Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మహానుభావుడు

సినిమా రివ్యూ: మహానుభావుడు

రివ్యూ: మహానుభావుడు
రేటింగ్‌: 3/5
బ్యానర్‌: యువి క్రియేషన్స్‌
తారాగణం: శర్వానంద్‌, మెహ్రీన్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, భద్రం తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
కళ: రవీందర్‌
ఛాయాగ్రహణం: నిజర్‌ షఫీ
నిర్మాతలు: వంశీ - ప్రమోద్‌
రచన, దర్శకత్వం: మారుతి
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 29, 2017

'మతిమరపు' మగాడితో నవ్వుల విందు అందించిన మారుతి ఈసారి 'పరిశుభ్రత'కి ప్రాణాలిచ్చేసే 'మహానుభావుడి'ని చూపించాడు. 'భలే భలే మగాడివోయ్‌' మాదిరిగానే ఈ మహానుభావుడికి కూడా తనకున్న బలహీనతే విలన్‌ అవుతుంది. తనకున్న సమస్యని అధిగమించి తన ప్రేమని ఎలా దక్కించుకుంటాడనేది సింగిల్‌ లైన్‌లో ఈ సినిమా స్టోరీ. భలే భలే మగాడివోయ్‌ మీటర్‌నే ఫాలో అవుతూ, అదే రీతిన కాన్‌ఫ్లిక్ట్‌, ప్లాట్‌ ట్విస్ట్స్‌ వేసుకుంటూ మారుతి రచించిన ఈ కొత్త కథలోను నవ్వించే సందర్భాలు చాలానే వున్నాయ్‌.

అయితే 'భలే భలే మగాడివోయ్‌' మతిమరపుతో రిలేట్‌ అయినంతగా, ఈ మహానుభావుడి 'ఓసిడి'తో కనక్ట్‌ అవలేం. మతిమరపుతో సృష్టించిన వినోదం మొత్తం పగలబడి నవ్వేట్టు చేస్తే, ఇది ఒక పాయింట్‌ దాటిన తర్వాత కాస్త ఎక్కువ స్ట్రెచ్‌ చేస్తోన్న భావన కలిగిస్తుంది.

'భలే భలే' తర్వాత 'జాలి' ఎక్కువైన హీరో పాత్రతో సిమిలర్‌ వినోదాన్ని అందించాలని చూసిన మారుతి 'బాబు బంగారం'లో తన మార్కు మ్యాజిక్‌ చేయలేకపోయాడు. మరోసారి లీడ్‌ క్యారెక్టర్‌కి వున్న బలహీనత చుట్టూనే కథ అల్లుకున్న మారుతి ఈసారి ఫార్ములాని సరిగ్గా వాడాడు. కాకపోతే 'భలే భలే మగాడివోయ్‌'కి ఆరంభంలోనే హీరో-హీరోయిన్‌ తండ్రి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్‌ లాంటిది ఈ కథలో సెట్‌ అవలేదు.

అలాగే మతిమరపు వీక్‌నెస్‌ని దాచిపెట్టడం ఈజీనే కానీ, అతి శుభ్రత లక్షణాన్ని దాచిపెట్టడం కష్టం కనుక పాత్రలన్నిటికీ హీరో వీక్‌నెస్‌ ముందే రివీల్‌ అయిపోవడం వల్ల డ్రామాకి స్కోప్‌ తగ్గింది. అలాగే ప్రిడిక్టబులిటీ ఫ్యాక్టర్‌ కూడా పెరిగింది. హీరో పాత్ర పరిచయం అయినపుడు, లవ్‌లో పడినపుడు, హీరోయిన్‌ తండ్రిని కలిసినపుడు, చివరకు బ్రేక్‌ అప్‌ అయినపుడు కూడా నెక్స్‌ట్‌ ఏమిటనేది ఊహించేయవచ్చు. ఈ సమస్యని దాటడానికి మారుతి ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకుని, చాలా వరకు సక్సెస్‌ అయ్యాడు.

అత్యంత శుభ్రత పాటించే క్యారెక్టర్‌ని తీసుకెళ్లి పరిశుభ్రతని పెద్దగా పట్టించుకోని పల్లెటూరి జనాల మధ్య పడేస్తే వచ్చే వినోదం మీదే మహానుభావుడు డిపెండ్‌ అయింది. హీరో పాత్రని పరిచయం చేసే సన్నివేశాలు, అతని నీట్‌నెస్‌పై పడే సెటైర్లు వగైరా అంశాలతో సరదాగా మొదలైన చిత్రం ఇంటర్వెల్‌ టైమ్‌కి అతని సమస్య తాలూకు తీవ్రతని తెలియజేస్తుంది. జ్వరంతో వున్న తల్లి ప్రేమతో కలిపిన ముద్ద కూడా తినలేని హీరోకి తన ప్రేమ విషయంలో అంతకంటే విషమ పరీక్ష ఎదురవుతుంది.

