Advertisement

Advertisement


Home > Movies - Reviews

రివ్యూ: గృహం

రివ్యూ: గృహం

రివ్యూ: గృహం
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
ఏతకీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: సిద్ధార్థ్‌, ఆండ్రియా, అనీషా విక్టర్‌, అతుల్‌ కులకర్ణి, సురేష్‌ తదితరులు
రచన: సిద్ధార్థ్‌, మిలింద్‌ రౌ
కూర్పు: లారెన్స్‌ కిషోర్‌
సంగీతం: గిరీష్‌
ఛాయాగ్రహణం: శ్రేయాస్‌ కృష్ణ
నిర్మాత: సిద్ధార్థ్‌
దర్శకత్వం: మిలింద్‌ రౌ
విడుదల తేదీ: నవంబర్‌ 17, 2017

లిమిటెడ్‌ సెక్షన్‌కి మాత్రమే అప్పీల్‌ అయ్యే హారర్‌ జోనర్‌కి కామెడీ కలిపి ఎక్కువ శాతం ప్రేక్షకులకి అప్పీల్‌ అయ్యేట్టు చూడడం ఈమధ్య ట్రెండ్‌ అయింది. ఈ కారణంగా గత అయిదారేళ్లలో ఫక్తు హారర్‌ సినిమాలు బాగా తగ్గిపోయి, పూర్తిగా హారర్‌ కామెడీలే వాటిని రీప్లేస్‌ చేసాయి. నయనతార నటించిన 'మయూరి' (మాయ) లాంటి నిఖార్సయిన హారర్‌ సినిమాలు ఎప్పుడో కానీ రాని కొరతని తీరుస్తూ 'గృహం' ఒక జెన్యూన్‌ హారర్‌ అనుభూతిని ప్రేక్షకులకి అందిస్తుంది. 

సిద్ధార్థ్‌, మిలింద్‌ కలిసి రాసిన ఈ కథ, సెటప్‌ కొత్తగా ఏమీ లేదు. చాలా హారర్‌ సినిమాల మాదిరిగానే ఇది కూడా 'హాంటెడ్‌ హౌస్‌' సెటప్‌లోనే వుంటుంది. కొత్తగా ఇంట్లోకి వచ్చిన కుటుంబానికి అక్కడ వున్న ఆత్మల కారణంగా ఇబ్బందులు ఎదురు కావడం, ఆ కథేంటనేది వారు పరిశోధించడం, చివరిగా దానికి పరిష్కారం కనుగొనడం. అంతా తెలిసిన కథలానే అనిపిస్తున్నా కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం అంతర్జాతీయ హారర్‌ చిత్రాలకి ధీటుగా నిలిచేట్టుంది. సాధారణంగా మన హారర్‌ సినిమాలకి సౌండ్‌ డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా చీప్‌గా అనిపిస్తుంటాయి. కానీ 'గృహం' చిత్రం సాంకేతికంగా అత్యుత్తమ స్థాయిలో రూపొందింది. హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌ వల్ల విజువల్‌గా ఇంకాస్త స్టన్నింగ్‌గా అనిపిస్తుంది.

ప్రత్యేకించి సౌండ్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్‌ సినిమా పక్కన నిలిచేట్టు చేస్తాయి. తెలిసిన సెటప్‌ అయినా కానీ ఇందులో భయంగొలిపే సన్నివేశాలు మనం ఊహిస్తున్న మాదిరిగా రాకుండా, ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్‌గా, షాకింగ్‌గా వస్తుంటాయి. హారర్‌ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే మాదిరి స్లో బిల్డప్స్‌, సడన్‌ జంప్స్‌ లాంటివి లేకుండా, ఉలిక్కిపాటున భయపెట్టే చీప్‌ థ్రిల్స్‌ కాకుండా ఖచ్చితమైన షాక్‌ వేల్యూ వున్న సన్నివేశాలతో దర్శకుడు మిలింద్‌ హారర్‌ సినిమా అభిమానుల కరువు తీర్చే సినిమానే అందించాడు. 

మొదట్లో లవర్‌బాయ్‌ పాత్రలకే పరిమితమైన సిద్ధార్థ్‌ ఇటీవల కథల ఎంపికలోనే తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. తమిళ రంగానికి పూర్తిగా షిఫ్ట్‌ అయిన దగ్గర్నుంచి సిద్ధార్థ్‌ ప్రతి సినిమాలోను వైవిధ్యం కోసం పరితపిస్తున్నాడు. లవ్‌ ఫెయిల్యూర్‌, జిగరదండా, ఎనక్కుల్‌ ఒరువన్‌, జిల్‌ జంగ్‌ జక్‌... ఇలా సిద్ధార్థ్‌ రీసెంట్‌ ఫిల్మోగ్రఫీ చూడముచ్చటగా వుంది. కమర్షియల్‌గా ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే హారర్‌ కామెడీని వదిలేసి ఫక్తు ట్రెడిషినల్‌ హారర్‌ సినిమాని నిర్మించడం ద్వారానే తన అభిరుచిని ఇంకోసారి చాటుకున్నాడు. నిర్మాతగా, కథకుడిగానే కాక నటుడిగా కూడా ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ పూర్తి న్యాయం చేసాడు. తన పాత్ర ఎక్కడా కథని డామినేట్‌ చేయనివ్వకుండా అవసరం మేరకే కనిపించాడు. ఆండ్రియాతో కెమిస్ట్రీ కానీ, సురేష్‌ పాత్రతో వుండే ఆ అనుబంధాన్ని కానీ చాలా నేచురల్‌గా అభినయించాడు. 

