Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గుంటూరోడు

సినిమా రివ్యూ: గుంటూరోడు

రివ్యూ: గుంటూరోడు
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌
తారాగణం: మంచు మనోజ్‌, ప్రగ్యా జైస్వాల్‌, సంపత్‌ రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్‌, సత్య తదితరులు
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
సంగీతం: శ్రీవసంత్‌
ఛాయాగ్రహణం: సిద్ధార్థ రామస్వామి
నిర్మాత: శ్రీవరుణ్‌ అట్లూరి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: ఎస్‌.కె. సత్య
విడుదల తేదీ: మార్చి 3, 2017

'గుంటూరోడు' ప్రోమోస్‌ చూసినా, పోస్టర్లు చూసినా ఇది ఎలాంటి సినిమా అనేదానిపై ఒక ఐడియా వచ్చేస్తుంది. అచ్చంగా బి,సి సెంటర్స్‌ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీసిన మాస్‌ మసాలా చిత్రమనేది ప్యాకేజింగ్‌లోనే తెలిసిపోతుంది కనుక ఈ చిత్రానికి వెళ్లే వాళ్లకంటూ కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. ఇలాంటి చిత్రాల నుంచి ఆద్యంతం హుషారుగా సాగిపోయే కథనం, జోరయిన పాటలు, మంచి వినోదంకి మినహా ప్రేక్షకులు ఆశించేదేమీ వుండదు. టార్గెట్‌ ఆడియన్స్‌ ఎవరో తెలిసినపుడు, వారికి కావాల్సిందేమిటో స్పష్టత వున్నపుడు దర్శకుడి పని ఈజీ అయిపోతుంది. అయితే వంద సినిమాల్లో తొంభై ఇలాంటివే వస్తున్నపుడు వాటి మధ్య తమ చిత్రం ప్రత్యేకంగా వుండడం కోసం దర్శకుడు, రచయితలు, ఇతర సాంకేతిక నిపుణులు ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌ పెట్టాలి. 

'గుంటూరోడు' చిత్రంలో సగటు మాస్‌ మసాలా సినిమాకి కావాల్సిన అంశాలన్నీ పెట్టుకున్నారు కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా నడిపించలేకపోయారు. కథ ఏమిటనేది స్పష్టంగా తెలిసిపోతున్నపుడు కథనం అత్యంత వేగంగా పరుగులు పెట్టాలి. తమిళ దర్శకులు హరి, లింగుస్వామి ఇదే టెక్నిక్‌ ఫాలో అవుతుంటారు. 'గుంటూరోడు' కథలోని సంఘర్షణ ఏదైతే వుందో అది ఆల్రెడీ లింగుస్వామి తీసిన 'పందెంకోడి'లో చూసినదే. హీరో ఒక సందర్భంలో విలన్‌ని కొడతాడు. అసలే ఈగో ఎక్కువైన విలన్‌ అతడిని ఎలాగైనా చంపేయాలనే కసితో తిరుగుతుంటాడు. ఇక ఆ పాయింట్‌కి జత చేసిన మరో రొటీన్‌ ఎలిమెంట్‌ ఏమిటంటే ఆ విలన్‌ చెల్లెలితోనే హీరో ప్రేమలో పడతాడు. విలన్‌ని లాక్‌ చేయడానికి వేసుకున్న ఇంకో రొటీన్‌ లాక్‌ ఏమిటంటే, అతనికి పొలిటికల్‌ యాంబీషన్‌ వుంటుంది కనుక అతడు డైరెక్టుగా హీరోని దెబ్బ కొట్టలేడు! 

హీరో హీరోయిన్ల ప్రేమ వ్యవహారం కానీ, హీరో-విలన్‌ మధ్య క్లాష్‌ కానీ ఏదీ ఎక్సయిటింగ్‌గా అనిపించదు. విలన్‌ ఏం చేసినా కానీ హీరో దానికి పై ఎత్తు వేసేస్తుంటాడు. తనకి సలహా ఇస్తేనే సహించలేక ఒకడిని చంపేసేంత మూర్ఖత్వమున్న విలన్‌ క్లయిమాక్స్‌ సీన్‌కి వచ్చేసరికి సడన్‌గా మారిపోతాడు. అంత పవర్‌ఫుల్‌గా చూపించిన విలన్‌ని ఒకటే సీన్‌లో కమెడియన్‌ని చేయడం అనేది మన దర్శకులు ఎప్పుడు మానుకుంటారో? ఒక్కటంటే ఒక్క సీన్‌ కూడా కొత్తగా అనిపించడం మాని కనీసం ఉత్కంఠ కలిగించదు. ఇంటర్వెల్‌ సీన్‌లో ఫోన్‌లో ఒకరిపై ఒకరు అరుచుకుంటోన్న హీరో, విలన్లని చూస్తే జాలి కలగకపోదు. సీన్‌లో లేని ఇంటెన్సిటీని, సినిమాలో లేని పవర్‌ని పుట్టించడానికి పాపం మనోజ్‌, సంపత్‌ ఇద్దరూ తమ శక్తికి మించి మరీ అరిచారు. 

