Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఉన్నది ఒకటే జిందగీ

సినిమా రివ్యూ: ఉన్నది ఒకటే జిందగీ

రివ్యూ: ఉన్నది ఒకటే జిందగీ
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: స్రవంతి సినిమాటిక్స్‌, పిఆర్‌ సినిమాస్‌
తారాగణం: రామ్‌ పోతినేని, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి, ప్రియదర్శి, కిరీటి దామరాజు, ఆనంద్‌ తదితరులు
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
సమర్పణ: స్రవంతి రవికిషోర్‌
నిర్మాత: కృష్ణ చైతన్య
రచన, దర్శకత్వం: కిషోర్‌ తిరుమల
విడుదల తేదీ: అక్టోబర్‌ 27, 2017

స్నేహం, ప్రేమ మధ్య ఇరుక్కున్న ఇద్దరు స్నేహితుల కథలు గతంలో చాలానే వచ్చాయి. 'నేను శైలజ' దర్శకుడు కిషోర్‌ తిరుమల అదే కాన్సెప్ట్‌తో తీసిన 'ఉన్నది ఒకటే జిందగీ' ఈ కథకి కొత్త కోణం ఇవ్వడంలో విఫలమైంది. ఒక కారణమ్మీద దూరమైన ఇద్దరు స్నేహితులు తిరిగి ఎలా ఒక్కటయ్యారనేది ఈ చిత్రం ఇతివృత్తం. అయితే స్నేహితులు విడిపోవడానికి బలమైన కారణం కానీ, ఇద్దరూ తిరిగి ఒకటయ్యేందుకు తగిన సందర్భం కానీ సృష్టించలేకపోవడం ఈ చిత్రానికి జరిగిన అతి పెద్ద లోపం.

కథలోకి వెళితే... అభి (రామ్‌), వాసు (శ్రీవిష్ణు) చిన్ననాటి స్నేహితులు. అమ్మలేని లోటుని తీర్చిన స్నేహితుడు వాసుకోసం అభి ఏదైనా చేసేస్తాడు. కట్‌ చేస్తే... పద్ధెనిమిదేళ్ల తర్వాత వాళ్లిద్దరూ విడిపోయారని వారి స్నేహితుల మాటల్లో తెలుస్తుంది. ఎందుకు విడిపోయారంటే కారణం మహా (అనుపమ). వాసు ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లిన టైమ్‌లో అభికి మహా పరిచయం అవుతుంది. ఆమెని ప్రేమిస్తాడు. స్నేహితుడికి విషయం చెప్పి ఆమెకి తన ప్రేమ సంగతి చెప్పాలనుకుంటాడు.

కానీ మహా మరెవరో కాదు... వాసు మేనమామ కూతురు. ఆమెని అతను కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన సంగతి చెప్పేస్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లి మహాకి ఒకే టైమ్‌లో ప్రపోజ్‌ చేస్తారు. ఇద్దరిలో మహా ఎవరిని ఎంచుకుంటుంది? తర్వాత స్నేహితుల మధ్య దూరం ఎలా పెరుగుతుంది? అది మళ్లీ ఎలా తగ్గుతుంది?

