Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: దువ్వాడ జగన్నాథమ్‌

సినిమా రివ్యూ: దువ్వాడ జగన్నాథమ్‌

రివ్యూ: డీజే - దువ్వాడ జగన్నాథమ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: అల్లు అర్జున్‌, పూజ హెగ్డే, రావు రమేష్‌, మురళి శర్మ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి తదితరులు
కథనం: దినేష్‌ రెడ్డి, దీపక్‌ రాజ్‌
కూర్పు: చోటా కె. ప్రసాద్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: అయనాంకా బోస్‌
నిర్మాత: రాజు, శిరీష్‌
కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌
విడుదల తేదీ: జూన్‌ 23, 2017

అల్లు అర్జున్‌ మంచి ఎంటర్‌టైనర్‌. హరీష్‌ శంకర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇష్టపడే డైరెక్టర్‌. ఈ కాంబినేషన్‌లో సినిమా అనేసరికి అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుందనే ఎక్స్‌పెక్ట్‌ చేస్తారెవరైనా. స్టోరీ పరంగా ఎప్పుడూ చూడని ఒక కొత్త అంశాన్ని టచ్‌ చేసే ప్రయత్నం హరీష్‌ శంకర్‌ చేయడు. తన మార్కు వినోదం పండించడానికి, మాస్‌ మెచ్చే హీరోయిజమ్‌ చూపించడానికి అనువైన కథాంశాన్ని ఎంచుకుని, వాణిజ్య విలువలతో కూడిన సినిమాలు అందిస్తుంటాడు. 'దువ్వాడ జగన్నాథమ్‌' కూడా అలాంటి ఫక్తు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లానే మొదలై, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీదే రన్‌ అవుతూ రొటీన్‌ అనిపించినప్పటికీ ఫస్ట్‌ హాఫ్‌ వరకు సాఫీగా సాగిపోతుంది.

అయితే కథ రసకందాయంలో పడాల్సిన సమయానికి, ఎమోషనల్‌ పే ఆఫ్‌ కోసం కథ పాకులాడుతోన్న వేళకి 'డీజే'కి ఇంధనం కొరవడింది. రిజర్వ్‌లో ఉన్న కామెడీతో ఎలాగోలా గమ్యాన్ని చేర్చేసినప్పటికీ ఉన్నతాశయాలున్న డీజే క్యారెక్టర్‌కి తగ్గ ఎండింగ్‌, విలనిజంలో కొత్త కోణానికి ప్రయత్నించిన రొయ్యల నాయుడుకి తగ్గ సెండాఫ్‌ లేకుండా పోయింది.

హరీష్‌ శంకర్‌ ఎంచుకున్న ప్లాట్‌లో 'శంకర్‌' సినిమాల్లో వుండాల్సినంత ఎమోషన్‌ వుంది. సమాజంలోని చెడుని ఏరి పారేసే ఉన్నత లక్ష్యమున్న కథానాయకుడు... జెంటిల్మన్‌, అపరిచితుడు రేంజ్‌ లక్ష్యమతనిది. ఈ పాయింట్‌ మీద డెప్త్‌కి వెళ్లకుండా, సభ్య సమాజానికి మెసేజులు గట్రా ఇవ్వకుండా పైపైన టచ్‌ చేస్తూ ఒక సగటు వినోదాత్మక చిత్రాన్ని అందించాలని డెలిబరేట్‌గా ప్రయత్నించినట్టు అనిపించింది కానీ, ఎంచుకున్న పాయింట్‌కి కొన్నిసార్లు డెప్త్‌కి వెళ్లి తీరాల్సి వుంటుంది.

లేదంటే ఎమోషనల్‌గా లీడ్‌ క్యారెక్టర్‌తో కనక్ట్‌ ఏర్పడడానికి వీల్లేకుండా పోతుంది. డీజేగా క్రైమ్‌ని ఎలిమినేట్‌ చేయడాన్ని డైరెక్టర్‌ ఎంత స్టయిలిష్‌గా చూపించినప్పటికీ కథానాయకుడి ఆశయంతో రిలేట్‌ చేసుకోవడానికి తగ్గ బేస్‌ క్రియేట్‌ చేయడంలో రచయితలు (దినేష్‌, దీపక్‌) విఫలమయ్యారనే చెప్పాలి. పైన చెప్పుకున్న శంకర్‌ సినిమాలతో పాటు గణేష్‌, ఠాగూర్‌ తరహా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చుట్టూ అల్లుకున్న తరహా కథాంశమిది. వినోదం ఎంత మిక్స్‌ చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట తెరపై జరిగేదానిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వున్న ప్లాట్‌ ఇది.

