Home > Movies - Movie News
ఉదయ్ కిరణ్ విషాద ‘చిత్రం‘

తెరంగేట్రం చేస్తూనే హిట్టు మీద హిట్టు కొట్టాడు. ఒకదాన్ని మించి ఇంకోటి హిట్టు.. ఇంకేముంది, టాలీవుడ్‌లో టాప్‌ హీరో అయిపోతాడని అంతా అనుకున్నారు. అయితే ఫెయిల్యూర్స్ వచ్చాయి.. నిలదొక్కుకోకగలననే ధీమాతో ఉండేవాడు.. కానీ, అర్థాంతరంగా జీవితాన్ని ముగించేసుకున్నాడు. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అది. 'చిత్రం' సినీ రంగంలోకి వచ్చాడు.. అంతే 'చిత్రం'గా అంతర్థానమైపోయాడు. అతనే ఉదయ్‌కిరణ్‌. 

సరిగ్గా రెండేళ్ళ క్రితం ఇదే రోజున.. అంటే, జనవరి 5వ తేదీన తెలుగు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు ఉదయ్‌కిరణ్‌ మరణ వార్త విని. చాలామంది ఈ వార్తని నమ్మలేదు. ఎందుకంటే, తెలుగులో సినిమాలు చేస్తున్నాడు.. తమిళంలోనూ సినిమాలు చేశాడు. అక్కడ కాకపోతే, ఇక్కడ.. ఇక్కడ కాకపోతే అక్కడ.. హీరోగా ఛాన్సులు రాకపోతే, ఇతర పాత్రల్లోకైనా ఒదిగిపోతాననే ధైర్యం అతని మాటల్లో కనిపించేది. అలాంటి ఉదయ్‌కిరణ్‌, ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మదగ్గ విషయం కాదు. కానీ, నమ్మలేని నిజం ఇది. 

ఉదయ్‌కిరణ్‌ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అది ఆయన కుటుంబంలో వివాదాలకు కారణమయ్యింది. ఇంకోపక్క కెరీర్‌లో సక్సెస్‌లు లేవు. ఈ సమయంలోనే ఓ సినిమాకి తనే స్వయంగా ఖర్చుపెట్టాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అంతే, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. 'పార్టీకి వెళదాం..' అని భార్య చెబితే, 'నేను రాలేను.. నువ్వు వెళ్ళు.. వచ్చి రిసీవ్‌ చేసుకుంటా..' అని భార్యకు చెప్పిన ఉదయ్‌కిరణ్‌, ఆ తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇదీ ఉదయ్‌కిరణ్‌ మరణం తర్వాత వెలుగు చూసిన విషయం. 

కారణాలేవైతేనేం.. బోల్డంత కెరీర్‌ వుంటుందనీ.. కెరీర్‌లో దూసుకుపోతాడనీ అంతా భావించినప్పటికీ ఉదయ్‌కిరణ్‌, తెలుగు సినిమాకి అన్యాయం చేశాడు.. తెలుగు ప్రేక్షకుల్ని పుట్టెడు దుఃఖంలో ముంచేశాడు.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కాలం కలిసొస్తే, టాలీవుడ్‌లో ఓ పెద్ద కుటుంబంలో తానూ ఒకడయ్యేవాడు. సరైన సక్సెస్‌ దొరికి వుంటే, యంగ్‌ హీరోల్లో తానూ ఒకడయ్యేవాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వుండి వుంటే ఒకటీ అరా సినిమాలతో అయినా ఉదయ్‌కిరణ్‌ తెరపై కన్పించేవాడు. 

తెలుగు సినిమా ఆయన్ని అక్కున చేర్చుకోలేదు.. 'మాది తెలుగు సినిమా కుటుంబం.. మేం తెలుగు సినీ కళామతల్లి బిడ్డలం..' అని చెప్పుకునే ఏ సినీ ప్రముఖుడూ ఉదయ్‌కిరణ్‌ని కష్టకాలంలో ఆదుకోలేదు.. ఉదయ్‌కిరణ్‌ చనిపోయాక, 'తెలుగు సినీ పరిశ్రమ ఓ యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరోని కోల్పోయింది..' అంటూ తెలుగు సినీ ప్రముఖులు కంటతడి పెట్టారు. ఉదయ్‌కిరణ్‌కి ముందూ.. తర్వాతా తెలుగు సినీ రంగంలో బలవన్మరణాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. కానీ, తెలుగు సినీ పరిశ్రమ, తన బిడ్డల్ని ఆదుకోలేకపోతోందనీ, అక్కున చేర్చుకోలేకపోతోందనే విమర్శలకు కొదవ లేదు. 

ఏదిఏమైనా.. ఓ కిరణం అంతర్ధానమైపోయింది.. ఉదయ్‌కిరణ్‌ మరణానంతరం 'చిత్రం చెప్పిన కథ' సినిమా రిలీజ్‌ అయ్యింది.. ఎంతో ఇష్టపడి ఉదయ్‌కిరణ్‌ చేసిన సినిమా అది. తొలి సినిమా 'చిత్రం' అయితే, చివరి సినిమా 'చిత్రం చెప్పిన కథ'. చిత్రంగా రెండూ 'చిత్రం'తో ముడిపడి వున్నవే. కానీ, ఉదయ్‌కిరణ్‌ 'చిత్ర'కథ అర్థాంతరంగా ముగిసిపోయిందంతే.