Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: బాహుబలి 2

రివ్యూ: బాహుబలి: ది కన్‌క్లూజన్‌
రేటింగ్‌: 3.5/5
బ్యానర్‌:
ఆర్కా మీడియా వర్క్స్‌
తారాగణం: ప్రభాస్‌, రాణా దగ్గుబాటి, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌, తమన్నా, సుబ్బరాజు తదితరులు
కథ: విజయేంద్రప్రసాద్‌
మాటలు: సి.హెచ్‌. విజయ్‌కుమార్‌, అజయ్‌ కుమార్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: సాబు సిరిల్‌
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: కె.కె. సెంథిల్‌ కుమార్‌
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని
కథనం, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌. రాజమౌళి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 28, 2017

వినోదాన్ని అందించే సినిమాలు తీయాలని కొందరు, సందేశాత్మక చిత్రాలు తీయాలని ఇంకొందరు, గుర్తుంచుకునే సినిమాలు తీయాలని మరికొందరు... ఫిలింమేకర్స్‌లో ఒక్కొక్కరిదీ ఒక్కో తరహా తీరు. కానీ రాజమౌళి మాత్రం కాస్త వేరు. ప్రతి సినిమాతో తనకి తానే సవాల్‌ విసురుకుంటున్నట్టు, మునుపటి సినిమా కంటే ఇంకో మెట్టు పైకి ఎక్కాలన్నట్టు కసిగా తీస్తాడు. ఆ కసి లేకపోతే మగధీర, ఈగ, ఇప్పుడు బాహుబలి లాంటివి ఊహకి కూడా రావు. ఎంచక్కా రెండు హీరో ఎలివేషన్‌ సీన్లు, ఒక నాలుగు మసాలా పాటలు, ఆరు పంచ్‌ డైలాగులు పెట్టేసుకుంటే సినిమాలు నడిచేస్తాయి. ఆరు నెలలకో సినిమా చేసుకుంటూ హ్యాపీగా కాలం గడిపేయవచ్చు. కానీ 'ఎవరూ చేయనిది ఏదో చేయాలి. మన సినిమా గుర్తుండిపోవాలి. మనం తీసిన సినిమా గురించి జనం మాట్లాడుకోవాలి. వంద సినిమాల మధ్య మన సినిమా తలఎత్తి చూసే శిఖరంలా నిలబడిపోవాలి' అన్నట్టు తపించాలంటే దానికి ప్యాషన్‌ కావాలి, పేషెన్స్‌ వుండాలి, అన్నిటికీ మించి కలల్ని నిజం చేసుకుంటామనే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ వుండాలి. 

పట్టుమని డెబ్బయ్‌ కోట్ల మార్కెట్‌ నికరంగా లేని ఒక ప్రాంతీయ భాషా చిత్ర పరిశ్రమకి చెందిన దర్శకుడి ఆలోచనలు ఎక్కడ వుంటాయి, ఎంతలో ఆగుతాయి? నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో ఒక ప్రాంతీయ భాషా చిత్రం తీయడమంటే మాటలా? అంత అవుతుందని చెప్పడానికి దర్శకుడికి ఎన్ని గుండెలు కావాలి? అంత అమౌంట్‌ విన్నాక నిర్మాతలు ఎక్కడికెళ్లి దాక్కోవాలి? అంత డబ్బు వెనక్కి తెచ్చేసుకోగలం అనే ధీమా లేకపోతే ఎలా దిగగలరు? పోతుందేమోననే భయం వెంటాడుతున్నపుడు ఏ విధంగా ధైర్యంగా ఖర్చు పెట్టగలరు? పరిమితులకి మించిన ఆలోచనలుండాలే కానీ పరిధులు వాటంతట అవే విస్తృతం అవుతాయని బాహుబలి నిరూపించింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రమే జాతి మొత్తం ఎదురు చూసే సినిమాగా మారింది. 

