Home > Movies - Movie News
వైసీపీ ఎన్టీఆర్‌ సరే, టీడీపీ ఎన్టీఆర్‌ ఎక్కడ.!

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్‌ సినిమా తెరకెక్కబోతోంది. నిజానికి ఈ సినిమా పేరు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అయినాగానీ, ఈ చిత్ర నిర్మాత వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కావడం, సినిమా టైటిల్‌లోని 'లక్ష్మి' (స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మిపార్వతి) ప్రస్తుతం వైఎస్సార్సీపీలో వుండడంతో ఈ సినిమా ఖచ్చితంగా వైఎస్సార్సీపీ ఎన్టీఆర్‌ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్ష్మీపార్వతి కోణంలో కాదు, వైఎస్సార్సీపీ కోణంలో ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను వర్మ దర్శకత్వంలో మనం చూడబోతున్నాం. 

ఇక, తెలుగుదేశం పార్టీ కోణంలో మరో ఎన్టీఆర్‌ సినిమా రాబోతోన్న విషయం విదితమే. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో నటించడమే కాదు, ఈ సినిమాని నిర్మిస్తారు కూడా. కానీ, ఇంతవరకు ఈ సినిమాపై అధికారిక ప్రకటన లేదు. కథ, దర్శకత్వం.. ఇవేవీ ఇంకా ఫైనల్‌ కాలేదు. వర్మతో వ్యవహారం అలా కాదు. ఆలోచన వచ్చిందే తడవు సినిమా తెరకెక్కించేయాలనుకుంటాడు. అఫ్‌కోర్స్‌ అన్ని సందర్భాల్లోనూ వర్మ సినిమాలు పట్టాలెక్కేయలేదనుకోండి.. కొన్ని ప్రకటనలకే పరిమితమయ్యాయనుకోండి.. అది వేరే విషయం. 

'వైఎస్సార్సీపీ నేతతో కలిసి ప్రకటన చేయబోతున్నాం..' అని వర్మ సోషల్‌ మీడియాలో వెల్లడించడంతోనే, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా సంగతేంటో ఇంకోసారి స్పష్టమయిపోయింది. సో, ఇప్పుడు బాలయ్య తొందరపడాల్సిందే. బాలయ్య ప్రకటన లేటయితే, టీడీపీ నేతలే ఎవరో ఒకరు ముందుకొచ్చి 'బాబూస్‌ ఎన్టీఆర్‌' అనో, 'బాలయ్యాస్‌ ఎన్టీఆర్‌' అనో సినిమా ప్రకటించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 'ఎన్టీఆర్‌'కి డిమాండ్‌ ఇప్పుడు ఆ రేంజ్‌లో వుంది మరి.!