Advertisement


Home > Movies - Movie News
విశాల్‌ 'పట్టు' వదలని విక్రమార్కుడు

తమిళ హీరో విశాల్‌ తమిళనాడులోని ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక కోసం చాలా కష్టపడ్తున్నాడు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేద్దామనుకున్నాడుగానీ కుదరలేదు. నామినేషన్‌ ప్రక్రియలో బొక్క బోర్లా పడ్డాడు విశాల్‌. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విశాల్‌ నామినేషన్‌ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తోసిపుచ్చిన విషయం విదితమే. 

ఇక, ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించిన విశాల్‌, ప్రధాని నరేంద్రమోడీకీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కీ ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక్కడితో సినిమా అయిపోలేదు. తాజాగా, ఈ రోజు మీడియా నుంచి విశాల్‌కి ఓ సమాచారం అందిందట. నామినేషన్‌లో విశాల్‌కి మద్దతుగా నిలిచి, హ్యాండిచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ముందుకు తీసుకెళితే, విశాల్‌ మళ్ళీ బరిలో నిలిచేందుకు ఛాన్స్‌ వుంటుందన్నది ఆ సమాచారం తాలూకు సారాంశమట. 

ఉదయం నుంచీ సోషల్‌ మీడియాలో విశాల్‌ ఈ విషయమై పెద్ద 'స్టంటే' చేస్తున్నాడు. 3 గంటల సమయానికి తాను ఆ ఇద్దరితో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ముందుకు వెళతానని పేర్కొన్నాడు విశాల్‌ సోషల్‌ మీడియాలో. గంట గంటకీ అప్‌డేట్స్‌ ఇస్తూ వచ్చాడు ఈ విషయమై. కానీ, ఏమయ్యిందో.. 'ఆ ఇద్దరి ఆచూకీ కనుగొనడంలో విఫలమయ్యాను.. ఇప్పుడు ఆ ఇద్దరి ప్రాణాలకు హాని జరుగుతుందేమోనన్న అనుమానం నాకు కలుగుతోంది..' అంటూ టైమ్‌ దగ్గరపడ్డాక పోస్ట్‌ చేశాడు విశాల్‌. 

మొత్తం పది మద్దతుతో కూడిన సంతకాల్ని విశాల్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అఫిడవిట్‌తోపాటు సమర్పించగా, అందులో దీపన్‌, సుమతి అనే ఇద్దరు వ్యక్తుల సంతకాలకు సంబంధించి వివాదం తలెత్తిన విషయం విదితమే. ఆ ఇద్దర్నీ కొందరు బెదిరించారంటూ ఓ ఆడియో క్లిప్‌ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి విశాల్‌ సమర్పించడం, దాంతో అప్పటికే తిరస్కరించిన విశాల్‌ నామినేషన్‌ని అంగీకరిస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి పేర్కొనడం, ఆ తర్వాత 'అవి మా సంతకాలు కావు..' అని సుమతి, దీపన్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి స్వయంగా చెప్పడంతో విశాల్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురవడం తెల్సిన విషయాలే. 

మొత్తమ్మీద, సూపర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాల్లోనూ ఇన్ని ట్విస్టులు వుండవేమో. ఈ మొత్తం ఎపిసోడ్‌ చూశాక విశాల్‌, పట్టువదలని విక్రమార్కుడిలా కష్టపడుతున్నాడుకోవాలా.? నామినేషన్‌ వేయడం చేతకాదనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా పిల్లిమొగ్గలు వేస్తున్నాడనుకోవాలా.?