Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఖాకి

సినిమా రివ్యూ: ఖాకి

రివ్యూ: ఖాకి
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌
తారాగణం: కార్తి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అభిమన్యు సింగ్‌, బోస్‌ వెంకట్‌, మాథ్యూ వర్గీస్‌, రోహిత్‌ పాఠక్‌ తదితరులు
కూర్పు: శివ నందీశ్వరన్‌
సంగీతం: జిబ్రాన్‌
ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌
నిర్మాతలు: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు
రచన, దర్శకత్వం: హెచ్‌. వినోద్‌
విడుదల తేదీ: నవంబర్‌ 17, 2017

తమిళనాడులో 1995-2005 కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. దర్శకుడు వినోద్‌ తన మొదటి చిత్రం 'సతురంగ వేట్టయ్‌' మాదిరిగానే ఈసారి కూడా వాస్తవ సంఘటనలతో కూడిన కథ ఎంచుకుని, కమర్షియల్‌ ఫార్మాట్‌లో స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. రెగ్యులర్‌ పోలీస్‌ సినిమాలకి భిన్నంగా 'పరిశోధనాత్మక' ధోరణిలో సాగే వాస్తవపూరిత పోలీస్‌ డ్రామా ఇది.

హీరో పాత్ర పోలీస్‌ అనగానే అతడిని సూపర్‌ హీరోలా చూపించడం మన సినిమావాళ్లకి అలవాటు. అలాంటి వాస్తవ విరుద్ధ పోకడలకి పోకుండా ఒక క్లిష్టమైన కేసుని పోలీసులు ఎలా పరిశోధించి పరిష్కరించారనేది దర్శకుడు వినోద్‌ సహజంగా తెరకెక్కించాడు. ఈ క్రమంలో కమర్షియల్‌ విలువలు మిస్‌ కాకూడదనే ప్రయత్నంలో యాక్షన్‌ పార్ట్‌ని మాత్రం థ్రిల్లింగ్‌గా మలిచాడు. అలాగే హీరోయిన్‌తో రొమాన్స్‌, పాటలకి కూడా ఖాకిలో స్థానం కల్పించాడు.

ఫ్రెంచ్‌, కొరియన్‌ సినిమాల్లో ఇలాంటి ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే వారు పూర్తిగా కేసు మీదే దృష్టి పెట్టి ఎక్కడా ప్రేక్షకుడి అటెన్షన్‌ మరోవైపుకి పోకుండా జాగ్రత్త పడతారు. దర్శకుడు వినోద్‌ కూడా ఆ తరహా పంథాని అనుసరించినట్టయితే ఈ 'ఖాకి' పూర్తిస్థాయిలో విభిన్నమైన సినిమా అనిపించుకుని వుండేది. కమర్షియల్‌ కాంప్రమైజెస్‌ కోసం యాక్షన్‌ పార్ట్‌లో వాస్తవికత గీత దాటి నేల విడిచి సాము చేసారు.

అలాగే అసలు కథతో సంబంధం లేని కథానాయిక ట్రాక్‌ మీద అవసరానికి మించిన ఫోకస్‌ పెట్టారు. మొదట్లో ఈ ట్రాక్‌ చాలా టైమ్‌ తినేయగా, తర్వాత కథ రసకందాయంలో పడ్డాక కూడా తరచుగా అసలు కథకి అడ్డు పడుతూ ఇబ్బంది పెడుతుంది. ఈ బలవంతపు రొమాన్స్‌ వల్ల మూడ్‌ని డిస్టర్బ్‌ చేసే పాటలకి సయితం చోటివ్వాల్సి వచ్చింది. లక్కీగా ద్వితియార్ధంలో ఈ ట్రాక్‌ పూర్తిగా సైడ్‌ట్రాక్‌ అవుతుంది.

కథని క్లుప్తంగా చెప్పుకుంటే... అర్థరాత్రి పూట తలుపు కొట్టి ఇంట్లోకి ప్రవేశించి, కనిపించిన వారందరినీ చంపేసి, చేతికి దొరికింది దోచుకునే దొంగల తాకిడి తీవ్రమవుతుంది. సామాన్యులు చనిపోతున్నా కానీ పోలీస్‌, ప్రభుత్వం ఆ ఘట్టాలకి అంత విలువ ఇవ్వదు. ఒక ఎమ్మెల్యే ఇంట్లో చోరీ జరిగి, ఎమ్మెల్యేనే చనిపోయే సరికి ఈ కేస్‌ని టేకప్‌ చేసిన పోలీస్‌ అధికారికి (కార్తి) స్వేచ్ఛ దొరుకుతుంది. అయితే పూర్తి వనరులు ఇవ్వకుండా, వేలిముద్రలు తప్ప మరో ఆధారం లేని దొంగల ముఠాని అడ్డుకోవడం అంత తేలికైన పని కాదు. దీనిని అతను తన టీమ్‌ సాయంతో ఎలా సాల్వ్‌ చేసాడనేది ఖాకి కథ.

