Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

సినిమా రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి

రివ్యూ: గౌతమిపుత్ర శాతకర్ణి
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: బాలకృష్ణ, శ్రియా శరన్‌, హేమమాలిని, కబీర్‌బేడి, శివరాజ్‌కుమార్‌ తదితరులు
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
కళ: భూపేష్‌ ఆర్‌. భూపతి
కూర్పు: రామకృష్ణ ఆర్రం
సంగీతం: చిరంతన్‌ భట్‌
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
నిర్మాతలు: రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు, 'బిబో' శ్రీనివాస్‌
రచన, దర్శకత్వం: క్రిష్‌
విడుదల తేదీ: జనవరి 12, 2017

ఇంతవరకు తీసిన ప్రతి చిత్రంలోను కొత్త కాన్సెప్ట్‌ టచ్‌ చేసి, దర్శకుడిగా తనకంటూ ఒక శైలిని, బాణీని ఏర్పరచుకున్న క్రిష్‌ ఈసారి చారిత్రిక కథాంశాన్ని తీసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన బాలకృష్ణ వందవ చిత్రంగా తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో క్రిష్‌ రెండు భారీ బాధ్యతలని భుజానికెత్తుకున్నాడు. ఒకటి ఎక్కువమందికి తెలియని 'శాతకర్ణి' వీరగాధని చెప్పడం, రెండు బాలకృష్ణ వందవ చిత్రంపై ఉండే అంచనాలకి తగ్గ విధంగా సినిమాని తీర్చిదిద్దడం. శాతకర్ణి గురించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లినట్టయితే ఈ చిత్రంలో మనకి లభించేది అరకొర ఇన్‌ఫర్మేషనే. బాలయ్య వందవ చిత్రాన్ని ఆస్వాదించడానికి వెళితే మాత్రం పెట్టిన పైసలకి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తుంది. 

'గౌతమిపుత్ర శాతకర్ణి' పరిపాలనా దక్షతా, వ్యవహార శైలి, ఆలోచనా విధానాలు, చేపట్టిన సంస్కరణలు వగైరా విషయాలపై క్రిష్‌ దృష్టి పెట్టలేదు. శాతకర్ణి గురించిన ఇన్‌ఫర్మేషన్‌ ఎక్కడా అందుబాటులో లేదు కనుక క్రిష్‌ చాలా శోధించి, సాధించి ఈ చిత్రాన్ని తలపెట్టి ఉంటాడని ఆశించడంలో తప్పులేదు. కానీ క్రిష్‌ తనకి దొరికిన కొద్దిపాటి ఇన్‌ఫర్మేషన్‌తోనే ఒక కమర్షియల్‌ సినిమాకి అనువైన అంశాలని జోడించి ఈ చారిత్రిక చిత్రంతో వైవిధ్యభరిత వినోదాన్ని అందించాడు. కేవలం రెండుంపావు గంటల నిడివి ఉన్న ఈ చిత్రంలో డ్రామాకి కనీసం పావు వంతు స్కోప్‌ కూడా ఇవ్వలేదు. సినిమా సాంతం యుద్ధ సన్నివేశాలతో నింపేసారు. ఇందులో శాతకర్ణి చేసిన యుద్ధాల్లో మూడింటిని కవర్‌ చేశారు. అందులో మొదటిది కేవలం పాత్ర పరిచయానికి మాత్రం వాడుకున్న యుద్ధ సన్నివేశం కాగా, రెండవది సుదీర్ఘంగా సాగుతూ దాదాపు ముప్పావు వంతు ప్రథమార్ధాన్ని అదే కవర్‌ చేసేస్తుంది. 

