Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ద్వారక

సినిమా రివ్యూ: ద్వారక

రివ్యూ: ద్వారక
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
లెజెండ్‌ సినిమా
తారాగణం: విజయ్‌ దేవరకొండ, పూజ ఝవేరి, పృధ్వీ, రఘుబాబు, ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మ, సుదర్శన్‌, సురేఖవాణి తదితరులు
మాటలు: లక్ష్మిభూపాల్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
సంగీతం: సాయికార్తీక్‌
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
నిర్మాతలు: ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్‌ పెనుబోతు
రచన, దర్శకత్వం: శ్రీనివాస రవీంద్ర (ఎంఎస్‌ఆర్‌)
విడుదల తేదీ: మార్చి 3, 2017

'పెళ్లిచూపులు'తో యూత్‌కి లేటెస్ట్‌ ఫేవరెట్‌గా మారిన విజయ్‌ దేవరకొండ ఫ్యాక్టర్‌ వల్ల 'ద్వారక' చిత్రానికి కాస్త బజ్‌ వచ్చింది. హీరోని దొంగ బాబాగా చూపించిన ట్రెయిలర్‌ ఇదేదో కొత్తగా వుంటుందనే భావన కలిగించింది. కానీ 'పెళ్లిచూపుల' కళ వెలసిపోవడానికి, కొత్తగా వుంటుందనే కల కరిగిపోవడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా దర్శకుడు త్వరగానే క్లారిటీ ఇచ్చేసాడు. 

కథ ఆరంభమైన తీరు చూస్తే ఇది ఖచ్చితంగా రొటీన్‌కి భిన్నమైన వ్యవహారమనే ఎక్సయిట్‌మెంట్‌ కలుగుతుంది. చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరోని, అతని బ్యాచ్‌ని పోలీసులు హ్యాండిల్‌ చేసే తీరు చాలా నేచురల్‌గా వుంది. చిల్లర దొంగ పాత్రకి తగ్గట్టుగా విజయ్‌ వేషధారణ, ఒంటి తీరు అన్నీ సరిగ్గా కుదిరే సరికి రెగ్యులర్‌ చిత్రాలకి భిన్నమైన పంథాలో వెళుతుందనే భావన కలుగుతుంది. కానీ దేవుడి విగ్రహం దొంగిలించి పారిపోతూ గుడి మెట్ల మీద పడుకున్న హీరోయిన్‌పై విజయ్‌ పడడం, వెంటనే ప్రేమలో పడడం దగ్గర్నుంచీ ఇక ఈ సినిమా పడడమే తప్ప మళ్లీ లేచింది లేదు.

డబ్బు వాసన తప్ప ప్రపంచంలో ఇంకేదీ పడదంటూ, దేనికీ లొంగడంటూ పరిచయం చేసిన క్యారెక్టర్‌ అలా చెప్పి పది నిమిషాలైనా తిరగకముందే చీకట్లో చూసిన అమ్మాయిపై పీకల్లోతు ప్రేమలో పడిపోతాడట. అసలు ఇలాంటి క్యారెక్టర్లకి లవ్‌ లాంటి డీప్‌ ఫీలింగ్స్‌ అంత ఈజీగా పుట్టేస్తాయా? హీరో అన్నాక అరగంట తర్వాత అయినా హీరోయిన్‌నే ప్రేమించాలి తప్ప సైడ్‌ క్యారెక్టర్‌ని ప్రేమించలేడుగా అంటారా? అది నిజమే, కానీ ఈ కథనం నడిపించడానికి టూల్‌లా వాడుకున్న ఆ పరిచయం ఎంత బలంగా వుండాలి? ఆమెని ప్రేమించడానికి అతనికి ఎంత రీజనబుల్‌ రీజన్‌ వుండాలి? మామూలుగా అయితే ఇలాంటివన్నీ తెలుగు సినిమాల్లో సహజమేనంటూ పెద్దగా పట్టించుకోం కానీ సినిమా మొదలు పెట్టినపుడు కనిపించిన సహజత్వం ఒక్కసారే చీకట్లోకి పోయే సరికి కూసింత కలుక్కుమనిపిస్తుంది. 

కథలోకి వెళితే, ఎర్ర శీను (విజయ్‌) ఒక చిల్లర దొంగ. అనుకోకుండా ఒక రోజున ఒక అపార్ట్‌మెంట్‌పై బాబా అయిపోతాడు. డబ్బులు బాగా వస్తాయని అతను కమిట్‌ అయిపోతే, అతనెవరో తెలిసిన వాళ్లు శ్రీనుని అడ్డం పెట్టుకుని బిజినెస్‌ చేస్తారు. అక్కడ్నుంచి పారిపోదాం అనుకుంటాడు కానీ తను ప్రేమించిన వసుధ (పూజ) కనిపించే సరికి అక్కడే వుండిపోతాడు. అయితే తనలాంటి మోసగాడిని ప్రేమించలేనని వసుధ చెప్పేసరికి తానొక దొంగనని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పేస్తాడు. తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అతడి ప్రేమ ఏ విధంగా సుఖాంతమవుతుందనేది మిగతా కథ. 

