Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఎంసిఏ

సినిమా రివ్యూ: ఎంసిఏ

రివ్యూ: ఎంసిఏ - మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: నాని, భూమిక, సాయి పల్లవి, విజయ్‌, నరేష్‌, రాజీవ్‌ కనకాల, ఆమని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ తదితరులు
కూర్పు: ప్రవీణ్‌ పూడి
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాతలు: రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ 
కథ, కథనం, దర్శకత్వం: శ్రీరామ్‌ వేణు
విడుదల తేదీ: డిసెంబర్‌ 21, 2017

నాని, సాయి పల్లవి ఇద్దరి టాలెంట్‌ గురించి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. వీరిద్దరూ జంటగా నటిస్తున్నారంటేనే ఆ చిత్రానికి క్రేజ్‌ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. అందులోను దిల్‌ రాజు బ్యానర్‌ నుంచి వస్తోన్న సినిమా అనేసరికి దానికో మినిమమ్‌ గ్యారెంటీ వుండనే వుంటుంది. 'మిడిల్‌ క్లాస్‌' అంటూ సినిమా గోయర్స్‌లో మెజారిటీ సెక్షన్‌ని ఆకర్షించే టైటిల్‌ కూడా కుదిరేసింది. హంగులన్నీ బాగా కుదిరిన ఈ 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌'కి ఆ అందమైన ప్యాకేజింగ్‌ అడుగున మెప్పించే స్టఫ్‌ మాత్రం మిస్‌ అయింది. దర్శకుడు శ్రీరామ్‌ వేణు ఎంచుకున్న క్యారెక్టర్‌ నేపథ్యం బాగుంది కానీ దానిని ముందుకి నడిపించి, దానినుంచి మాగ్జిమమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పిండుకునే ప్లాట్‌లైనే లేకుండా పోయింది.

ఉద్యోగం లేకుండా జులాయిలా తిరుగుతోన్న మిడిల్‌ క్లాస్‌ యువకుడికి వదినకి చేదోడు వాదోడుగా వుండాల్సిన అవసరం వస్తుంది. గవర్నమెంట్‌ ఆఫీసర్‌ అయిన సదరు వదిన చాలా స్ట్రిక్ట్‌ కనుక ఇంట్లో 'పాలేరు' తరహా పాత్ర అయిపోతుందా యువకుడిది. వదిన మనసెంత మంచిదని ఎరిగిన ఆ మరిదికి ఆమెకో కష్టం వచ్చిందని తెలుస్తుంది. విలన్‌ నుంచి వదినని కాపాడేందుకు మిడిల్‌ క్లాస్‌ యువకుడు కాస్తా యాక్షన్‌ హీరోగా అవతరిస్తాడు. శ్రీరామ్‌ వేణు రాసుకున్న స్టోరీ లైన్‌ ఇదే. మధ్యలో ఓ చిన్నపాటి ముచ్చటైన లవ్‌స్టోరీ కూడా వుంది.

సాధారణంగా నాని చేతికి ఒక సాధారణ స్క్రిప్ట్‌ ఇచ్చినా కానీ తన ప్రతిభతో దానిని జనరంజకంగా మార్చేస్తుంటాడు. అతని టాలెంట్‌ ఏమిటనేది గతంలో చాలా చిత్రాల్లో చూసాం కూడా. ఇందులోను ఫస్ట్‌ హాఫ్‌ వరకు కుదిరినప్పుడల్లా తన ప్రతిభతో లాక్కొచ్చాడు. అతనికి తోడుగా టాలెంట్‌కి ఏమాత్రం లోటు లేని సాయి పల్లవి వుండడంతో ప్రథమార్ధాన్ని ఈ జంటే ఆల్‌మోస్ట్‌ నిలబెట్టేసింది. కానీ వాళ్లు కూడా చేష్టలుడిగి చూస్తుండిపోయేంత మేటర్‌ లేని సెకండ్‌ హాఫ్‌ చేతిలో పెట్టే సరికి నాని, సాయి పల్లవి కలిసి కూడా సెకండాఫ్‌లో మరో మ్యాజికల్‌ మూమెంట్‌ క్రియేట్‌ చేయలేకపోయారు.

వదిన చేతిలో పాట్లు పడే మరిది పాత్రతో ఆరంభంలో వినోదం బాగానే పండింది. హీరో హీరోయిన్ల రొమాన్స్‌ ట్రాక్‌ కూడా సరదాగానే సాగుతుంది. సాఫీగా సాగిపోతున్న ఈ వినోదాత్మక ఫ్యామిలీ సెట్టింగ్‌లోకి విలన్‌ ఎంటర్‌ అయ్యే సరికి కథే మారిపోయింది. అంతవరకు వున్న ఫన్‌ పోయి యాక్షన్‌ టర్న్‌ తీసుకున్న సినిమాని నడిపించడం దర్శకుడి వల్ల కాకపోయింది.