సాంకేతికంగా ఎంతటి ఉన్నత ప్రమాణాల కోసం పరితపించినా, రాజమౌళి చిత్రాల్లో మౌలిక కథ ఎప్పుడూ మూలాలను విడిచిపెట్టదు. భావోద్వేగాలకి, ధీరోదాత్తతకి రాజమౌళి పెద్ద పీట వేస్తాడు. చివరకు ఈగని హీరోగా పెట్టుకున్నా హీరోయిజం వదిలిపెట్టలేదు! అవి తగ్గాయి కనుకే 'బాహుబలి 1' చిత్రంలో రాజమౌళి ముద్ర లోపించిందనిపించింది. అయితే మొదటి భాగంలో కేవలం పాత్రల పరిచయం మాత్రమే చేసి, అసలు కథని మొత్తం రెండవ భాగంలో చెప్పారు. దీంతో ఈ పార్ట్‌లో రాజమౌళి సినిమా నుంచి మనం ఆశించే అన్ని అంశాలు పుష్కలంగా అందుతాయి. 'బాహుబలి' ఎంతటి 'హీరో' అనేది రాజమౌళి విజువలైజేషన్‌లో చూసి తీరాల్సిందే. బాహుబలిని ఎలివేట్‌ చేసే ప్రతి సీన్‌కీ... బాహుబలిని చూసి మురిసిపోయే మాహిష్మతి కామన్‌ పబ్లిక్‌లా మనం కూడా పులకించిపోవాల్సిందే. 

కథగా చెప్పుకుంటే సగటు కమర్షియల్‌ చిత్రాల్లోని రివెంజ్‌ ప్లాట్‌. తండ్రిని చంపి, తల్లిని బందీని చేసిన విలన్‌ని మట్టుబెట్టడానికి హీరో వస్తాడు. కానీ ఎప్పుడయితే రాజులు, రాజ్యాలు అంటూ బ్యాక్‌డ్రాప్‌ వచ్చి చేరిందో మొత్తం స్వరూపమే మారిపోయింది. ఆ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్సే సరికొత్తగా, మహాద్భుతంలా అనిపిస్తుంది. రాజమౌళి కథకి, కథానాయకుడికి అనుగుణంగా తన ఇమాజినేషన్‌ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తుంటాడు. ఏనుగు ధనస్సు ఎక్కుపెడితే, బాహుబలి బాణం సంధించడం అనేది ఎంత మంది ఊహించగలరు? ఒక రాజు, రాణి ప్రేమించుకుంటే ఆ రొమాన్స్‌ ఎంత గ్రాండ్‌గా వుండాలో 'హంసనావ' పాటలో మబ్బుల గుర్రాల సాక్షిగా రాజమౌళి చూపించిన తీరుకి ఎవరైనా హేట్సాఫ్‌ చెప్పి తీరతారు. హీరో ఎలివేషన్‌ సీన్లయితే ఒళ్లు గగుర్పొడుస్తాయి. బాహుబలి ధీరత్వాన్ని దేవసేన మొదటిసారిగా చూసే సన్నివేశం, తర్వాత అతనెవరనేది ఆమెకి తెలిసే సన్నివేశం, ''ఆడవాళ్లని అవమానిస్తే నరకాల్సింది వేళ్లు కాదు తల'' అనే సీన్‌, వీటన్నిటికీ మించి ఇంటర్వెల్‌ సీన్‌లో బాహుబలి ఎలివేషన్‌ పీక్స్‌లో వుంటుంది. 

ఎమోషనల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ని సృష్టించడంలో రచయిత విజయేంద్రప్రసాద్‌ తన అనుభవాన్ని రంగరించారు. ఉన్నత విలువలున్న పాత్రలు తమ స్వభావ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపించే సంఘటనలని, వ్యూహాలని రచించిన తీరు అమోఘం. రాజ తంత్రాలు, కుతంత్రాలు, కుయుక్తులు వగైరా అంశాలతో ఎంగేజింగ్‌ కాస్టూమ్‌ డ్రామాగా బాహుబలిని తీర్చిదిద్దిన విధానం అద్భుతం. అయితే 'బాహుబలి' మొదటి భాగంలో వున్న విజువల్‌ గ్రాండియర్‌, ఆ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఇందులో తావు లేకపోయింది. అదంతా అవుట్‌డోర్‌లో జరిగే వ్యవహారం కనుక రాజమౌళి ఎన్నెన్నో వింతలు, విశేషాలు చూపించాడు. కానీ ఈసారి ఎక్కువగా కోట గోడల మధ్య జరిగే డ్రామాకి, పాత్రల మధ్య సంఘర్షణకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వాటర్‌ ఫాల్స్‌లాంటి విజువల్‌ ఎఫెక్ట్స్‌కి స్కోప్‌ తగ్గింది. అలాగే చివరి యుద్ధ సన్నివేశం కూడా హడావిడిగా తీసినట్టు అనిపిస్తుంది. ఆ వ్యూహాలు అవి నమ్మశక్యంగా అనిపించవు. భల్లాళదేవ వర్సెస్‌ మహేంద్ర బాహుబలి ఫైట్‌ కూడా ఎక్స్‌పెక్ట్‌ చేసినంత ఎఫెక్టివ్‌గా లేదు. 