ముందే చెప్పుకున్నట్టు ఆరంభంలో ఆసక్తికరంగా మొదలైన చిత్రం చాలా వేగంగా రొటీన్‌ ట్రాక్‌ పట్టేస్తుంది. విలన్లు, పాటలు, లవ్వులు అంటూ పరమ రొటీన్‌గా సాగిపోతున్న చిత్రం ఏ దశలోను మళ్లీ ఆసక్తికరంగా అనిపించదు. ఇంటర్వెల్‌ సీన్‌ బాగున్నప్పటికీ ఆ వెంటనే మళ్లీ ఎస్కేపిస్ట్‌ ధోరణిలోకి మారిపోయి అవే సీన్లు రిపీట్‌ చేసుకుంటూ విపరీతంగా బోర్‌ కొట్టించారు. విలన్లు చేసే పనులు, వాళ్లు మాట్లాడే మాటలు టీవీ సీరియళ్లలోని నెగెటివ్‌ పాత్రలని తలపిస్తాయి. కనీసం పతాక సన్నివేశాల్లో అయినా ఆసక్తి రేకెత్తించేది ఏదైనా జరుగుతుందని ఆశపడితే క్లయిమాక్స్‌ మరీ దీనంగా వుంటుంది తప్ప ఏమాత్రం ఎక్సయిట్‌ చేయదు. 

టెక్నికల్‌గా ఇది బాగుంది అని చెప్పుకోతగ్గ అంశం ఒక్కటీ లేదు. శ్యామ్‌ కె. నాయుడు సినిమాటోగ్రఫీ కూడా అతి సాధారణంగా అనిపించడం ఆశ్చర్యకరం. సాయికార్తీక్‌ పాటలు అలవాటున్న వాళ్లకి సిగరెట్‌ బ్రేక్‌కి, లేని వాళ్లకి పవర్‌ న్యాప్‌కి పనికొస్తాయి. బురిడీ బాబాలని నమ్మవద్దంటూ, మీ మనసు చెప్పిందే నమ్మండి, కష్టపడి పైకిరండి అంటూ దర్శకుడు ఒక మంచి మెసేజ్‌ అయితే ఇద్దామని అనుకున్నాడు, కానీ దానిని ఎఫెక్టివ్‌గా చెప్పే స్టోరీ, స్క్రీన్‌ప్లే రాసుకోలేకపోయాడు. అతని డైరెక్షన్‌ కూడా ఓల్డ్‌ స్కూల్‌ పద్ధతుల్లో సాగింది. ఎప్పుడో ఎనభైలలో వచ్చిన సినిమాలు చూస్తోన్న భావన కలిగిస్తుంది. 

విజయ్‌ దేవరకొండ దొంగ పాత్రకి తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో, కేర్‌లెస్‌నెస్‌తో ఆకట్టుకున్నాడు కానీ అతడిని తెచ్చి బాబాగా కూర్చోపెట్టాక తేలిపోయాడు. కామెడీ టైమింగ్‌ విపరీతంగా వుండడంతో పాటు స్పాంటేనిటీ, ఇంప్రొవైజ్‌ చేయగల కెపాసిటీ వున్న నటుడైతే ఇలాంటి పాత్రలని రక్తి కట్టించగలడు. రొమాన్స్‌ పార్ట్‌లో కూడా విజయ్‌ ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తాడంటే దానికి రైటర్‌, డైరెక్టర్‌లనే తప్పు పట్టాలి. పూజ ఝవేరి లుక్స్‌ ఇంప్రెసివ్‌గా లేకున్నా నటన వరకు ఓకే. ప్రభాకర్‌ నటన రొటీన్‌గా వుంది. పాజిటివ్‌ థింకింగ్‌తో పృధ్వీ క్యారెక్టర్‌ కాస్త నవ్విస్తుంది. మిగిలిన వారిలో మురళి శర్మ కూడా తన సహజ శైలికి భిన్నంగా ఓవర్‌ ది టాప్‌ పర్‌ఫార్మెన్స్‌తో షాకిస్తాడు. 

పెళ్లిచూపులు దృష్టిలో పెట్టుకుని విజయ్‌ కోసం వెళ్లిన వాళ్లకే కాక, కాసేపు కాలక్షేపం కోసం వెళ్లిన వాళ్లనీ ద్వారక తీవ్రంగా నిరాశపరుస్తుంది. థియేటర్లోకి ఎంటర్‌ అయిన కాసేపటికే ద్వారములు ఎప్పుడు తెరుస్తారా అంటూ బయటకి దారి వెతుక్కునేలా చేస్తుంది. 

బాటమ్‌ లైన్‌: హే కృష్ణా!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?