Advertisement


Home > Movies - Movie News
విశాల్‌కి భలే సపోర్ట్‌ దొరికేసింది

హీరో విశాల్‌, తమిళనాడులో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న విషయం విదితమే. తమిళనాడులోని ఆర్‌కె నగర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు విశాల్‌. ఇదే నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జయలలిత మరణంతో ఏడాదిగా ఈ నియోజకవర్గం ఖాళీగా వుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఉప ఎన్నికని తీసుకున్నాయి. 

ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించేయగా, నామినేషన్ల ప్రక్రియ కూడా షురూ అయిపోయింది. నామినేషన్‌ దాఖలు చేసేముందు విశాల్‌, జయలలిత సమాధి వద్ద నివాళులర్పించడం, ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌ తదితరులకూ నివాళులర్పించడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యింది. 

మరోపక్క, తాజాగా విశాల్‌కి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత, సినీ నటి ఖుష్బూ నుంచి మద్దతు లభించింది. 'నువ్వేంటో నాకు తెలుసు.. నీ కమిట్‌మెంట్‌ ఏంటో నాకు తెలుసు..' అంటూ విశాల్‌కి ఖుష్బూ 'ఆల్‌ ది బెస్ట్‌' చెప్పడం గమనార్హం. విశాల్‌ తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాదు, నిర్మాతగానూ విశాల్‌కి మంచి పేరుంది. నడిగర్‌ సంఘం ఎన్నికల్లో సత్తా చాటిన విశాల్‌, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ తమిళనాడులో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. 

అయితే, సినీ ఇమేజ్‌ వేరు.. రాజకీయం వేరు. అదే సమయంలో సినీ గ్లామర్‌ ఎంతో కొంత రాజకీయాల్లో ఉపయోగపడ్తుందన్నది నిర్వివాదాంశం. ఖుష్బూ సపోర్ట్‌ పట్ల విశాల్‌, ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతుండగా, కమల్‌హాసన్‌ నుంచి కూడా విశాల్‌కి మద్దతు లభించిందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద, అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చిన విశాల్‌, ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో సమ్‌థింగ్‌ స్పెషల్‌ అన్పించుకునేలానే వున్నాడు.