Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: వెంకటాపురం

సినిమా రివ్యూ: వెంకటాపురం

రివ్యూ: వెంకటాపురం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌:
గుడ్‌ సినిమా గ్రూప్‌, బాహుమన్య ఆర్ట్స్‌ 
తారాగణం: రాహుల్‌, మహిమ, అజయ్‌ ఘోష్‌, అజయ్‌, కాశి విశ్వనాధ్‌ తదితరులు
కూర్పు: మధు
సంగీతం: అచ్చు
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు
నిర్మాతలు: తూము ఫణికుమార్‌, శ్రేయస్‌ శ్రీనివాస్‌
కథ, కథనం, దర్శకత్వం: వేణు మదికంటి
విడుదల తేదీ: మే 12, 2017

బీచ్‌లో యువతి శవం, కొడవలితో దొరికిన యువకుడు, వెంకటాపురం పోలీస్‌స్టేషన్‌లో బందీ అవుతాడు, పోలీస్‌ ఇంటరాగేషన్‌ మొదలు... సీట్లో కుదరుకునే లోగానే 'వెంకటాపురం' ప్రేక్షకుల అటెన్షన్‌ని రాబట్టి కదలకుండా కూర్చోబెట్టేస్తుంది. ఆరంభమే ఇంతగా ఆకర్షిస్తే, ఇక ముందు ముందు ఎలాగుంటుందోననే ఆసక్తి పెరిగిపోతుంది. కానీ ఒక పది నిమిషాల అనంతరం మొదలైన ఫ్లాష్‌బ్యాక్‌... అంతకుముందు రేకెత్తించిన ఆసక్తిని చంపేయడానికి ఎక్కువ సమయం తీసుకోదు. హీరో, హీరోయిన్‌తో పాటు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ ఏవీ ఆకట్టుకోవు. క్యారెక్టర్స్‌ని బలంగా తీర్చిదిద్దడాన్ని వదిలేస్తే, కనీసం సన్నివేశాలని అయినా సరిగా వర్కవుట్‌ చేసుకోలేదు. ఈ పాత్రల్ని సమస్యల్లో పడేయడానికి దర్శకుడు బలవంతంగా కొన్ని సీన్లు రాసుకున్నట్టు అనిపిస్తుంది.

చదువు మీద ధ్యాస ఎక్కువైన హీరోయిన్‌ తన బెంచ్‌ మేట్స్‌ అయిన ఇద్దరు అమ్మాయిలు తరచుగా క్లాస్‌లోంచి మిస్‌ అవడం చూసి వారిని వెంబడిస్తుంది. ఇంతకీ వారు చేసేదేంటయ్యా అంటే... దొంగచాటుగా సిగరెట్లు కాలుస్తుంటారు. దాంతో హీరోయిన్‌కి కూడా స్మోక్‌ చేయాలనిపిస్తుంది. వాళ్లతో పాటు తను కూడా సిగరెట్లు మొదలు పెడుతుంది. కానీ వారి రహస్య స్థావరాన్ని కాలేజ్‌ యాజమాన్యం మూసేయడంతో పొగ తాగడానికి మైళ్లు నడుచుకుంటూ వెళ్లి బీమిలి బీచ్‌లో నిర్మానుష్యమైన స్థలంలో సిగరెట్లు కాలుస్తుంటారు. అక్కడ చేరిన రౌడీ మూకతో వీరికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు తనకి పరిచయం వున్న హీరో సాయం కోరుతుంది. ప్రేయసి మాట అటుంచి కనీసం తనకి స్నేహితురాలు కూడా కాని హీరోయిన్‌ కోసం అతను కొడవలి పట్టుకుని వెళతాడు.

హీరో కథ చెప్పడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి, కొడవలి పట్టుకుని బీచ్‌కి వెళ్లే వరకు జరిగే తంతు అంతా డ్రామాని తలపిస్తుంది. ఎవరికి వారు కన్వీనియంట్‌గా మాట్లాడేస్తూ, విచిత్రమైన నిర్ణయాలు తీసేసుకుంటూ వుంటారు. తన కూతురికి సాయం చేసాడని చెప్పి ఒక యువకుడిని పిలిచి ''మాకు ఊరు పెద్దగా తెలియదు. కాబట్టి తనకి నువ్వే ఊరంతా చూపించాలి'' అని చెబుతాడు హీరోయిన్‌ తండ్రి. ''వాతావరణం చల్లగా వున్నప్పుడు బాయ్‌ఫ్రెండ్‌తో సరదాగా బైక్‌పై తిరిగితే బాగుంటుంది'' అని ఫ్రెండ్‌ సలహా ఇస్తే ఒక రోజు బాయ్‌ఫ్రెండ్‌గా వుండమంటూ హీరోకి ప్రపోజల్‌ పెడుతుంది హీరోయిన్‌. ఒక్కరని కాదు రౌడీల దగ్గర్నుంచి హీరోయిన్‌ వరకు ఎవరికి వాళ్లు తోచిన విధంగా, అర్ధం లేకుండా మాట్లాడుతూ, విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లోకి మూడు పాటల్ని కూడా చొప్పించడం మరో బోనస్‌.