ఒకే అమ్మాయితో ప్రేమలో పడ్డ ప్రాణ స్నేహితుల కథలో కిషోర్‌ కొత్తగా చూపించిందంటూ ఏదైనా వుంటే, ఇద్దరూ ఒకేసారి ఆమెకి ప్రేమిస్తున్నామని చెప్పడం, ఇద్దరిలో ఎవరు నచ్చారో ఆలోచించుకుని చెప్పమనడం. ఈ పాయింట్‌ తర్వాత కథ ఆసక్తికరంగా నడుస్తుందని అనుకుంటే, ఒక్కసారిగా 'పాయింట్‌లెస్‌' గొడవకి దారి తీసి, ఇద్దరు ప్రాణమిత్రులు దూరమైపోయే ఘట్టం చోటు చేసుకుంటుంది. ఇంటర్వెల్‌కి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత ఈ కథని ఎమోషనల్‌గా నడిపించాలా లేక ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్డ్‌గా వెళ్లాలా అనే సందిగ్ధానికి గురైనట్టు తోస్తుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌కే కట్టుబడి సెకండ్‌ హాఫ్‌ ఓపెన్‌ చేయడంతో నాలుగు సంవత్సరాల పాటు దూరమైన స్నేహితుల మధ్య 'కాన్‌ఫ్లిక్ట్‌' కామెడీలో కలిసిపోతుంది. పెళ్లి తంతు పేరు చెప్పి కొత్త పాత్రలు (వెడ్డింగ్‌ ప్లానర్‌ లావణ్య, ఆమె పిఏ కానుక) ఎంటర్‌ అవడంతో కథనం గాడి తప్పుతుంది. ముందే చెప్పినట్టు విడిపోవడానికి బలమైన కారణం వున్నట్టయితే మళ్లీ కలవడానికి అలాంటి గట్టి కారణాలు వుండి తీరాలి. మాట్లాడుకుంటే తొలగిపోయే మనస్పర్ధలు కావడం వల్ల స్నేహితులు తిరిగి కలుస్తారో లేదో అనే 'సంఘర్షణ'కి తావు లేకుండా పోయింది. వాళ్లు మాట్లాడుకుంటే కథ కంచికి చేరుతుంది కనుక ఆ మాట్లాడుకునే సందర్భాన్ని ఆలస్యం చేయడానికి మధ్యలో అల్లుకున్న సన్నివేశాలన్నీ ఫ్లోలో లేకపోవడం వల్ల ల్యాగ్‌ పెరిగి విసుగొస్తుంది.

స్నేహితులు ఇద్దరి మధ్య ఎంత అనుబంధం వుందనేది డైలాగుల్లో చెబుతుంటారే తప్ప వారి గాఢమైన స్నేహాన్ని చూపించే సన్నివేశం ఒక్కటీ లేకపోవడం మరో బలహీనతగా మారింది. రామ్‌, శ్రీవిష్ణు ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేసినా కానీ ఇద్దరు స్నేహితుల మధ్య  వుండాల్సిన కెమిస్ట్రీ మాత్రం మిస్‌ అయింది. వాళ్లిద్దరూ వున్న సీన్లలో ఇద్దరు నటులే తెరపై కనిపిస్తారే తప్ప ఇద్దరు స్నేహితులు కనిపించకపోవడం వల్ల ఈ కథ రక్తి కట్టే వీల్లేకుండా పోయింది. దర్శకుడు కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఫ్రెండ్‌షిప్‌ ఎంత గాఢమైనదో తెలిపే సన్నివేశాలపై దృష్టి పెట్టి వుండాల్సింది.

కనీసం ఛైల్డ్‌హుడ్‌ ఎపిసోడ్‌కి కేటాయించినంత సమయం కూడా ఇద్దరు స్నేహితుల నడుమ అడల్ట్‌హుడ్‌లో బాండింగ్‌ చూపించకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్‌ పాట పాడుకోగానే శ్రీవిష్ణు సీన్‌లోంచి ఎగ్జిట్‌ అయి అనుపమ ఎంటర్‌ అవుతుంది. మళ్లీ అతను ఎంటర్‌ అవడంతోనే ఇద్దరూ ఒకరినే ప్రేమిస్తున్నారనే పాయింట్‌ రివీల్‌ అవుతుంది. అది జరిగిన కాసేపటికే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కలుసుకునే సరికి ఇద్దరి మధ్య మాటలు వుండవు కనుక స్నేహితుల బంధం చూపించే వీల్లేకపోతుంది.