ఇక తన బలహీనతని అధిగమించడానికి అతను ఎలాంటి పరిస్థితుల నడుమ వుంటాడు, చివరకు ఏం చేస్తాడనేది మారుతి తనదైన శైలిలో చూపించాడు. హీరోని పల్లెటూరికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు విపరీతంగా నవ్విస్తాయి. చెరువులో స్నానం, ఆవకాయ్‌ అన్నం తినే దృశ్యం హిలేరియస్‌గా వున్నాయి. అయితే ఒక దశ దాటిన తర్వాత ఈ 'క్లెన్లీనెస్‌' అనేది భారంగా మారిపోయి ముగింపు కోసం వేచి చూసేట్టు చేస్తాయి. ఆ క్లయిమాక్స్‌ కూడా మనం ఊహించగలిగేదే కావడం ఈ చిత్రానికి అతి పెద్ద బలహీనత. 

క్లయిమాక్స్‌ మీద మారుతి మరింత శ్రద్ధ పెట్టాల్సింది. కుస్తీ పోటీలతో సర్పంచ్‌ పదవి వరించడమనే పాత చింతకాయ క్లయిమాక్స్‌ కాకుండా మరేదైనా ఆకట్టుకునే క్లయిమాక్స్‌ వుంటే బాగుండేది. ముఖ్యంగా జ్వరం వచ్చిన తల్లిని సైతం లెక్క చేయనంత అబ్సెషన్‌ వున్న హీరో మారడానికి ఇంతకు మించిన క్లయిమాక్సే కావాలి. ఓసిడి ఎలిమెంట్‌తో ఎంత వినోదం పండించవచ్చో అంత పండించగలిగాడు మారుతి. కాకపోతే ఈ పాయింట్‌కి వున్న రిలేటబులిటీ, రిస్ట్రిక్షన్స్‌ కారణంగా 'భలే భలే మగాడివోయ్‌' స్థాయిలో వినోదానికి వీలు చిక్కలేదంతే. ఆ చిత్రాన్ని దృష్టిలో వుంచుకుని, అదే స్థాయి వినోదాన్ని ఆశిస్తే కాస్త నిరాశ పడాల్సి వస్తుంది కానీ, ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌ లేకుండా చూస్తే మాత్రం ఈ చిత్రంతోను కాలక్షేపం భలేగా అయిపోతుంది.

శర్వానంద్‌ మరోసారి హాస్య రస ప్రధాన పాత్రలో తన టాలెంట్‌ చూపించాడు. పాత్రకి తగ్గట్టుగా కనిపిస్తూ ప్రతి సినిమాలో వేరియేషన్స్‌ చూపిస్తోన్న శర్వానంద్‌ ఈ పాత్రలోను ఒదిగిపోయాడు. హీరోయిన్‌ మెహ్రీన్‌ మాత్రం 'ముద్దు ముద్దుగా' కనిపించే ప్రయత్నంలో బాగా ఇబ్బంది పెట్టింది. ఆమె నటన, రూపం కూడా ఆకట్టుకోలేదు. కనీసం లిప్‌ సింక్‌ కూడా సరిగా ఇవ్వకపోవడం ఆక్షేపణీయం. నాజర్‌, వెన్నెల కిషోర్‌ తమ పాత్రలకి న్యాయం చేసారు. తమన్‌ పాటలు బాగున్నాయి. టైటిల్‌ సాంగ్‌ చాలా బాగా కంపోజ్‌ చేసాడు. అలాగే వైవిధ్యభరిత నేపథ్య సంగీతంతో ఈ చిత్రానికి ప్రతి సీన్‌లో ప్రత్యేకత తీసుకొచ్చాడు. కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఈ చిత్రం తెరకెక్కడంలో నిర్మాణ విలువలు, సినిమాటోగ్రాఫరు, ప్రొడక్షన్‌ డిజైనరు తలా ఒక చెయ్యి వేసారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ సమపాళ్లలో మిక్స్‌ చేసి, కమర్షియల్‌గా పక్కా వినోదాన్ని అందించడంలో మారుతి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అయితే ప్రతి సినిమాలోను హీరో పాత్రకి ఏదో ఒక బలహీనత పెట్టి దాని చుట్టూ కథ అల్లడం వల్ల ప్రిడిక్టబుల్‌ అయిపోతున్నాడు. డిఫరెంట్‌ జోనర్స్‌ లేదా కాన్సెప్ట్స్‌తో తన మార్కు వినోదాన్ని ఎలా పండిస్తాడనేది చూడాలని కోరుకునే వారికి తన తదుపరి చిత్రాలతో అలాంటివి చూపిస్తాడేమో చూడాలి.

కుటుంబ సమేతంగా చూడదగ్గ 'క్లీన్‌' కామెడీకి తోడు, వీనుల విందైన పాటలు, శర్వానంద్‌ నటన జత కలిసి ఈ మహానుభావుడిని పండగ సినిమాల మధ్య ఒక మెట్టు పైన నిలబెట్టాయి. దసరా సెలవుల్లో కుటుంబంతో చూడదగ్గ సరదా చిత్రం కనుక బాక్సాఫీస్‌ వద్ద ఈజీగానే గట్టెక్కేయాలి.

బాటమ్‌ లైన్‌: మారుతి మార్కు వినోదం!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?