ద్వితీయార్ధంలో భార్యాభర్తల నడుమ అభిప్రాయబేధాలతో కాసేపు ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. అదే సమయంలో తల్లి పట్ల, స్త్రీల పట్ల శాతకర్ణికి వున్న అపార గౌరవాభిమానాల గురించిన వివరాలు తెలుస్తాయి. భరత ఖండాన్ని ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకురావాలని, యుద్ధాలు లేకుండా చేయడానికి యుద్ధం చేయడమే మార్గమని నమ్మిన శాతకర్ణి తన లక్ష్యానికి ముగింపుగా ఒక శాంతియుద్ధం చేయ సంకల్పిస్తాడు. అలెగ్జాండర్‌ వల్ల కాని భరతఖండాన్ని జయించాలని వచ్చిన గ్రీకు చక్రవర్తి డిమిత్రియస్‌తో ఈ యుద్ధం చేస్తాడు. ఈ చిత్రం ద్వితియార్ధంలో సింహభాగం ఈ యుద్ధ సన్నివేశాలే ఉంటాయి. తెలుగువారు గర్వించే ధీరత్వాన్ని ప్రదర్శించిన శాతకర్ణి ధైర్య సాహసాలు ఆకట్టుకుంటాయి కానీ, క్రిష్‌లాంటి దర్శకుడు తీసిన చిత్రంలో కేవలం యుద్ధాలు మినహా ఎక్కువ డీటెయిల్స్‌ లేకపోవడం నిరాశ పరుస్తుంది. 

సుదీర్ఘంగా సాగే యుద్ధ సన్నివేశాల నడుమ కొన్ని చప్పట్లు కొట్టించే సంభాషణలు, ఇంకొన్ని హీరోయిజమ్‌తో కూడిన షాట్లు అలరిస్తాయి కానీ అదే పనిగా జరుగుతోన్న యుద్ధం ఒక దశ దాటిన తర్వాత విసిగిస్తుంది. నహాపనుడితో జరిగే యుద్ధంలో అయినా ఆసక్తి రేకెత్తించే వ్యూహ ప్రతివ్యూహాలుంటాయి కానీ అంతిమ యుద్ధం మాత్రం చప్పగా సాగిపోతుంది. క్రిష్‌ దర్శకుడు కనుక సగటు బాలయ్య మాస్‌ అభిమానులకి నచ్చే అంశాలు ఏమి వుంటాయనే అనుమానాలు రేకెత్తాయి. అయితే క్రిష్‌ ఈ చిత్రాన్ని ఫక్తు బాలకృష్ణ మార్కు మాస్‌ సినిమాలానే తీర్చిదిద్దడం ఆశ్చర్యపరుస్తుంది. అడుగడుగునా హీరోయిజమ్‌ ఎలివేట్‌ చేసే సన్నివేశాలు, అనర్గళంగా వచ్చి పడే పంచ్‌ డైలాగులు, తొడకొట్టడాలు, మీసం తిప్పడాలు ఏదీ మిస్‌ కాలేదిందులో. మొత్తంగా చారిత్రిక నేపథ్యంలో బాలకృష్ణ మార్కు మాస్‌ సినిమా చూస్తోన్న అనుభూతి కలిగిస్తుందిది. 

క్రిష్‌ దర్శకత్వ ప్రతిభ చూపెట్టే సన్నివేశాలు కొన్ని బ్రహ్మాండంగా పేలాయి. 'శాతకర్ణి' వీరత్వాన్ని చూపించడానికి కేవలం అతని బల ప్రదర్శన మీద ఆధారపడకుండా సన్నివేశ బలంతోనే దానిని చూపెట్టాడు. ఎదురుగా తనకి మూడింతలు సైన్యం ఉన్న రాజు యుద్ధానికి కాలు దువ్వుతోంటే, కొడుకు చెప్పే చందమామ కథ వింటుంటాడు శాతకర్ణి. మాట మాట్లాడకుండా హీరోయిజం పీక్స్‌లో చూపించే సీన్‌ అది. తెరపై ఈ చిత్రానికి బాలకృష్ణ హీరో అయితే తెరవెనుక దీనికి హీరోగా నిలిచాడు సాయిమాధవ్‌ బుర్రా. తన అద్భుతమైన రచనతో సంభాషణలని రక్తి కట్టించడమే కాకుండా, ఒక్కోసారి దర్శకుడు డౌన్‌ అయిన సందర్భాల్లో తన తన డైలాగ్స్‌తో సీన్‌ని నిలబెట్టేసాడు. విజువల్‌గా అప్పీలింగ్‌గా ఉండడంలో కళా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రాఫిక్స్‌ పరంగా బాహుబలితో పోల్చే క్వాలిటీ అయితే లేదు. తక్కువ రోజుల్లో పూర్తి చేసిన సినిమా కనుక విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కాంప్రమైజ్‌లు తప్పినట్టు లేవు. 