'ఫ్రెండ్‌, ఫ్రెండ్‌' అంటూ కథానాయకుడు అనుక్షణం అతని ధ్యాసలోనే వుంటాడు కానీ మాటల్లో కాకుండా అతని స్నేహాన్ని చేతల్లో చూపించే అవకాశం పతాక సన్నివేశంలో కానీ దర్శకుడు ఇవ్వలేదు. హీరోకి ఆ ఛాన్స్‌ ఇచ్చిన క్లయిమాక్స్‌ సీన్‌లో ఎమోషన్‌ బాగా పండింది. అయితే కేవలం ఒక్క సీన్‌తో కనక్ట్‌ అయి కన్నీళ్లు పెట్టుకునే కథ కాదిది. సదరు పాత్రల తాలూకు ఎమోషన్స్‌ని ఆసాంతం ఫీల్‌ అయితే తప్ప ఆకట్టుకోలేదీ జిందగీ.

కొన్ని మంచి సంభాషణలు, అక్కడక్కడా హత్తుకునే సన్నివేశాలు, రెండు-మూడు ఆకట్టుకునే పాటలు, అడపాదడపా పేలే జోకులు మినహా 'ఉన్నది ఒకటే జిందగీ' ఓవరాల్‌గా మెప్పించలేకపోతుంది. రామ్‌ తన రెగ్యులర్‌ లుక్‌తో పాటు రాక్‌ బ్యాండ్‌ నడిపేవాడిగా ఇంకో కొత్త లుక్‌లో కనిపించాడు. తన వరకు ఎప్పటిలా ఎలాంటి రాంగ్‌ నోట్‌ లేకుండా బాగా పర్‌ఫార్మ్‌ చేసాడు. శ్రీవిష్ణు కూడా తన పాత్రకి న్యాయం చేసాడు. అనుపమ ఉన్నంత సేపు ప్రధానాకర్షణగా నిలిచింది. లావణ్య పాత్ర అండర్‌ డెవలప్డ్‌ అనే ఫీల్‌నిస్తుంది. ప్రియదర్శి, కిరీటి కామెడీ డిపార్ట్‌మెంట్‌ హ్యాండిల్‌ చేసారు.

ఫ్రెండ్‌షిప్‌ యాంథెమ్‌గా నిలిచిపోయేట్టు దేవి ఒక పాటని అందంగా స్వరపరిచాడు. రయ్యి రయ్యిమంటూ పాట అతను ఇటీవల కంపోజ్‌ చేసిన ఉత్తమ బాణీల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నేపథ్య సంగీతం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. మాటల రచయితగా రాణించిన దర్శకుడు కిషోర్‌ తిరుమల కథనం విషయంలో మాత్రం తడబడ్డాడు.

ఈ సినిమాలో కోర్‌ ఎమోషన్‌ పే అవడానికి తగ్గ విధంగా ఈ కథని నడిపించలేకపోయాడు. కమర్షియల్‌గా తీయాలా లేక కథకి న్యాయం చేయాలా అనే మీమాంసకి లోనయి అసలుకే ఎసరు పెట్టాడు. 'నేను శైలజ' చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ పకడ్బందీ ట్రీట్‌మెంట్‌ రాసుకున్న కిషోర్‌కి ఈసారి ఆ బ్యాలెన్స్‌ కుదర్లేదు. అటు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇటు ఎమోషన్‌ రెండిటి మధ్య సమతూకం మాట అలా వుంచి, అవి రెండూ కూడా బలవంతంగా కథలోకి వచ్చిపోతున్న భావన కలిగించాడు. స్నేహం కోసం ప్రాణమిచ్చేసే బాపతు యువతకి ఓ మాదిరిగా కనక్ట్‌ అయ్యే ఈ చిత్రం మిగతా వర్గాల నుంచి మాత్రం పెదవి విరుపులే చవిచూస్తుంది.

బాటమ్‌ లైన్‌: ఉన్నది ఒకటే జిందగీ... ఇంతేనా దాని సంగతి!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?