Advertisement


Home > Movies - Movie News
విశాల్‌ కోర్టు మెట్లెక్కాల్సిందే.. తప్పదిక.!

పొలిటికల్‌ పందెంలో తొలిమెట్టు ఎక్కడానికే కిందామీదా పడాల్సి వస్తోంది సినీ నటుడు విశాల్‌కి. తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న విశాల్‌కి 'కాలం' కలిసిరావట్లేదు. నాటకీయ పరిణామాల మధ్య విశాల్‌ నామినేషన్‌ని తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు. అంతకు ముందూ హైడ్రామా కొనసాగింది. 

విశాల్‌ నామినేషన్‌ ముందే తిరస్కరణకు గురయ్యింది. విశాల్‌ నామినేషన్‌ని సమర్థిస్తూ సంతకాలు చేసిన పదిమందిలో ఇద్దరి సంతకాలు ఫేక్‌ అని తేలడమే ఇందుకు కారణం. అయితే, అదంతా ఉత్తదేనని, ప్రత్యర్థుల రాజకీయ కుట్ర అని విశాల్‌ ఆరోపించడంతోపాటు, సంబంధిత ఆడియో క్లిప్‌ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి విశాల్‌ సమర్పించారు. అభిమానులు, అనుచరులతో ఆందోళన కూడా చేశాడు విశాల్‌. అవసరమైతే కోర్టుకెళతాననీ నినదించాడు. విశాల్‌ సమర్పించిన ఆడియో క్లిప్‌ని పరిశీలించి, విశాల్‌ నామినేషన్‌ని స్వీకరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

'ప్రజాస్వామ్యం గెలిచింది..' అంటూ విజయగర్వంతో అక్కడినుంచి విశాల్‌ టీమ్‌ బయటకు వెళ్ళింది. అంతే, మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. ఎవరైతే ఫేక్‌ మద్దతుదారులని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, వారే స్వయంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వెళ్ళి, విశాల్‌కి మద్దతుగా తాము సంతకాలు చేశామనడం కరెక్ట్‌ కాదనీ, అవి తమ సంతకాలు కాదని వివరణ ఇచ్చారు. ఇది ఫైనల్‌.. అంటూ, రాత్రి 11 గంటల సమయంలో విశాల్‌ నామినేషన్‌ని తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా ధృవీకరిస్తూ, ఓ లేఖని విడుదల చేశారు. 

ఊహించని ఘటనతో షాక్‌ అయిన విశాల్‌ వర్గం, ప్రజాస్వామ్యంలో అత్యంత దారుణమైన సందర్భమిది.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నామినేషన్‌ తిరస్కరణపై కాస్సేపట్లో విశాల్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. రాత్రంతా, సన్నిహితులతో ఈ విషయమై విశాల్‌లో చర్చల్లో మునిగిపోయారట. కోర్టుకి వెళితే, పరిస్థితి మనకు అనుకూలంగా వస్తుందా.? రాదా.? అన్న విషయమై భిన్న కోణాల్లో ఈ చర్చలు జరిగాయట. ఫలితం ఎలా వచ్చినా, పోరాటం అయితే చేసి తీరాలంటూ విశాల్‌, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.