కానీ ఆద్యంతం వినోదం పైనే ఫోకస్‌ పెట్టడం వల్ల పాత్రౌచిత్యాన్ని, కథానాయకుడి లక్ష్యాన్ని చిన్నబుచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ వరకు వినోదంతో కాలక్షేపం చేసినప్పటికీ, ఆ తర్వాత డీజే లక్ష్య సాధన అయినా స్ట్రయికింగ్‌గా చెప్పాల్సింది. డీజే ఆచూకీ విలన్‌కి తెలిసిపోయిన తర్వాత అతడిని డిఫెన్స్‌లోకి నెట్టడానికి విలన్‌ చేసే పనులు ఎక్సయిటింగ్‌గా అనిపిస్తూ వుండగానే, సరాసరి ప్రీ క్లయిమాక్స్‌కి లాక్కుపోవడంతో ఏదో లోపించిందనే వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ఒకానొక పాయింట్‌కి వచ్చేసరికి స్క్రీన్‌ప్లే మొత్తం సాంగ్‌, కామెడీ, ఫైట్‌ టెంప్లేట్‌గా మారిపోయింది. డీజే, రొయ్యల నాయుడు మధ్య జరిగే ఫోన్‌ కాన్వర్‌జేషన్స్‌ ఒక టెరిఫిక్‌ కాన్‌ఫ్రంటేషన్‌కి రూట్‌ వేస్తున్నట్టు అనిపిస్తాయి కానీ చివరకు వాళ్లిద్దరూ మీట్‌ అయ్యేసరికి మొత్తం కామెడీ మోడ్‌లోకి మారిపోయే సరికి 'పతాక' స్థాయికి చేరాల్సిన కథ కాస్తా పరాచికాలతో ముగిసిపోయింది.

దువ్వాడ జగన్నాథమ్‌గా అల్లు అర్జున్‌ ఆ డైలాగ్‌ మాడ్యులేషన్‌ సాధించడానికి, బ్రాహ్మణ యువకుడి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడానికి పడ్డ శ్రమ బాగా తెలుస్తుంది. నటుడిగా అల్లు అర్జున్‌కి వంక పెట్టడానికేం లేదు. తన పాత్రలోని రెండు షేడ్స్‌కి అతను పూర్తి న్యాయం చేసాడు. కామెడీ పండించడంలో పూర్తి బాధ్యత తనే తీసుకుని ప్రథమార్ధం మొత్తాన్ని సింగిల్‌ హ్యాండెడ్‌గా నడిపించేసాడు. హీరోలని హీరోల్లా చూపించడంలో హరీష్‌ శంకర్‌ది ప్రత్యేక శైలి. ఈ విషయంలో తన ముద్రని అతను మరోసారి బలంగా వేసాడు.

డీజేగా అల్లు అర్జున్‌ ఎంట్రన్స్‌, డైలాగ్స్‌ భలేగా పండాయి. డైలాగ్‌ రైటర్‌గా కూడా హరీష్‌ శంకర్‌ తన ప్రత్యేకత చాటుకునే సంభాషణలు చాలా రాసాడు. హాస్యభరిత సంభాషణలే కాకుండా, చిన్న పిల్లాడు 'నిద్ర ఎలా పడుతుంది?' అని అడిగే లాజిక్‌ గానీ, 'టెక్నాలజీ వల్ల మనుషులు దగ్గరవ్వాలి కానీ దూరమైపోతున్నారేంటి' అని చంద్రమోహన్‌ సంధించే ప్రశ్న కానీ రైటర్‌గా హరీష్‌ డెప్త్‌ని తెలియజేస్తాయి. వినోదం తన మెయిన్‌ ఎస్సెట్‌ కనుక దాని మీదే ఫోకస్‌ పెట్టి ఫస్ట్‌ హాఫ్‌ని పండించేసినా కానీ ఎమోషనల్‌ కనక్ట్‌ అవసరం వున్న కథని, కథానాయకుడిని ఎంచుకోవడం వల్ల ద్వితీయార్ధంలో పూర్తి న్యాయం చేయలేదనిపిస్తుంది.

పూజ హెగ్డే తన గ్లామర్‌తో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కాగా, రావు రమేష్‌ మరోసారి తన విలక్షణత చాటుకునే క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నారు. సుబ్బరాజు క్యారెక్టర్‌ ఓవర్‌  ది టాప్‌ అనిపించినప్పటికీ ఆ సన్నివేశాలు నవ్విస్తాయి. మురళి శర్మ, చంద్రమోహన్‌ తదితరులు సపోర్టింగ్‌ రోల్స్‌లో తమ వంతు న్యాయం చేసారు. దేవి సంగీతం హుషారుగా సాగింది. అయితే సీటీ మార్‌లాంటి పాటలకి ప్లేస్‌మెంట్స్‌ కుదరకపోవడం వల్ల సాంగ్‌తో రావాల్సిన జోష్‌ రాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు అన్నీ బాగా కుదిరాయి కానీ కథనం పరంగా దొర్లిన పొరపాటల్ల వల్ల దువ్వాడ జగన్నాథమ్‌ ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

అల్లు అర్జున్‌ అభినయం, దేవి సంగీతం, హరీష్‌ శంకర్‌ మాటల చాతుర్యం, పూజ అందం, ప్రథమార్ధంలో వినోదం లాంటి అంశాలతో 'దువ్వాడ జగన్నాథమ్‌'కి ఓ కమర్షియల్‌ సినిమాకి కావాల్సిన హంగులని సమకూర్చుకున్నప్పటికీ, ఎంగేజ్‌ చేయలేని సెకండ్‌ హాఫ్‌, ఎమోషనల్‌ పే ఆఫ్‌ లేని స్క్రీన్‌ప్లే కారణంగా అంతిమంగా నిరాశ కలిగిస్తుంది. సగటు సినిమాలని సాఫీగా తీరం దాటించేసి స్టార్‌గా తన సత్తా చాటుకుంటూ వున్న అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌కి మరోసారి పరీక్ష పడింది. ఈసారి తన ముందున్న లక్ష్యాన్ని డీజే ఎంతవరకు చేరుకుంటాడనేది చూడాలి.

బాటమ్‌ లైన్‌: రొటీనః రొటీనస్య!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?