Home > Movies - Press Releases
ఇన్నాళ్లకు తెలుగు లుక్ నా?

నాగ శౌర్య-సాయిపల్లవి కాంబినేషన్ లో దర్శకుడు ఎ ఎల్ విజయ్ రూపొందుతోందో సినిమా. లైకా ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మిస్తోంది ఈ సినిమాను ఇటు తెలుగులో అటు తమిళంలో. నాగశౌర్యకు, సాయిపల్లవికి కూడా ఇదే తొలి తమిళ సినిమా. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అయింది. పూర్తయిపోయింది కూడా. కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా తెలుగు వాళ్లకు ఇప్పటి దాకా ఇవ్వలేదు.

సినిమా ఫస్ట్ లుక్ ను తమిళంలో ప్రభుదేవా ఎప్పడో లాంఛ్ చేసారు. కానీ నెలలు గడిచిన తెలుగులో విడుదల చేయలేదు. దీంతో అసలు నాగశౌర్య ఏం చేస్తున్నాడా? ఏ సినిమాలు లేవా చేతిలో అన్న అనుమానాలు వినిపించాయి. నిజానికి స్వంత బ్యానర్ లో ఓ సినిమా ఫినిష్ చేసాడు, ద్విభాషా చిత్రం ఒకటి ఫినిష్ చేసాడు. కానీ అప్ డేట్స్ ఇవ్వడం అన్నదే రెండు సినిమాల జనాలు పట్టించుకోలేదు.

ఇప్పుడు ఇన్నాళ్లకు తమిళ-తెలుగు సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. తమిళంలో కారు (పిండం లేదా అండం) అని టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమాకు తెలుగులో కణం అని టైటిల్ ఫిక్స్ చేసారు.

సాయిపల్లవి మరో పాపను తనలో పొదివి వుంచుకోవడం, చుట్టూ పక్షిగూడు వుండడం చూస్తుంటే, మాతృత్వం నేపథ్యంలో దర్శకుడు కథ తయారుచేసాడేమో అన్న ఫీల్ కలుగుతోంది.  ఫిదా తరువాత సాయిపల్లవికి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు ఆ బజ్ పనికివస్తుంది.