Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రంగుల రాట్నం

సినిమా రివ్యూ: రంగుల రాట్నం

రివ్యూ: రంగుల రాట్నం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: రాజ్‌ తరుణ్‌, చిత్ర శుక్లా, ప్రియదర్శి, సితార తదితరులు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల
ఛాయాగ్రహణం: ఎల్‌.కె. విజయ్‌
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌
రచన, దర్శకత్వం: శ్రీరంజని
విడుదల తేదీ: జనవరి 14, 2018

పెద్ద పండక్కి భారీ సినిమాలు విడుదలవుతున్నాయనే బెదురు లేకుండా ఒక చిన్న చిత్రాన్ని కూడా సంక్రాంతి బరిలో నిలిపేసరికి ఆ చిత్రంపై మేకర్స్‌కి వున్న నమ్మకం ప్రేక్షకులకీ ఎంతో కొంత ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. గత రెండేళ్లలో సంక్రాంతికి చిన్న సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడాయి కనుక ఈసారి కూడా రంగులరాట్నంతో అది రిపీట్‌ అవుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ రంగుల రాట్నంలో రంగులు తక్కువయి, డార్క్‌ షేడ్‌ డామినేట్‌ చేసింది. రంగులరాట్నం తిరగనని మొరాయించడమే కాకుండా ఆ మందకొండి గమనంతో నిద్రపుచ్చినంత పని చేసింది.

టైటిల్‌ని బట్టి, ప్రోమోస్‌ చూసి ఇదొక ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమనే భావన కలుగుతుంది కానీ ఇందులో వినోదం కంటే కూడా విషాదం మోతాదు మించింది. ప్రథమార్ధం చూస్తూ అసలు ఎటు పోతోందీ చిత్రమనే భావన రేకెత్తుతూ వుండగా సడన్‌గా వచ్చే ట్విస్టుతో సినిమా స్వరూపమే మారిపోతుంది. ఆ ఎమోషనల్‌ డ్రామాని రాజ్‌ తరుణ్‌ చక్కని నటనతో పండించినా కానీ మరీ ఎక్కువ స్ట్రెచ్‌ చేసిన ఆ ఎపిసోడ్‌ పండుగ వేళ ఆశించే సినీ వినోదానికి సరిగ్గా వ్యతిరేక భావనలు కలిగిస్తుంది.

హీరోయిన్‌ క్యారెక్టర్‌ మరీ డల్‌గా వున్న ఈ కథలో అంతవరకు హుషారుగా వున్న హీరోని కూడా అదే మూడ్‌లోకి తీసుకెళ్లిపోవడం మంచి ఐడియా కాదనిపిస్తుంది. ఒక అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయిపై వుండే పొసెసివ్‌నెస్‌తో పాటు అతి జాగ్రత్త అనే పాయింట్‌ వల్ల కాన్‌ఫ్లిక్ట్‌ ఏర్పడే లవ్‌స్టోరీ ఇది. ఈ పాయింట్‌లో ఫన్‌ ఎలిమెంట్‌కి స్కోప్‌ బాగానే వుంది. ఆ సంగతి ఈ పాయింట్‌పై ఫోకస్‌ పెట్టిన చివరి అరగంటలో క్లియర్‌గా తెలస్తుంది. అయితే ఆ సంఘర్షణకి ఈ ప్రేమజంట చేరుకునేలోగా డైరెక్టర్‌ కుదిర్చిన సెటప్‌ అంతగా ఆకట్టుకోకపోగా, చాలా సందర్భాల్లో ఎమోషన్స్‌ ఫోర్స్‌డ్‌గా, బలవంతంగా మనపై రుద్దుతోన్న భావన కలిగిస్తాయి.

ఈ తరహా ఎమోషనల్‌ డ్రామాలా కాకుండా లైటర్‌వీన్‌లో ఇదే పాయింట్‌ని డీల్‌ చేసినట్టయితే రంగుల రాట్నం మరింత వినోదభరితంగా అనిపించేదేమో. లేదా ఎమోషనల్‌గానే డీల్‌ చేయాలనేది డైరెక్టర్‌ ఆలోచన అయితే అందుకు తగ్గ బలమైన సన్నివేశాలని రాసుకోవాల్సింది. 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రంలో హీరోకి సిమిలర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవుతుంది. అయితే ఆ ట్రాజెడీకి కథలో కీలకమైన పాత్ర వుంటుంది. కానీ ఈ చిత్రంలో ఆ ట్రాజెడీ వల్ల ఎక్కువ ఇంపాక్ట్‌ లేకపోగా, అసలు ఆ సంఘటన ఎందుకు జరిగిందని అనిపించేలా దానికి పెద్ద ఇంపార్టెన్స్‌ కూడా కనిపించకుండా పోయింది.