ఇలాంటి పాత్రలు చేయాలంటే తను తప్ప ఇండస్ట్రీలో ఇంకో ఆప్షన్‌ లేదని బాలకృష్ణ ఇంకోసారి నిరూపించారు. రౌద్ర రసాన్ని పోషించడంలో దిట్ట అయిన బాలకృష్ణకి తన బెస్ట్‌ ఎమోషన్స్‌ని పలికించే అవకాశాన్ని ఈ చిత్రం అడుగడుగునా కల్పించింది. శాతకర్ణిగా తనని తప్ప మరొకర్ని ఊహించుకునే ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు. డైలాగులు చెప్పడంలో తన బలాన్ని పూర్తిస్థాయిలో వాడుకుని పలు సందర్భాల్లో ఒంటి చేత్తో ఈ చిత్రాన్ని లాగేసారు. బాలకృష్ణ కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్రగా ఇది నిలిచిపోతుంది. భర్త యుద్ధ దాహానికి విసిగిపోయిన భార్యగా శ్రియ మెప్పించింది కానీ, శాతకర్ణికి స్ఫూర్తిప్రదాత అయిన పాత్రలో హేమామాలిని తేలిపోయింది. లిప్‌సింక్‌ సరిగా ఇవ్వకపోవడమే కాకుండా, అవసరమైన ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా ఆమె పలికించలేకపోయింది. 

శాతకర్ణి గురించిన పూర్తి అవగాహన ఇవ్వడంలో ఈ చిత్రం విజయవంతం కాలేదు కానీ, తెలుగువారి ఎమోషన్స్‌ టచ్‌ చేయడంలో కొంతవరకు సక్సెస్‌ అయింది. శాతకర్ణి చరిత్ర కంటే బాలకృష్ణ రౌద్ర రస పూరిత నటన, సాయిమాధవ్‌ బుర్రా అత్యద్భుతమైన సంభాషణలు ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలిచాయి. యుద్ధ సన్నివేశాల నిడివి తగ్గించి, ఆ మహా చక్రవర్తి గురించి వివరంగా తెలియజెప్పి, అతడి ఘన చరిత్ర గురించిన ముద్రని బలంగా వేసేట్టుగా డ్రామా పండించాల్సింది. ఈ చిత్రం చూసిన తర్వాత ఇంతమందిపైన యుద్ధం చేసాడు, ఒక యుద్ధానికి పసిడి ప్రాయంలోని తన కొడుకుని వెంట తీసుకెళ్లాడు లాంటి విశేషాలు తప్ప శాతకర్ణి  గురించి లోతయిన వివరాలేం తెలీవు.

లోపాలు, లోటులు పక్కనపెడితే, ఇంత తక్కువ సమయంలో ఇంత స్కేల్‌ వున్న ఈ చిత్రాన్ని ఇలా తీర్చిదిద్దినందుకు క్రిష్‌ అభినందనీయుడు. తన ప్రతి చిత్రం ప్రత్యేకంగా ఉండాలనే అతని తపనకి జేజేలు. వందవ చిత్రానికి తన కంఫర్ట్‌ జోన్‌ విడిచిపెట్టి వచ్చి ఈ చిత్రం సంకల్పించిన బాలకృష్ణకి, తన డైలాగ్స్‌తో సినిమా స్థాయిని పెంచిన బుర్రా సాయిమాధవ్‌కి హేట్సాఫ్‌. రొటీన్‌ సినిమాలు వచ్చి పోతూనే ఉంటాయి కానీ చాలా అరుదుగా వచ్చే ఇలాంటి ఘన ప్రయత్నాలకి ప్రేక్షకుల ప్రోత్సాహం తప్పనిసరి. కాకపోతే సగటు సినిమాల విషయంలో అలసత్వం ఉండొచ్చు కానీ ఇలాంటి బృహత్తర యత్నాలకి అరకొర సమాచారంతో సరిపెడితే చాలదు కనుక లోతైన శోధనలు చేసి తీరాలి.

బాటమ్‌ లైన్‌: భళా బాలకృష్ణా!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?