వదినని పది రోజులు చంపేస్తానంటూ గడువు పెట్టిన విలన్‌ హీరోని గడగడలాడిస్తుంటే చూస్తోన్న వారికి టెన్షన్‌ స్టార్ట్‌ అవుతుంది. కానీ ఆ విలన్‌ గ్యాంగ్‌ని గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ చేసి భయపెట్టేసే సరికి ఇక అతడిని సీరియస్‌గా తీసుకునే ఛాన్స్‌ లేకుండా పోయింది. ఎప్పుడయితే విలన్‌ వీక్‌ అయిపోయాడో, సెకండాఫ్‌ మొత్తం నిలబడాల్సిన త్రెడ్‌ లూజ్‌ అయిపోయి, దానిపై 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌' నిలబడే స్కోప్‌ లేపోయింది. పతాక సన్నివేశాన్నేదో వెరైటీగా ప్లాన్‌ చేసారు కానీ అది కూడా అయిపోయిన కథని ఇంకాస్త పొడిగించడానికి తప్ప పెద్దగా ఉపయోగపడకుండా పోయింది.

'ఎంసిఏ'గా నాని ఎంత చేయగలడో అంత చేసాడు. కామెడీ సీన్లతో పాటు యాక్షన్‌ సీన్స్‌లోను రాణించాడు. అయితే తను సయితం లిఫ్ట్‌ చేయలేనంత డొల్ల స్క్రిప్ట్‌ అయ్యేసరికి నాని కూడా ఏం చేయలేకపోయాడు. సాయి పల్లవి ఆకట్టుకునే ఎక్స్‌ప్రెషన్స్‌తో, ఆటిట్యూడ్‌తో మరోసారి యువతని అలరిస్తుంది. ఈ క్యారెక్టర్‌ని ఇంట్రడ్యూస్‌ చేసినప్పుడు వున్న ఎక్సయిట్‌మెంట్‌ ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

ముఖ్యంగా విలన్‌-హీరో కథగా టర్న్‌ అయిన తర్వాత కథానాయికకి చోటు దక్కలేదు. భూమిక బాగానే చేసింది కానీ ఆ పాత్రకి కావాల్సిన గాంభీర్యాన్ని, డైనమిజమ్‌ని తెర మీదకి తీసుకురాలేకపోయింది. ఆమె క్యారెక్టర్‌ని హైలైట్‌ చేస్తూ చేసిన బిల్డప్‌ షాట్స్‌ సైతం తేలిపోయాయి. విలన్‌గా విజయ్‌ యంగ్‌ రఘువరన్‌లా కాస్త కొత్తగా అనిపించినప్పటికీ క్యారెక్టరైజేషన్‌లోని ఇన్‌కన్సిస్టెన్సీ వల్ల ఆ పాత్ర కూడా తేలిపోయింది. నరేష్‌, ఆమని, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి సహాయ పాత్రల్లో కనిపించారు.

వరంగల్‌, లక్నవరం తదితర ప్రాంతాల్లో ఎక్కువ శాతం షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రాన్ని సమీర్‌రెడ్డి  తన కెమెరాలో చాలా రిచ్‌గా చూపించారు. ఫిదా తర్వాత మరోసారి తెలంగాణ ఇంటీరియర్స్‌ని కనువిందుగా చూపించిన చిత్రమిది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం ఏమంత ఆకట్టుకోదు. ఈ చిత్ర కథలానే అతని పాటలు కూడా పాత పాటల్ని తలపిస్తాయి. నేపథ్య సంగీతంలోను దేవి ముద్ర లేదు. కమర్షియల్‌గా పే చేసే అంశాలతో తెరకెక్కుతోన్న దిల్‌ రాజు రీసెంట్‌ చిత్రాల్లానే ఇది కూడా అదే రీతిన రూపొందింది కానీ ఈసారి ఫార్ములాని కూడా సరిగా ఫాలో కాకపోవడం వల్ల సగం నుంచి ట్రాక్‌ తప్పేసింది.

'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయ్‌' అంటూ అంత పర్టిక్యులర్‌గా టైటిల్‌ పెట్టుకున్నప్పుడు ఆ మధ్య తరగతి నేపథ్యం తాలూకు వినోదం వుంటుందని ఆశిస్తారెవరైనా. కానీ ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాకి ఆకర్షణీయమైన పేరుగా తప్ప ఆ టైటిల్‌తో దీనికి వచ్చిన ప్రత్యేకత ఏమీ లేదు. ఫస్ట్‌ హాఫ్‌లో ఎలాగైతే వినోదం మీద ఫోకస్‌ చేసారో, అదే మూడ్‌ ద్వితీయార్ధంలోను మెయింటైన్‌ చేసినట్టయితే ఎంత రొటీన్‌గా వున్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి లోటు జరిగేది కాదు.

కనీసం టైమ్‌పాస్‌ సినిమాగా పాస్‌ అయిపోయేది. అలాంటిది ఇక త్వరగా ముగించేస్తే బయటకి పోవచ్చు అని విసిగిపోయేంతగా సెకండ్‌ హాఫ్‌ ట్రాక్‌ తప్పుతుంది. కమర్షియల్‌గా సంచలనాలు చేసే కాంబినేషన్‌ వున్న చిత్రం కాస్తా ఇప్పుడా ఇప్పుడా కాంబినేషన్‌ క్రేజ్‌పై, సెలవుల సీజన్‌పై ఆధారపడాల్సొస్తుంది. యావరేజ్‌ కంటెంట్‌ వున్నా నిలబెట్టగల సత్తా వున్న ప్రతిభావంతులైన హీరో హీరోయిన్లుండి కూడా ద్వితియార్ధాన్ని ఇంత పేలవంగా తీర్చిదిద్దడమేమిటో మరి.

బాటమ్‌ లైన్‌: మిడిల్‌ డ్రాప్‌ అబ్బాయ్‌!
- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?