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' ప్రశ్నకి కన్విన్సింగ్‌ రీజన్‌ చూపించారు. ఆ సన్నివేశం చుట్టూ జరిగే ఎమోషనల్‌ ప్లే ఆకట్టుకుంటుంది. శివగామి, బాహుబలి క్లాష్‌కి దారి తీసే స్క్రీన్‌ప్లే లాక్స్‌ చాలా బాగా కుదిరాయి. శివగామి పాత్రకి ధీటుగా దేవసేన పాత్రని బలంగా మలిచిన విధానం, ఆ క్యారెక్టర్స్‌ కాన్‌ఫ్రంటేషన్‌ వంటివి డ్రామాని ఎలివేట్‌ చేసాయి. ప్రథమార్థంలో వచ్చే సుబ్బరాజు కామెడీ కాస్త ఇబ్బందిపెట్టినా బాహుబలి ప్రేమ విషయం తెలుసుకుని భల్లాలదేవుడు పన్నే పన్నాగం నుంచి బాహుబలిని కట్టప్ప చంపే సన్నివేశం వరకు పకడ్బందీ కథనంతో కట్టి పడేస్తుంది. ఇంత గొప్ప సినిమాకి ఇంత చప్పటి క్లయిమాక్స్‌ సమంజసమనిపించదు. అదొక్కటే బాహుబలిలో కొట్టొచ్చినట్టు కనిపించే లోటు. 

అమరేంద్ర బాహుబలిగా మరొకరు ఊహకి కూడా రాని తీరున ప్రభాస్‌ ఆ పాత్ర కోసమే పుట్టినట్టున్నాడు. ఇంటర్వెల్‌ సీన్‌లో అతని అభినయం చాలా బాగుంది. అనుష్కకి అరుంధతి తర్వాత అంతటి పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ దొరికింది. ఆమె అభినయం ఆకట్టుకుంటుంది. రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ మొదటి భాగంలో చేసినట్టుగానే ఇందులోను సపోర్టింగ్‌ రోల్స్‌లో విశేషంగా రాణించారు. తమన్నాకి చివరి ఫైట్‌లో ఒక రెండు షాట్లు మినహా స్క్రీన్‌ టైమ్‌ దొరకలేదు. కీరవాణి పాటల్లో దండాలయ్యా, భళి భళిరా బాగున్నాయి కానీ మిగతావి అంతగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతంతో మాత్రం మరోసారి రాజమౌళి విజన్‌ని మరింతగా ఎలివేట్‌ చేసారు. సెంథిల్‌ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్‌ రాజమౌళి ఊహా ప్రపంచానికి ఊపిరి పోసాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ మొదటి భాగంలో వున్నంత కళ్లు చెదిరేట్టు లేకపోయినా, మిగిలిన చిత్రాలకీ, రాజమౌళి చిత్రాలకీ మధ్య అంతరాన్ని మాత్రం చూపెట్టాయి. 

ఇన్ని అంచనాలతో వచ్చిన చిత్రంతో సంతృప్తి పరచడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ తనకి తానే ఉన్నత ప్రమాణాలు సెట్‌ చేసుకునే రాజమౌళికి ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం మంచినీళ్ల ప్రాయం. విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఎమోషనల్‌ ఇంపాక్ట్‌ కూడా ఘనంగా వున్న 'బాహుబలి 2' బాక్సాఫీస్‌కి సరికొత్త అంకెలు చూపించడంతో పాటు తెలుగు సినిమాని శిఖరాగ్రాన నిలపడం తథ్యం. 

బాటమ్‌ లైన్‌: జయహో రాజమౌళి!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?