మ్యూజికల్‌ లవ్‌స్టోరీలా ప్రెజెంట్‌ చేయాలనే ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. పాటలు వినసొంపుగా లేకపోయేసరికి చాలా సందర్భాల్లో అవి పంటి కింద రాళ్లలా తగుల్తుంటాయి. శ్రీచరణ్‌ పాకాల సంగీతం ఈ ప్రేమకథని ఎలివేట్‌ చేయడంలో విఫలమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థనుంచి వచ్చే చిత్రాల్లో నిర్మాణ విలువలు బాగుంటాయి. ఎక్కడా రాజీ పడిన ధోరణి కనిపించదు.

కానీ ఈ చిత్రంలో బడ్జెట్‌ లిమిటేషన్స్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో లొకేషన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ పరంగా కూడా కేర్‌ తీసుకోలేదనిపిస్తుంది. ప్రమోషన్స్‌ పరంగాను రంగుల రాట్నంకి తగిన పుష్‌ లేకపోవడం విచిత్రంగా తోస్తుంది. బడ్జెట్‌ పరమైన లిమిటేషన్స్‌ వున్న సినిమాలకి సాంకేతికంగా చెప్పుకోతగ్గ అవుట్‌పుట్‌ వుండడం అరుదు. ఈ చిత్రంలో టెక్నికల్‌ స్టాండర్డ్స్‌ అతి సాధారణంగా వున్నాయి సినిమాటోగ్రఫీతో సహా.

డైరెక్టర్‌ శ్రీరంజని కొన్ని సందర్భాల్లో సెన్సాఫ్‌ హ్యూమర్‌తో ఆకట్టుకుని, కొన్ని చోట్ల ఎమోషనల్‌గాను టచ్‌ చేయగలిగినా కానీ రెండిటి మధ్య బ్యాలెన్స్‌ పాటించే విషయంలో విఫలమయింది. ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా కానీ అది ఎక్కువ మందికి అప్పీల్‌ అయ్యేలా చేసే స్క్రీన్‌ప్లే కొరవడింది. ఒక్కసారి కాన్‌ఫ్లిక్ట్‌ ఏమిటనేది రివీల్‌ చేసిన తర్వాత నెరేషన్‌పై డైరెక్టర్‌ పట్టు కనిపించింది. కాకపోతే ఆ కాన్‌ఫ్లిక్ట్‌ ఎక్కడో చివరి అరగంట ముందు కానీ రాకపోవడంతో అంతవరకు డైరెక్షన్‌ కూడా పడుతూ లేస్తూ సాగింది.

రాజ్‌ తరుణ్‌ మరోసారి తన నటనతో ఇంప్రెస్‌ చేసాడు. సీరియస్‌ డ్రామా సీన్స్‌ని ఎంత బాగా పండించగలడనేది ఇందులో చూపించాడు. హీరోయిన్‌ చిత్ర శుక్లా మరీ ముదురుగా అనిపిస్తుంది. రాజ్‌ తరుణ్‌కి తగ్గ జోడీలా కాకుండా అతనికంటే వయసులో పెద్దదానిలా కనిపించింది. అసలే క్యారెక్టరైజేషన్‌ డల్‌ అయిపోవడంతో ఆ ఎఫెక్ట్‌ హీరోయిన్‌ పర్‌ఫార్మెన్స్‌పైనా రిఫ్లెక్ట్‌ అయింది. రాజ్‌ తరుణ్‌ తల్లి పాత్రలో సితార సహజ నటనతో ఆకట్టుకోగా, పెళ్లిచూపులు తర్వాత చాలా రోజులకి మళ్లీ ప్రియదర్శికి గుర్తించదగ్గ రోల్‌ దొరికింది.

ఎమోషనల్‌గా సాగే మెలోడ్రమెటిక్‌ లవ్‌స్టోరీస్‌ ఇష్టపడేవారిని ఈ చిత్రం కొంతమేర మెప్పించవచ్చు కానీ ప్లెజెంట్‌ లవ్‌స్టోరీస్‌ కోరుకునే వారిని బాగా విసిగిస్తుంది. రంగుల రాట్నంలో అడపాదడపా కొన్ని రంగులు కనిపించినా కానీ, చివరి అరగంటలో కథాగమనంలో వేగం పెంచినా కానీ నిట్టూర్పులు విడిచేలా చేసిన సందర్భాలే ఎక్కువ. 

పొందికలేని కథనం, మోతాదు మించిన విషాదం, ముందుకి కదలనంత నిదానం వెరసి ఈ చిత్రాన్ని భారంగానే మార్చాయి తప్ప రంగులరాట్నమెక్కిన అనుభూతి అయితే ఖచ్చితంగా ఇవ్వలేదు. 'సంక్రాంతి పండక్కి బొబ్బట్టు లాంటి సినిమా' అంటూ ప్రచారం చేస్తోన్న ఈ చిత్రంలో స్వీట్‌ కంటే హాటే ఎక్కువైంది. పండుగ వేళ చూడాలని కోరుకునే తరహా వినోదభరిత కుటుంబ కథా చిత్రమైతే కానే కాదు మరి. ఈ లిమిటెడ్‌ అప్పీల్‌తో ఈ రంగులరాట్నం ఏమాత్రం తిరుగుతుందనేది చూడాలి. 

బాటమ్‌ లైన్‌: తిరగని రాట్నం!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?