Home > Movies - Movie News
ఉప్పీ దాదా: రీల్‌ టు రియల్‌ రాజకీయం.!

అభిమానులు ముద్దుగా ఉప్పీదాదా అని పిలుచుకుంటారాయన్ని. కన్నడలో స్టార్‌ హీరో. తెలుగు, తమిళ సినిమాల్లోనూ పాపులర్‌. పరిచయం అక్కర్లేని పేరది. ఈ మధ్యనే తెలుగులో 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' సినిమాలో కన్పించాడు. అతనే, ఉపేంద్ర. సినిమాల ఎంపికలో విలక్షణత చూపే ఉపేంద్రకి, సామాజిక అంశాలపై కాస్తంత శ్రద్ధ ఎక్కువే. వ్యవస్థలోని లోపాల్ని కడిగిపారేయాలనకుంటాడు.. అందుకు తన సినిమాల్ని వేదికలుగా చేసుకుంటుంటాడు. 

ఇక, ఇప్పుడు రీల్‌ రాజకీయం పక్కన పెట్టి, రియల్‌ రాజకీయంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అలాగని, సినిమాలకి గుడ్‌ బై చెప్పాలనే ఉద్దేశ్యమేదీ అతనికి లేదట. 'రాజకీయాల్లోకి రావాల్ని ఆవశ్యకతను గుర్తించాను.. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలి. రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలకు సేవ చేయడంతోపాటుగా, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నది నా ఆలోచన..' అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు ఉపేంద్ర. 

ఇంతకీ, ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నాడా.? ఏదన్నా రాజకీయ పార్టీలో చేరుతున్నాడా.? ఈ ప్రశ్నకు మాత్రం క్లారిటీతో కూడిన సమాధానం లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి ఉపేంద్రకి ఆఫర్‌ వచ్చిందన్నది కన్నడ సినీ, రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. నిజమేనా.? ఏమోగానీ, 2019 ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా ఉపేంద్ర కొత్త అవతారమెత్తే అవకాశం వుందన్నది నిర్వివాదాంశం. 

అన్నట్టు, తమిళనాడులో కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ రాజకీయ తెరపై కన్పించడానికి ఉవ్విళ్ళూరుతున్న విషయం విదితమే. తెలుగునాట పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో హల్‌చల్‌ చేయాలనుకుంటున్నాడు. మొత్తమ్మీద, దక్షిణాది రాజకీయాల్లో సినీ గ్లామర్‌ ఈ సారి ఓ రేంజ్‌లో కన్పించబోతుందన్నమాట.