Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పెళ్ళి చూపులు

సినిమా రివ్యూ: పెళ్ళి చూపులు

రివ్యూ: పెళ్ళి చూపులు
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, రీతు వర్మ, నందు, ప్రియ దర్శి, అనీష్‌ కురువిల్లా, కేదార్‌ శంకర్‌, గురురాజ్‌ తదితరులు
సంగీతం: వివేక్‌ సాగర్‌ (టేప్‌లూప్‌)
కూర్పు: రవితేజ గిరిజాల
ఛాయాగ్రహణం: నగేష్‌ బానెల్‌
సమర్పణ: డి. సురేష్‌బాబు
నిర్మాతలు: రాజ్‌ కందుకూరి, యష్‌ రంగినేని
కథ, కథనం, దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్
విడుదల తేదీ: జులై 29, 2016

పేరుకి ఇంజినీరే అయినా పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు కానీ, కోటి రూపాయల కట్నం వస్తే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకుని నెల నెలా వచ్చే వడ్డీతో హ్యాపీగా గడిపేద్దామనుకునే అబ్బాయి.

పెళ్ళి చేసి బాధ్యత వదిలించుకోవాలని చూస్తోన్న తండ్రి నుంచి త్వరగా తప్పించుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయి సెటిల్‌ అవుదామనే పెద్ద ఆశయాలున్న అమ్మాయి. 

ఈ అబ్బాయి, అమ్మాయికి పెళ్ళి చూపులు ఏర్పాటు చేస్తారు. ఒక చిన్న పొరపాటు వల్ల ఓ గదిలో లాక్‌ అయిపోతారు. అది తెరిచేలోగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్లిద్దరి ప్రేమ సంగతులు, ఆశయాలు, ఇష్టాలు, అయిష్టాలు చెప్పుకుంటారు. ఆ కాసేపటిలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. 

అబ్బాయికి వంట చేయడం ఇష్టం, షెఫ్‌ అవుదామని అనుకుంటాడు. వచ్చిన వంటలతో యూట్యూబ్‌లో వీడియోలు కూడా అప్‌లోడ్‌ చేస్తాడు. అమ్మాయేమో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌ చేద్దామని అనుకుంటుంది. ట్రక్‌ కూడా కొంటుంది. కానీ అంతలో బాయ్‌ఫ్రెండ్‌ మిస్సింగ్‌. మంచి వంటవాడు కూడా దొరకడు. అలా ఆమె బిజినెస్‌ ట్రక్‌ ముందుకి కదలదు. 

ఇద్దరి కథలూ ముగిసే సరికి ఒక చిన్న ట్విస్ట్‌. చెరో దారీ పడతారు. కానీ ఆ పెళ్ళి చూపులు వారి జీవితాలని మార్చేస్తాయి. ఎలా? 

కొత్త దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఎంచుకున్న కథాంశం మనకి తెలియనిదేమీ కాదు. భిన్న ధ్రువాల్లాంటి అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడం, తర్వాత ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టడం రెగ్యులర్‌ ప్లాటే. కానీ దానిని తీసుకెళ్లి ఒక సరికొత్త సెటప్‌లో పెట్టి, ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేకుండా చాలా నేచురల్‌గా తన కథని చెప్పుకొచ్చాడు. 

నేటి తరం యువత ఆలోచనలు, తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఉండే అభిప్రాయాలు అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. కానీ అవి ఎక్కడా భారంగా అనిపించవు. తండ్రీ కొడుకు మాట్లాడుకునే సన్నివేశం చూస్తుంటే... మన పక్కింట్లో జరుగుతోన్న సంభాషణలానో, మనింట్లోనే ఎప్పుడో జరిగిన సంఘటనలానో అనిపిస్తుంది. 

తరుణ్‌లోని మరో ప్రత్యేకత ఏమిటంటే, తన మామూలు కథని తెలివిగా చెప్పుకొస్తూనే, కడుపుబ్బ నవ్వించే హాస్యాన్ని రంగరించి బాగా అలరించాడు. హాస్యం కోసం సన్నివేశాలు సృష్టించకుండా, తన కథలో హాస్యాన్ని భాగం చేసిన తీరు అభినందనీయం. కథానాయకుడి పక్కన ఉండే ఇద్దరు స్నేహితుల్లో ఒకడైన ప్రియా దరిశి స్ట్రెయిట్‌ ఫేస్‌ పెట్టి వేసే పంచ్‌లు థియేటర్లో బాంబుల్లా పేలాయి. కామెడీ పండించడానికి హావభావాలే అక్కర్లేదు. చక్కని టైమింగ్‌ ఉంటే కామెడీ బ్రహ్మాండంగా పండుతుంది. తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ అతను పంచిన వినోదం ఈ చిత్రాన్ని ఒక మెట్టు పైకి ఎక్కించింది. ఆ పాత్ర తెర మీదకి వచ్చిన ప్రతిసారీ నవ్వించేలా దర్శకుడు చక్కని సంభాషణలు రాసుకున్నాడు. 

