

దానికి చాలా లౌక్యమైన సమాధానం ఇచ్చింది ఈ హీరోయిన్. ఈ ప్రశ్నకు సమాధానాన్ని దాట వేస్తూనే.. త్రిష సమాధానం ఇచ్చింది. ఈ అంశంపైగురించి ఇప్పుడు తను స్పందించనని స్పష్టం చేసింది. రాజకీయంగా రజనీకి మద్దతుగా ఉంటారా, కమల్ కా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ, వాళ్లిద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాకా తను స్పందిస్తానని చెప్పింది. మరి ఎటో ఒక వైపు అని చెప్పి ఇబ్బందులను ఎదుర్కొనడం కంటే.. వాళ్లొచ్చినప్పుడు చెప్తా అనడం ద్వారా త్రిష సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది.