Advertisement


Home > Movies - Movie News
చావడానికి ముందే ‘నో మోర్’ మెసేజీలు!

కమెడియన్ విజయ్ మరణం... ఇవాళ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చిన్న నటులకు ఉన్న అనేక రకాల ఇబ్బందికరమైన ధోరణులకు నిదర్శనం. ఎంతో మానసిక సంఘర్షణ, వేదన తరువాత విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే నెమ్మదిగా తెలుస్తున్న వివరాల మేరకు... విజయ్ తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన పరిచయస్తులు, శ్రేయోభిలాషులు అనుకునే పలువురికి మెసేజీలు పెట్టాడుట! ‘విజయ్ ఈజ్ నో మోర్’ అంటూ తన మంచి కోరే వారని నమ్మిన వారందరికీ మెసేజీలు పెట్టినట్టుగా తెలుస్తోంది.

చాలా తక్కువ కాలం సినీ ప్రస్థానంతోనే కడతేరిపోయిన జీవితాల్లో మరొకటిగా విజయ్ జీవితం ముగిసిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పొసగని సంసారం, వారి మధ్య క్రమంగా పెరిగిన విభేదాలు, ఆర్థిక ఇబ్బందుల ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి.. విజయ్ ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి బలవన్మరణాలు సినీ పరిశ్రమలో కొత్త కాదు. పుంఖాను పుంఖాలుగా ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. వార్తల్లో ప్రధానంగా కనిపించేంత సినీ గుర్తింపు కూడా రాకముందే కడతేరిపోయే జీవితాలు, సినీ ఆశలతో నగరానికి వచ్చి, దానికి సంబంధం ఇతర పనులతో పొట్టపోసుకుంటూ.. ఆ అసంతృప్తితో కడతేరిపోయే జీవితాలు అనేకం ఉంటూ ఉంటాయి.

అయితే ఇక్కడ కమెడియన్ విజయ్ జీవితం.. చిన్న పాత్రలు పోషిస్తూ సినీ రంగం ఒక ఆలంబనగా బతుకుతున్న వారికి ఒక కనువిప్పు కావాలి. చిన్న పాత్రలతో ప్రస్థానం సాగుతున్నప్పుడు.. తాహతుకు మించిన ప్రయోగాలకు వెళ్లడం, అందని ద్రాక్ష పళ్లకోసం అర్రులు చాచడం..  ఆ ప్రయత్నంలో ఆర్థిక ఒత్తిళ్ల ఊబిలో కూరుకుపోవడం ఇలాంటివి.. జరగకుండా చూసుకోవాలి.

విజయ్ ఎంత మధన పడ్డాడో గానీ.. చచ్చిపోవాలనే ఆలోచనతో ఎన్ని గంటలపాటూ నరకం అనుభవించాడో గానీ.. చావడానికి కొద్ది సమయం ముందే.. తనకున్న పరిచయస్తుల్లో చాలా మందికి ‘విజయ్ ఈజ్ నో మోర్’ అంటూ మెసేజుల కూడా పెట్టి చనిపోవడం అనేది ఇప్పుడు పలువురిని కలచివేస్తోంది.