Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉంగరాల రాంబాబు

సినిమా రివ్యూ: ఉంగరాల రాంబాబు

రివ్యూ: ఉంగరాల రాంబాబు
రేటింగ్‌: 1/5
బ్యానర్‌:
యునైటెడ్‌ మూవీస్‌ లిమిటెడ్‌
తారాగణం: సునీల్‌, మియా, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి
నిర్మాత: పరుచూరి కిరీటి
కథ, కథనం, దర్శకత్వం: కె. క్రాంతి మాధవ్‌
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 15, 2017

సునీల్‌ కామెడీని విడిచి పెట్టి కమర్షియల్‌ చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు రావడం, అతను చేసిన ఇటీవలి చిత్రాలన్నీ ఫ్లాపవడంతో తన చిత్రాల్లో కామెడీ వుండాలని రియలైజ్‌ అయ్యాడు. తను చేస్తోన్న కమర్షియల్‌ కథలోనే ఈసారి కామెడీ వుండేట్టు చూసుకున్నాడు. అర్మానీ డ్రస్సులు వేసుకుని, తన మార్కు హాస్యాన్ని పండించడానికి విఫలయత్నం చేసాడు.

అయితే సునీల్‌ సినిమాలో కామెడీనే వుండాలని ఆశిస్తారు కానీ కామెడీ ఒక అంశం అనుకుని ఎవరూ రారు. తను కమెడియన్‌గా క్లిక్‌ అవడానికి దోహదపడిన కొన్ని టిపికల్‌ మేనరిజమ్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకోవాలని చూసాడు కానీ చాలా అసహజంగా అనిపించడమే కాకుండా, తను పోషించిన రిచ్‌ బిజినెస్‌మేన్‌ క్యారెక్టర్‌కి అవి సూట్‌ అవలేదు. కామెడీ కోసం తపించడం అయితే తెలిసింది కానీ స్లో మోషన్‌ షాట్స్‌లో సూపర్‌స్టార్స్‌ రేంజ్‌ హీరో ఇంట్రడక్షన్‌ని, అవసరం లేకున్నా అయిదు పాటలని, తనకి సూట్‌ కాని స్టయిలింగ్‌ని మాత్రం విడిచిపెట్టలేదు.

తనకి ఏది సూట్‌ అవుతుందో తెలుసుకోలేని సమస్యతో సునీల్‌ సతమతమవుతూ వుంటే, తన స్టయిల్‌ని విడిచిపెట్టి కమర్షియల్‌ రూట్లోకి వచ్చి తిప్పలు పడ్డాడు దర్శకుడు క్రాంతి మాధవ్‌. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి చిత్రాలు తీసిన దర్శకుడు ఈసారి కమర్షియల్‌ ఫార్ములాతో మెజారిటీ ప్రేక్షకులని రీచ్‌ అయ్యే ప్రయత్నంలో తన బలాన్ని కోల్పోయాడు. కమర్షియల్‌ సినిమాలు తీసేయడం చాలా ఈజీ అనుకునే వారికి ఉంగరాల రాంబాబు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. ఈ చిత్రంలో సగటు కమర్షియల్‌ చిత్రాల్లో వుండే ఎలిమెంట్స్‌ అన్నీ వున్నాయి. కానీ ఏవీ సరిగా కుదర్లేదు. దాంతో ఫార్ములాని అనుసరిస్తున్నా కానీ ప్రేక్షకులకి 'చిత్ర'వధ తప్పదు.

తాతయ్య చెప్పిన కథలు విని ఆ పాత్రల నుంచి స్ఫూర్తి పొందాడని, ఆ తర్వాత సినిమాలు చూస్తూ హీరోలని చూసి ఇన్‌స్పయిర్‌ అవుతున్నాడని ఇంట్రడక్షన్‌ ఎందుకిచ్చారో, ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే వుండదు. ప్రతి సినిమాలో చిరంజీవి స్టయిల్‌ని ఇమిటేట్‌ చేసే సునీల్‌ ఈసారి ఆ పని చేయడం కోసం ఆ ఇంట్రడక్షన్‌ రాయించుకున్నాడేమో అనిపిస్తుంది.

ఆ తర్వాత రాంబాబుకి ముందు 'ఉంగరాలు' తగిలించడం కోసం 'బాదం బాబా' అంటూ పోసానిపై ఎలాంటి వినోదం లేని ఒక నాసిరకం ట్రాక్‌ రాసారు. ఏ రంగు ఉంగరం ధరిస్తే ఆ రంగు బట్టలు వేయాలంటూ 'సిందూరం'లో రవితేజ స్టయిలింగ్‌ని కాపీ చేస్తూ అదే కామెడీ అనుకోమన్నారు. 'ఉంగరాల రాంబాబు' అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌ చేసేసామని అనేసుకున్న తర్వాత ఇక రొమాన్స్‌ వైపు వెళతారు. ఆ లవ్‌స్టోరీనే చిందర వందరగా వుంటే, హీరోయిన్‌ పుట్టినరోజుకి సర్‌ప్రైజ్‌ చేస్తానంటూ దుబాయ్‌ తీసుకెళ్లిన హీరో ఆమెని సర్‌ప్రైజ్‌ చేయడం మాటేమో కానీ ప్రేక్షకులతో టార్చర్‌ స్పెల్లింగ్‌ రాయిస్తాడు.