ఆండ్రియా వున్నంతలో బాగానే చేసింది. సురేష్‌ సహాయ పాత్రలో ఎఫెక్టివ్‌గా వున్నాడు. జెన్నీగా అనీషా విక్టర్‌ ఈ చిత్రానికి మెయిన్‌ ఎట్రాక్షన్‌ అయింది. ఆమె అభినయం ఈ చిత్రానికి వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచింది. మరో కీలక పాత్రలో అతుల్‌ కులకర్ణి నటన సైతం మెప్పిస్తుంది. ముందే చెప్పినట్టు సాంకేతికంగా ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందింది. ఎడిటింగ్‌, మ్యూజిక్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ పర్‌ఫెక్ట్‌గా వున్నాయి. 

సగటు హారర్‌ సినిమాల శైలిలో పాత్రల పరిచయంతో నెమ్మదిగా మూడ్‌లోకి తీసుకెళ్లే ఈ చిత్రం ఒక్కసారి హారర్‌ టోన్‌లోకి మారాక ఊపిరాడని ఉత్కంఠని రేపుతుంది. ప్రత్యేకించి సెకండ్‌ యాక్ట్‌ అద్భుతంగా వుండడంతో చివరి ఘట్టంపై అంచనాలు బాగా పెరుగుతాయి. లాస్ట్‌ యాక్ట్‌ కూడా దర్శకుడు బిగి సడలకుండా నడిపించినప్పటికీ క్లయిమాక్స్‌లో వుండాల్సిన పంచ్‌ మిస్‌ అయింది. మనం అమితంగా కేర్‌ చేసే క్యారెక్టర్స్‌కి ముప్పు పొంచివుండడం ద్వారా మరింతగా టెన్షన్‌ పెట్టే అవకాశముంటుంది. కానీ ఈ కథకి ఎంచుకున్న క్లయిమాక్స్‌ వల్ల దానికి ఆస్కారం లేకుండా పోయింది. 

సినిమా నిడివి రెండు గంటల పైనే వున్నప్పటికీ అనవసరమైన సన్నివేశాలతో కాలయాపన కానీ, కథనం చిక్కబడిన తర్వాత కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ పేరిట పక్క చూపులు కానీ లేకుండా 'పాయింట్‌' మీదే ఫోకస్‌ వుంచడం వల్ల 'గృహం' తాలూకు అట్మాస్ఫియర్‌లోకి పూర్తిగా లీనమయ్యే వీలు చిక్కింది. పాటల పేరిట మూడ్‌ డిస్టర్బ్‌ అవడం, జోక్‌ చెప్పి నవ్వించడం కోసం తపన పడడం లేకుండా, రాజీ పడని విధంగా జోనర్‌కి న్యాయం చేసినందుకు సిద్ధార్థ్‌, మిలింద్‌ అభినందనీయులు. 

ఆరంభంలో శృంగారం మోతాదు కాస్త ఎక్కువగా వున్న ఫీలింగ్‌ వస్తుంది. మన స్టాండర్డ్స్‌కి ఒక షాకింగ్‌ లవ్‌ మేకింగ్‌ సీన్‌ కూడా వుంది. ఆ సీన్‌ చూస్తున్నపుడు 'మరీ ఇంతెందుకు?' అనే దానికి సమాధానం తర్వాత దొరుకుతుంది. పర్పస్‌ లేకుండా ఏ సన్నివేశం కథనంలోకి చొరబడకుండా రచయితలు చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించారు. జెనరిక్‌ ఎలిమెంట్స్‌ మరీ ఎక్కువ వుండడం, బాగా తెలిసిన సెటప్‌ వుండడం వల్ల కాన్సెప్ట్‌ పరంగా ఫ్రెష్‌నెస్‌ లేదనే వెలితి కొందరికి అనిపించవచ్చు. అయితే ఒక పూర్తిస్థాయి హారర్‌ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో చూడాలని కోరుకుంటోన్న వారికి గృహం సంతృప్తినిస్తుంది. బాగా అరుదైపోయిన గతి తప్పని హారర్‌ సినిమా చాలా కాలం తర్వాత వచ్చింది కనుక ఈ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకులు మిస్‌ కాకూడని సినిమా ఇది. లిమిటెడ్‌ అప్పీల్‌ వల్ల కమర్షియల్‌ రీచ్‌ తక్కువ వుండొచ్చు కానీ ఈ జోనర్‌లో ఇటీవల వచ్చిన ఉత్తమ సినిమాల్లో మాత్రం ముందు వరసలో గృహం నిలుస్తుంది.

బాటమ్‌ లైన్‌: ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే!

గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?