Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: 2 కంట్రీస్‌

సినిమా రివ్యూ: 2 కంట్రీస్‌

రివ్యూ: 2 కంట్రీస్‌
రేటింగ్‌: 1.5/5
బ్యానర్‌: మహాలక్ష్మి ఆర్ట్స్‌
తారాగణం: సునీల్‌, మనీషా రాజ్‌, శ్రీనివాసరెడ్డి, నరేష్‌, సంజన, పృధ్వీ, రాజా రవీంద్ర, సిజ్జు. సితార, సయాజి షిండే తదితరులు
మాటలు: శ్రీధర్‌ సీపాన
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: గోపి సుందర్‌
ఛాయాగ్రహణం: సి. రాంప్రసాద్‌
కథనం, నిర్మాత, దర్శకత్వం: శంకర్‌ .ఎన్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 29, 2017

హీరోగా చేస్తే చేసాడు కానీ కామెడీ చేయట్లేదనే కారణం మీద తన చిత్రాలని రిజెక్ట్‌ చేస్తున్నారనే రియలైజేషన్‌ అయితే సునీల్‌కి వచ్చింది. అందుకే గత కొన్ని సినిమాల్లో కామెడీ డోస్‌ పెంచి నవ్వించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. '2 కంట్రీస్‌'లో కూడా సునీల్‌ నవ్వించడం కోసం తనకి తెలిసిన ట్రిక్కులన్నీ వాడేసాడు. తన ట్రేడ్‌మార్క్‌ రియాక్షన్స్‌, మేనరిజమ్స్‌ అన్నీ ఇందులో వున్నాయి కానీ, సునీల్‌ అంత చేస్తున్నా నిజంగా నవ్వొచ్చిన సందర్భాలు చాలా అరుదు.

రెండున్నర గంటల సినిమాలో సునీల్‌ ఒక అరగంట పాటు నవ్వించి పోతే ఎంజాయ్‌ చేయవచ్చు కానీ వున్నంత సేపు అతనితో కామెడీ చేయించడమనేది అంత ఈజీ ఫీటు కాదు. సునీల్‌ నుంచి ప్రేక్షకులు కామెడీ కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కామెడీ రాసే రచయితలు, దర్శకులు కానరావడం లేదు.

కథలో భాగంగా కామెడీ వుంటోందే తప్ప, అదే బేస్‌ చేసుకుని సినిమాలు నడవడం లేదు. ఈ కారణం వల్లే అల్లరి నరేష్‌ కూడా స్ట్రగుల్‌ అవుతున్నాడు. సినిమా అంతటా నవ్వించగల ఈవీవీ లాంటి దర్శకులు ఇప్పుడు లేరు. కామెడీ పుట్టించడం ఎంత కష్టమవుతోందంటే శ్రీను వైట్ల లాంటి దర్శకులు సయితం ఇప్పుడు మార్కు చూపించలేక సఫర్‌ అవుతున్నారు. తనకి తగ్గ కథని ఎంచుకోవడంలో సునీల్‌ మరోసారి మిస్టేక్‌ చేసాడు.

ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇమేజ్‌ వున్న వెంకటేష్‌ తరహా హీరో చేయాల్సిన కథ. కామెడీకి స్కోప్‌ వుంది కదా అని సునీల్‌ని తీసుకున్నట్టున్నారు. అయితే మిగతా సినిమా అంతటా సునీల్‌ ఎలాగోలా నెట్టుకు వచ్చినా ఈ కథకి అత్యంత కీలకమైన పతాక సన్నివేశాల్లోని మెలోడ్రామా దగ్గర మాత్రం చేతులెత్తేసాడు. అలా బిగుసుకుపోయి, ముఖం దిగాలుగా పెట్టి, బేస్‌ వాయిస్‌లో డైలాగులు చెబుతూ సునీల్‌ పండించాలని చూసిన డ్రామాకి సెంటిమెంట్‌ పండకపోగా, 'ఇతనికెందుకు వచ్చిన పాట్లు ఇవి?' అనిపించకపోదు.

కథాపరంగా విషయమున్నదే. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవడానికి కావాల్సిన స్టఫ్‌ వున్న సబ్జెక్టే. మలయాళంలో '2 కంట్రీస్‌' మంచి హిట్‌ అయింది కూడా. అయితే మిస్‌ కాస్టింగ్‌తో, లో ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో, డ్రామాని తలపించే పర్‌ఫార్మెన్సులతో ఈ ఎన్‌. శంకర్‌ వెర్షన్‌ ప్రతి క్షణం విసిగించి సునీల్‌ ఖాతాలో మరో నిరాశాజనక చిత్రంగా మిగిలిపోయింది. కథలోకి వెళితే... డబ్బు మీద ఆశతో ఎన్నారైని పెళ్లి చేసుకుంటాడు హీరో. ఆమె తాగుడుకి బానిస అని లేట్‌గా తెలుస్తుంది.

