Home > Movies - Press Releases
సునీల్.. కమ్యూనిజం ప్లస్ కామెడీ

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంతకు ముందు ఓనమాలు వంటి సినిమాలు అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్ కామెడీ సినిమా స్టార్ట్ చేస్తే జనాలకు అనుమానం వచ్చింది.

ఏ హీరో దొరక్క కామెడీ హీరో సునీల్ తో ట్రయ్ చేస్తున్నాడో, సరిపెట్టుకున్నాడో అని అనుకున్నారు. కానీ తీరా ఉంగరాల రాంబాబు సినిమాకు ముందుగా ఓ డిఫరెంట్ ట్రయిలర్ ను వదలితే, కాదు, క్రాంతి మాధవ్ తన స్టయిల్ లోనే ఇంకేదో చేస్తున్నాడని అనుమానం కలుగుతోంది.

సునీల్ తరహా కామెడీ అలా వుంచుతూనే, ప్రకాష్ రాజ్ హీరోగా రైతులు, కమ్యూనిస్టులు, పోరాటాలు, ప్రభుత్వ విధానాల వంటి వాటిపై తన స్టయిల్ సినిమాను అందించే ప్రయత్నం చేస్తున్నాడని ఈ రిలీజ్ ముందు ట్రయిలర్ చెప్పకనే చెబుతోంది. ఇందుకోసం ప్రకాష్ రాజ్ పాత్రను కీలకంగా వాడుకున్నట్లు కనిపిస్తోంది.

నేరుగా కమ్యూనిస్ట్ జెండాలు, ఎజెండాలు, ట్రయిలర్ లోకి తీసుకోచ్చేసారు. నిజానికి వాటికన్నా, సునీల్ కామెడీ డోస్ ను ఈ ట్రయిలర్ లో తక్కువే పెట్టారు. అంటే జనాలకు ఓ డిఫరెంట్ సినిమా చూపిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే అదే సమయంలో మామా అల్లుళ్ల టీజింగ్ కామెడీ సినిమాలో వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎలా వుంటుందో?