ఇంత బ్యాడ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ తర్వాత మళ్లీ ట్రాక్‌పైకి రావడం చిన్న విషయమేం కాదు. 'అసలేం జరిగింది?' అనే సస్పెన్స్‌ని దర్శకుడు బాగా మెయింటైన్‌ చేసాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి కోల్పోకుండా చూసుకున్నాడు. కాకపోతే గంట నలభై అయిదు నిమిషాల నిడివి వున్న చిత్రంలో సగ భాగానికి పైగా సమయాన్ని వృధా చేయడం అతి పెద్ద బ్లండర్‌. లీడ్‌ క్యారెక్టర్స్‌కి చేదు అనుభవం పొంచి వున్నపుడు ఆ పాత్రలని వీలయినంత ఉదాత్తంగా రాసుకోవాలి. వీరికి ఏం జరుగుతుందో అనే భయం పుట్టేట్టుగా ఆ పాత్రలని తీర్చిదిద్దుకోవాలి. వారి గత జీవితానికి సంబంధించిన సంఘటనలు అత్యంత సహజంగా, ఆకర్షణీయంగా వుండాలి. వీరికి సమస్య వచ్చిన తర్వాత కథ ఎలాగో ఆసక్తికరంగా వుంటుంది కనుక అంతకుముందు వారి లైఫ్‌లో ఏమి జరిగిందనే దానిపై పెద్ద ఫోకస్‌ అక్కర్లేదని అనుకోవడం తగదు. ముఖ్యంగా హీరోయిన్‌ పాత్ర తీరుతెన్నులు ఆమెకి ఎదురయ్యే పరిస్థితుల పట్ల సింపతీ ఫీలయ్యేట్టుగా తీర్చిదిద్దలేదు.

సినిమా అంతటిలో అజయ్‌ కథలోకి ప్రవేశించిన తర్వాతి ఘట్టం బాగుంది. అంతవరకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ ఈ చివరి ఘట్టాన్ని చిత్రీకరించిన వైనం దర్శకుడి ప్రతిభకి అద్దం పడుతుంది. తనకున్న లిమిటెడ్‌ రిసోర్సెస్‌తో వేణు మదికంటి ఈ పార్ట్‌ తెరకెక్కించిన విధానం మెప్పిస్తుంది. అయితే అతను రాసుకున్న కథ మొత్తం ఇదే బేస్‌ మీద ఆధారపడినది కావడంతో అతను దీనిని ఇంత పకడ్బందీగా డీల్‌ చేసాడనిపిస్తుంది. మిగతా కథనం, పాత్ర చిత్రణపై కూడా దృష్టి పెట్టినట్టయితే 'వెంకటాపురం' ఒక మెమరబుల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అయి వుండేది. ఈ తరహా సహజమైన క్రైమ్‌ స్టోరీలని అత్యంత పకడ్బందీగా తెరకెక్కించే వాళ్లలో కొరియన్‌, తమిళ్‌, మలయాళ దర్శకులు చాలా మందే వున్నారు. కనీసం రిఫరెన్స్‌కి అయినా వాళ్లు ఫాలో అయ్యే పద్ధతుల్ని ఆకళింపు చేసుకుని, అందుకు అనుగుణంగా కథనం రాసుకుని వుంటే ఆరంభం, అంతం మాత్రమే కాకుండా ఆద్యంతం వెంకటాపురం ఆకట్టుకుని వుండేది.

రాహుల్‌ మేకోవర్‌ బాగుంది. హ్యాపీడేస్‌లోని 'నెర్డ్‌' నుంచి ఇందులోని 'మాచో' లుక్‌కి అతని ట్రాన్స్‌ఫర్మేషన్‌ మెచ్చుకోతగింది. నటుడిగా తనకి ఎక్కువ స్కోప్‌ ఇచ్చిన కథ ఏమీ కాదు. మహిమ బాగుంది కానీ హీరోయిన్‌లా అనిపించదు. అజయ్‌ ఘోష్‌ ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లాడు. అజయ్‌ డిగ్నిఫైడ్‌గా నటించాడు. కాశీ విశ్వనాధ్‌ క్యారెక్టర్‌ ఇరిటేట్‌ చేస్తుంది. ఈ తరహా చిత్రాలకి టెక్నికల్‌గా ఉన్నతమైన ప్రమాణాలు వుంటే మరింత రక్తి కడతాయి. టెక్నికల్‌గా ఈ చిత్రం చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఒక్క పాట కూడా అవసరం లేని చిత్రంలోకి అన్ని పాటల్ని చొప్పించారు. పైగా అవేమీ ఆకట్టుకోలేదు. వేగంగా కదలాల్సిన కథనం చాలా లేజీగా ముందుకి సాగడం కూడా ఒక బలహీనతే. బడ్జెట్‌ పరిమితుల కారణంగా క్వాలిటీ లోపించింది. అయితే సినిమాటోగ్రఫీ, కాస్టింగ్‌ పరమైన కాంప్రమైజెస్‌ లేకపోతే, ఈ తరహా చిత్రాలకి అడ్వాంటేజ్‌ పెరిగి, పెరిగిన బడ్జెట్‌కి తగ్గ గ్యారెంటీ రిటర్న్స్‌ వుంటాయి.

మొత్తం మీద వెంకటాపురం... ఇంట్రెస్టింగ్‌ ప్లాట్‌, ప్రామిసింగ్‌ ప్రెమీస్‌ వుండి కూడా స్క్రీన్‌ప్లే ప్రాబ్లమ్స్‌ వల్ల ఇబ్బందుల్లో పడింది. రైటింగ్‌ టేబుల్‌పై మరికొద్ది రోజుల ఫైన్‌ ట్యూనింగ్‌ జరిగినట్టయితే మిగతా షార్ట్‌ కమింగ్స్‌లో చాలా వరకు అధిగమించి వుండేది. కమర్షియల్‌ సినిమాల్లో లోపాలున్నా కామెడీ ప్లస్‌ ఇతర మసాలా అంశాలతో పాస్‌ అయిపోవచ్చు కానీ, ఈ తరహా చిత్రాల్లో పర్‌ఫెక్షన్‌ మాండెటరీ.

బాటమ్‌ లైన్‌: మొదలు ముగింపు మధ్య అంతా మిథ్య!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?