ఎలాగోలా ఫస్ట్‌ హాఫ్‌ పూర్తి చేసేసి 'మ మ' అనిపించుకున్నాక అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు హీరోయిన్‌ తండ్రిని మెప్పించడం కోసం 'మీట్‌ ది పేరెంట్స్‌' తరహాలో ఆమె ఇంటికి వెళతాడు. లెఫ్టిస్ట్‌ భావాలున్న ఆమె తండ్రి ప్రకాష్‌రాజ్‌ ఆమధ్య 'మిస్టర్‌'లో చూసిన వింత ఊరులాంటిది ఒకటి చూపిస్తాడు. ఊరందరికీ ఒకటే కిచెన్‌ అట. ఎవరికెన్ని ప్లేట్లు కావాలో అక్కడ్నుంచి ఆర్డర్‌ చేస్తారట. అప్పటికే విసుగు ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఛాలెంజ్‌ చేస్తూ వుండేసరికి ఇలాంటి నాన్సెన్స్‌ ఏమి చూపిస్తున్నా పేద్ద పట్టించుకోం. 'కామెడీ' అంటూ మొత్తుకునే వారి మొహాన... ఒరిజినల్‌ కామెడీకి పెట్టింది పేరయిన సునీల్‌తో పేరడీ డాన్సులు వేయించి అదే కామెడీ అనుకోమంటూ ఒక భారీ ఎపిసోడ్‌ కొడతారు.

వెన్నెల కిషోర్‌ని దించి కామెడీ పెంచాలని అనుకున్నారు కానీ సీన్‌ రాసుకుంటే కామెడీ అవుద్ది కానీ యాక్టర్‌ని దించితే కామెడీ పుట్టదుగా. ఏ సీన్‌ చూసినా కానీ పర్పస్‌లెస్‌గా, మీనింగ్‌లెస్‌గా అనిపిస్తూ వుంటుంది. కుక్కని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లే సీన్‌ కానీ, సునీల్‌ ఫ్రూట్స్‌ తెచ్చే సీన్‌ కానీ అసలు వీటి వల్ల ఏమి ప్రయోజనం అనేట్టున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే హీరోని ఏదో చేసేయాలంటూ ఆశిష్‌ విద్యార్థి ట్రాక్‌ నడుస్తూ వుంటుంది. చివర్లో అతనేమీ చేయకుండానే తన రెండు వందల కోట్లు వదిలేసి పోతాడు. అంతమాత్రం దానికి ఆ పాత్ర పెట్టడమెందుకు, రన్‌ టైమ్‌ దండగ కాకపోతే. ఫైనల్‌గా ఒక మెసేజ్‌ వుంటే కమర్షియల్‌ ఫార్ములా రౌండ్‌ ఆఫ్‌ అయిపోతుంది కనుక రైతు గొప్పతనం గురించి ఒక మూడు, నాలుగు సీన్లున్నాయి. ఈ సినిమాలోకి అదంతా ఇమడ లేదు కానీ అలాంటి బరువైన సీన్లలోనే దర్శకుడి బలం కనిపిస్తుంది.

డిజైరబుల్‌ అనిపించుకోవాలనో, గ్లామరస్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలనో, సగటు సూపర్‌స్టార్‌కి ఏం తక్కువ కాననో, అసలు ఉద్దేశం ఏమిటనేది తెలియదు కానీ డిజైనర్‌ డ్రస్సుల్లో ఫ్యాషనబుల్‌గా కనిపించడం సునీల్‌కి వీక్‌నెస్‌ అయిపోయినట్టుంది. తనని కమెడియన్‌గా సక్సెస్‌ చేసినవి 'బంతి'లాంటి సహజమైన పాత్రలేనని, తనలో 'హీరో'ని చూడాలని అనుకోరని సునీల్‌ గుర్తించాలి.

తనకి నచ్చిన పాత్రలు కాకుండా, తనకి 'నప్పే' పాత్రలు చేసుకుంటే, మనకి నచ్చిన సునీల్‌ మళ్లీ కనిపించడం అంత కష్టమేం కాకూడదు మరి. ప్రకాష్‌రాజ్‌కి అలవాటైన పాత్రలో ఎలాంటి కొత్తదనం చూపించలేకపోయారు. వెన్నెల కిషోర్‌, పోసాని కూడా క్లిక్‌ అవలేదు. హీరోయిన్‌ మియా కేవలం అలంకారానికే అన్నట్టుంది. నిర్మాతలు వెనకాడకుండా ఖర్చు పెట్టేసారు కానీ దానికి న్యాయం చేసే సరైన సీనే లేకుండా పోయిందిందులో. జిబ్రాన్‌ పాటలు ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం అయితే తెరపై జరుగుతోన్న దానిని ట్రోల్‌ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు.

మరోసారి మిస్‌లీడింగ్‌ టైటిల్‌తో, తనకి సెట్‌ కాని సెటప్‌తో, కామెడీ కవరింగ్‌తో కమర్షియల్‌ సినిమాని సేల్‌ చేయడానికి సునీల్‌ గట్టిగా ట్రై చేసాడు కానీ కమర్షియల్‌ సినిమా కిటుకు కనిపెట్టలేక దర్శకుడు క్రాంతి మాధవ్‌ చేతులెత్తేసాడు. ఫలితంగా సునీల్‌ ఇటీవల చేసిన ఫ్లాప్‌ సినిమాలే దీనికంటే నయం అనేంత బోరింగ్‌గా ఈ రింగుల రాంబాబు తయారయ్యాడు.

బాటమ్‌ లైన్‌: రాం'బాబోయ్‌'!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?