Home > Movies - Press Releases
కత్తి కథకుడి సినిమా

నరసింహారావు అంటే పెద్దగా బయట జనాలకు తెలియదు కానీ, సినిమా జనాలకు కాస్త పరిచయమే. కత్తి కథ తనదే అంటూ పట్టుబట్టి, ఖైదీ నెంబర్ 150 టైమ్ లో సెటిల్ మెంట్ జరిపిన రచయిత అంటే చాలా మందికి గుర్తుకు వస్తుంది.

తమిళ దిగ్దర్శకుడు శంకర్ కు సన్నిహితుడు, ఆయన సినిమాల తెలుగు వెర్షన్ల వ్యవహారాలు చూసే ఈ నరసింహారావు ఇప్పుడు దర్శకుడిగా మారారు. తొలిసారిగా కొత్త హీరోతో ఓ భారీ గ్రాఫిక్స్ సినిమాను తలకెత్తుకున్నారు. అదే శరభ. ఆ సినిమా ట్రయిలర్ లాంటి టీజర్ ఈ రోజు విడుదలయింది.

గురువు శంకర్ మాదిరిగానే నరసింహారావు కూడా భారీ సబ్జెక్ట్ ను తలకెత్తుకున్నట్లుంది. మొత్తం ట్రయిలర్ అంతా భారీ గ్రాఫిక్స్ కనిపించాయి.

కొత్త హీరో ఆకాష్‌ కుమార్‌, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా జయప్రద ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి అశ్వనికుమార్‌ సహాదేవ్‌ నిర్మాత. సంగీతాన్ని రోషన్ సాలూరి, కోటి కలిసి అందించారు. బుర్రా సాయి మాధవ్ మాటలు రాశారు.

దాదాపు ముఫై రెండు కోట్లు ఖర్చు చేసి, ఓ కొత్త హీరో, కొత్త డైరక్టర్ తో సినిమా చేయడం అంటే నిజంగా సాహసమే. అయితే దర్శకుడి ప్రతిభ, కథలో సత్తా, కొత్తదనం ఏమేరకు అన్నది టీజర్ లో కనిపిస్తోంది. అరుంధతి తరువాత మళ్లీ ఈ తరహా సినిమాలు రాలేదు. అందువల్ల ఈ సినిమా కాస్త ఆసక్తికరంగానే వుండే చాన్స్ వుంది.