Home > Movies - Press Releases
తండ్రి సినిమాకు కొడుకు వాయిస్ ఓవర్

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, విజయేంద్రప్రసాద్ తనయుడు రాజమౌళి వాయిస్‌ఓవర్ చెప్పడం విశేషం.

నిజానికి ఈ ఎరోటిక్ థ్రిల్లర్ ఎప్పుడో రెడీ అయింది. సరైన డేట్ కోసం చూస్తూ వచ్చారు. ఆఖరికి ఈ నెల 15న విడుదల చేస్తున్నారు. అదే రోజు, రాజమౌళి చలువతో కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ లేటెస్ట్ సినిమా ఉంగరాల రాంబాబు కూడా విడుదలవుతోంది. 

శ్రీవల్లీ విడుదల సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రమిది. మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది.

ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది అని తెలిపారు.