ఒక సీన్‌లో పృధ్వీ కనిపించే సరికి కనీసం నవ్వుకోడానికి ఒక సీను వచ్చినట్టుంది అనిపిస్తుంది కానీ ఆ సీన్‌ అయిపోయాక, ఇదసలు ఫైనల్‌ కట్‌లో ఎందుకుంది? కట్‌ చేసేస్తే ఎక్కడ హర్టయి, పృధ్వీ ఫేస్‌బుక్‌లో సెంటిమెంట్‌ పోస్ట్‌ చేస్తాడోనని భయపడి ఉంచేసారా అన్నట్టుంది. స్క్రీన్‌ప్లే మొత్తం ఎపిసోడ్లు, ఎపిసోడ్లు లెక్కన సాగుతుందే తప్ప ఎక్కడా సీన్‌ తర్వాత సీన్‌కి కంటిన్యుటీ వుండదు. ద్వితీయార్ధానికి వచ్చేసరికి ఈ జాఢ్యం మరింత ముదిరిపోయి లాస్ట్‌ సీన్‌ తాలూకు ఎమోషన్‌ని కంటిన్యూ చేయడం కూడా వదిలేసారు. మనోజ్‌పై రేప్‌ కేసి పెట్టి, పోలీస్‌ స్టేషన్‌లో కొట్టించి, తన తండ్రిని ఘోరంగా అవమానిస్తాడు సంపత్‌. దానికి మనోజ్‌ జైల్లోనుంచే సంపత్‌ రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే పని చేస్తాడు. మనోజ్‌ని జైలు నుంచి వదిలేస్తే, అంతవరకు జరిగింది మర్చిపోయి, ఏదో వరల్డ్‌ కప్‌ విన్‌ అయినట్టుగా రోడ్డు మీద గుంపుగా డాన్స్‌ చేసుకుంటూ వస్తారు. తనని అంత దెబ్బ కొట్టిన హీరో సంగతి మర్చిపోయి సంపత్‌ తాపీగా న్యూస్‌ పేపర్‌ చదువుకుంటూ వుంటాడు. ఒక కామెడీ సీన్‌, ఒక మాస్‌ సాంగ్‌ అయిన తర్వాత కానీ మళ్లీ ఇద్దరికీ పగలు, పంతాలు గుర్తురావు. ఒక దశలో సినిమా అయిపోయిందని ఆనందపడేలోగా, ఇక్కడ ఆపేయడం ఇష్టం లేదన్నట్టు మళ్లీ దానిని పొడిగించి ఆ ఆనందాన్ని కూడా మాయం చేస్తారు. 

మనోజ్‌ క్యారెక్టర్‌కి తగినట్టు రఫ్‌ అండ్‌ టఫ్‌గా వున్నాడు. అయితే అతనిలోని నటుడికి పరీక్ష పెట్టే సీన్‌ ఒక్కటీ లేదు. గతంలో వైవిధ్యభరిత కథలని ఎంకరేజ్‌ చేసిన మనోజ్‌ సడన్‌గా ఇలాంటి నాసిరకం కథకి ఎందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడో బోధ పడదు. అందంగా కనిపించడం మినహా ప్రగ్యా జైస్వాల్‌కి పెద్ద పని పెట్టలేదు. అరవడం, ఇరిటేట్‌ అవడం కాకుండా ఇంకో అవసరం సంపత్‌కి కల్పించలేదు. రాజేంద్రప్రసాద్‌, కోటలాంటి సీనియర్లున్నా ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదు. నవతరం కమెడియన్లు ప్రవీణ్‌, సత్యలకి నవ్వించే అవకాశం ఇవ్వలేదు. ఏ పాటా మళ్లీ వినాలనిపించేలా లేదు. అసలే మోతాదుకి మించి ఉన్న ఫైట్లేమో హైస్పీడ్‌ షాట్స్‌ కారణంగా అసలు ముందుకే కదల్లేదు. సినిమా మొదలైన దగ్గర్నుంచి వేధించే ఓ ప్రశ్నకి ముగింపు తర్వాత కానీ, రివ్యూ రాస్తున్నప్పుడు కానీ సమాధానం దొరకలేదు. 'ఇంతకీ మనోజ్‌ ఈ సినిమా ఎందుకు చేసినట్టు, ఏముందని ఓకే చెప్పినట్టు?!'

బాటమ్‌ లైన్‌: బాగా బోర్‌ కొట్టిస్తాడు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?