ఆమె ఏమైపోయినా ఫర్వాలేదు కానీ భర్త హోదాలో తన అయిదు వందల కోట్ల ఆస్తి కొట్టేయాలని చూస్తాడు. కానీ ఆమె సమస్యలు తెలుసుకుని ప్రేమతో మార్చుకుందామని అనుకుంటాడు. ఇంతలో ఆమెకి అతని డబ్బు పిచ్చి గురించి తెలిసి విడాకులు కోరుతుంది. ఫన్‌ క్యారెక్టర్స్‌తో ఫ్యామిలీ డ్రామాతో కూడిన వినోదాన్ని అందించడానికి తగిన సెటప్‌ అయితే వుంది. మలయాళంలో ఈ కథ క్లిక్‌ అవడానికి కూడా కారణమదే.

కానీ ఏ దశలోను ఆకట్టుకునే సినిమాగా దీనిని తీర్చిదిద్దలేదు. కామెడీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కామెడీ కోసమే పెట్టుకున్న పాత్రలకి కూడా సరయిన సన్నివేశాలు, సంభాషణలు లేకపోవడంతో సీజన్డ్‌ ఆర్టిస్టులు సయితం కాపాడాలేకపోయారు. చాలా సందర్భాల్లో బడ్జెట్‌ పరిమితుల కారణంగా లో బడ్జెట్‌ టీవీ సీరియల్‌ చూస్తోన్న భావన కలుగుతుంది.

అమెరికాలో చిత్రీకరణ జరుపుకున్న చిత్రానికి ఈ తరహా కాంప్రమైజెస్‌ దేనికో మరి? సునీల్‌ చాలా కాలం తర్వాత పూర్తిగా ఫైట్లకి దూరంగా వున్నాడు. ఎక్కడా కమర్షియల్‌ హీరో అనిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకటి రెండు పాటల్లో సరదాగా రెండు స్టెప్పులయితే వేసాడు కానీ అంతకు మించి ఏ విధంగాను హీరోలా కనిపించేందుకు చూడలేదు. తన లుక్స్‌పై సెటైర్లు వేయించుకున్నాడు. తనకున్న కమెడియన్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగానే కనిపించడానికి ప్రయత్నించాడు.

అయితే తన ఇమేజ్‌కి తగ్గ కథ కాకపోయేసరికి సునీల్‌ ఎన్ని చేసినా, ఎంత తపించినా ఉపయోగం లేకపోయింది. ఇందులోని కామెడీ ఇటు క్లాస్‌, అటు మాస్‌ ఎవరినీ అలరించేది కాకపోవడం ఈ చిత్రాన్ని ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మార్చింది. తాగుబోతు పాత్ర చేయడానికి హీరోయిన్‌ మనీషా చాలా ఇబ్బంది పడింది. కనీసం తాగినట్టు నటించడం కూడా చేతకాని నటితో లీడ్‌ క్యారెక్టర్‌ చేయించడం, ఆమెకి వున్న ఆ బలహీనత చుట్టూ ఈ కథ అల్లుకోవడంతో కనీసం ఆ పాత్రపై సానుభూతి కూడా కలగని పరిస్థితి వచ్చింది. ఎప్పుడో ఎనభైవ దశకంలో వచ్చిన సినిమా చూస్తున్నట్టే సన్నివేశాలు, చిత్రీకరణ అన్నీ వుండడంతో 2 కంట్రీస్‌ కనీసం మాస్‌ని అయినా ఆకట్టుకోలేని సినిమాగా తయారైంది.

తెరపై నటీనటుల్లో ఏ ఒక్కరూ ప్రత్యేక ముద్ర వేయలేకపోయిన ఈ చిత్రానికి తెర వెనుక నుంచి కూడా  సహకారం అందలేదు. సాంకేతికంగా ఏ అంశం కూడా మెచ్చుకోతగినట్టు లేదు. దర్శకుడు ఎన్‌. శంకర్‌కి ఎమోషనల్‌ డ్రామాలు తీయడంపై పట్టుంది. తనకి అంతగా టచ్‌ లేని కామెడీ జోనర్‌లోకి అడుగు పెట్టడం స్వయంకృతమే అనాలి. అన్ని విధాలుగా మిస్‌ఫైర్‌ అయిన ఈ చిత్రానికి పెట్టిన టైటిల్‌లోను ఒరిజినాలిటీ లేదు. మలయాళంలో అప్పట్లో ఆంగ్ల టైటిల్స్‌ పెట్టడం ట్రెండ్‌ కనుక ఈ టైటిల్‌ పెట్టుకుని వుంటారు. తెలుగులోను అదే పేరు పెట్టుకోవడంలోనే ఈ రీమేక్‌ వెనుక ఏమాత్రం మేథోమదనం జరిగిందనేది స్పష్టమవుతుంది.

బాటమ్‌ లైన్‌: 2 బోరింగ్‌!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?