తమకి వున్న వనరులతోనే అసలు ఆచూకీ దొరకని దొంగల గురించిన మిస్టరీని పోలీసులు చేధించే ప్రక్రియ ఆకట్టుకుంటుంది. తమిళనాడులో జరిగిన దోపిడీలు, దారుణ హత్యల తాలూకు నేపథ్యం గురించి దర్శకుడు చేసిన రిసెర్చ్‌ మెప్పిస్తుంది. సదరు దోపిడీ దొంగల గురించిన పూర్తి హిస్టరీ కూడా కళ్లకి కట్టినట్టు వివరించడం బాగుంది. రాజస్థాన్‌ నేపథ్యం, అక్కడ దోపిడీ దొంగలు నివసించే ప్రదేశం, పోలీసులు వస్తే ఊరు మొత్తం ఏకమై తరిమికొట్టే వైనం లాంటి అంశాలని దర్శకుడు ప్రతిభావంతంగా చూపించాడు.

అవకాశం దొరికినపుడల్లా కథనం పరుగులు పెట్టించిన దర్శకుడు మధ్యమధ్యలో ఆయాసం తీర్చుకోవడానికా అన్నట్టు చతికిల పడేసాడు. అలాగే అరగంట ముందే ముగించడానికి వీలున్న కథని మళ్లీ మళ్లీ పట్టు సడలిస్తూ సుదీర్ఘంగా సాగదీసాడు.

సగటు సినిమా పోలీస్‌ పాత్రలకి భిన్నంగా వున్న పాత్రలో కార్తీ బాగా చేసాడు. తన స్టయిలింగ్‌ కూడా చక్కగా కుదిరింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌ వల్ల కథకి ప్రయోజనం చేకూరకపోగా, సమయాన్ని వృధా చేసింది. అభిమన్యుసింగ్‌ ఆహార్యంలో మార్పు వున్నా అభినయం పరంగా కొత్తదనమేమీ లేదు. సహాయ పాత్రల్లో నర్రా శ్రీను మినహా తెలిసిన ముఖాలేవీ లేవు. సాంకేతికంగా ఉన్నతంగా రూపొందిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొంభైల కాలం నాటి లుక్‌ కోసం చేసిన కలర్‌ గ్రేడ్‌ బాగా అమరింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ థ్రిల్లింగ్‌గా వున్నాయి. రాజస్థాన్‌లో బస్‌ ఛేజ్‌ ఎపిసోడ్‌ 'మ్యాడ్‌ మ్యాక్స్‌'ని తలపిస్తుంది.

దర్శకుడు వినోద్‌ ఈ కథ కోసం చాలానే కసరత్తు చేసాడు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలని సేకరించిన వినోద్‌ వాస్తవిక పరిస్థితులకి అద్దం పట్టేలా డీటెయిలింగ్‌ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడు. అతని కృషిని, శ్రమని మెచ్చుకోకుండా వుండలేం. వాస్తవ ఘటనల చుట్టూ సినిమాటిక్‌ సెటప్‌ ఏర్పరిచే ప్రక్రియలో మాత్రం తడబడ్డాడు. వాటి కోసమని కొన్ని కీలకమైన విషయాలని హడావిడిగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

అడవి మనుషుల్లాంటి వాళ్లంటూ చెబుతూ వచ్చిన దొంగలకి ఒక లాయర్‌ వుండడం, ఒక ఆర్గనైజ్డ్‌ సిస్టమ్‌ వుండడం నమ్మశక్యంగా అనిపించదు. రెగ్యులర్‌ విలన్స్‌ మాదిరిగా వీరి సెటప్‌ దగ్గర ఒక ఐటెమ్‌ సాంగ్‌ కూడా సెట్‌ చేయడం వల్ల అంతవరకు వారి పాత్రల చుట్టూ వున్న 'రా' ఫీలింగ్‌ తగ్గిపోయి ఆ స్థానంలో రొటీన్‌ ఫీల్‌ వచ్చి చేరుతుంది. ఈ కథ కోసం దర్శకుడు చేసిన కృషి ప్రశంసనీయమైనప్పటికీ దీనిని సినిమాటిక్‌గా నడిపించకుండా అత్యంత సహజంగా తీర్చిదిద్దినట్టయితే ఆ కృషికి తగ్గ న్యాయం చేసినట్టుండేది.

ఇంటర్వెల్‌కి ముందు పదిహేను నిమిషాల బిగి సడలని ఘట్టాలు, ద్వితియార్ధంలో రాజస్థాన్‌లో వచ్చే యాక్షన్‌ దృశ్యాలు, ఉన్నత సాంకేతిక విలువలు ఈ చిత్రానికి హైలైట్‌ కాగా, సుదీర్ఘమైన నిడివి, అవసరం లేని కమర్షియల్‌ హంగులు ఖాకి కళ తప్పడానికి కారణమయ్యాయి. రన్‌ టైమ్‌ విషయంలో కేర్‌ తీసుకుని రెండు గంటల నిడివిలో బిగి సడలకుండా చెప్పే స్కోప్‌ వున్నా కానీ చాలా సార్లు కథనం పక్కదారులు పట్టింది. సహజ సిద్ధమైన పోలీస్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌, యాక్షన్‌ లవర్స్‌ని ఖాకి మెప్పించగలదు. పోలీస్‌ కథల్లో కొత్త ట్రెండ్‌ సృష్టించే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని వుంటే ఇదో పాత్‌ బ్రేకింగ్‌ సినిమా అయి వుండేది.

బాటమ్‌ లైన్‌: రొటీన్‌ 'ఖాకి' కాదు!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?