ఉదాహరణకి... ఖాళీగా తిరిగే అతడిని 'నువ్వేం చేస్తుంటావు?' ఒక పెద్దాయన అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక అవాయిడ్‌ చేయాలని చూస్తాడు. కానీ కుదరకపోవడంతో 'బుక్కు రాస్తున్నా' అంటాడు. 'బుక్కు పేరేంటి?' అని అడిగితే 'నా సావు నేను సస్తా... నీకెందుకు?' అని చెప్తాడు. 

అసలు కథకి అడ్డం పడకుండా ఇలాంటి చెణుకులు ఆద్యంతం చక్కిలిగింతలు పెడుతూనే ఉంటాయి. విజయ్‌ మాజీ లవర్‌ ఫోన్‌ నంబర్‌ సీన్‌, కాల్‌ సెంటర్‌ సీన్‌, యూట్యూబ్‌లో పెట్టడానికి ప్రాంక్‌ వీడియోస్‌ చేసే ప్రయత్నం బెడిసికొట్టే సీన్‌... ఇలా చాలా సన్నివేశాలు హాయిగా నవ్విస్తాయి. ప్రథమార్ధం చాలా కొత్తగా, ట్రెండీగా, రిఫ్రెషింగ్‌గా సాగిపోతుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో సెకండ్‌ హాఫ్‌ ఇలా ఉంటుందనే ఓ ఐడియా వస్తుంది. కానీ కొత్త దర్శకుడి కొత్త ఆలోచనలతో అదెంత కొత్తగా చెప్తాడో అని ఎదురు చూస్తే, సెకండ్‌ హాఫ్‌ని ఊహించినట్టుగానే నడిపించి ఒకింత డిజప్పాయింట్‌ చేస్తాడు. 

సెకండ్‌ హాఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్‌ మిస్‌ అవడంతో పాటు ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్న ఫ్రెష్‌నెస్‌ కూడా లోపించింది. కాకపోతే ఆ బలహీనతలు హైలైట్‌ అవకుండా వీలు కుదిరినప్పుడల్లా చక్కని హాస్యంతో ఎంటర్‌టైన్‌ చేసారు. కూతురి గొప్పతనం తెలుసుకోని తండ్రితో 'మీ కూతురు విలువేంటో మీకు తెలీడం లేదు. నాలాంటి కొడుకు ఉండుంటే అప్పుడు తెలిసేది' అంటూ విజయ్‌ తనలోని కనిపించని కోణాన్ని ఆవిష్కరించే సన్నివేశం, కొడుకు వంటవాడు అవుతానని అంటుంటే ఎంకరేజ్‌ చేయని తండ్రికి అతని గొప్పతనాన్ని రీతు తెలియజెప్పే సన్నివేశం దర్శకుడి మెచ్యూరిటీ లెవల్స్‌కి అద్దం పడతాయి. 

సెకండ్‌ హాఫ్‌ని ఫ్లాట్‌గా నడిపించేయకుండా, ఇంకాస్త బలమైన సంఘర్షణని జోడించినట్టయితే, ఎమోషనల్‌గా కనక్ట్‌ అయ్యే ఎలిమెంట్స్‌ కూడా ఉన్నట్టయితే 'పెళ్ళి చూపులు' కేవలం ఒక వినోదాత్మక ప్రేమకథగా కాకుండా మరపురాని ఆణిముత్యంగా మిగిలిపోయేది. ఎఫ్‌ఎం ఇంటర్వ్యూ ద్వారా మనసులోని భావాల్ని బయటపెట్టే సన్నివేశంలో సంభాషణలు ఇంకాస్త టచింగ్‌గా ఉండాల్సింది. ఏదేమైనా తనకి ఉన్న వనరుల నుంచే చక్కని అవుట్‌పుట్‌ తీసుకుని మంచి ప్రోడక్ట్‌ అందించిన తరుణ్‌కి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. 

విజయ్‌ దేవరకొండ 'ఎవడే సుబ్రమణ్యం'తోనే తన ప్రతిభ చాటుకున్నాడు. చూడగానే రిలేట్‌ చేసుకునేలా ఉన్న ఫీచర్స్‌, సహజత్వంతో కూడిన పర్‌ఫార్మెన్స్‌తో విజయ్‌ ఈ జోనర్‌ సినిమాలకి మోస్ట్‌ వాంటెడ్‌ అయిపోతాడు. రీతు వర్మ అభినయం ఈ చిత్రానికి మరో ఎట్రాక్షన్‌. కష్టపడకుండా, సునాయాసంగా హావభావాలు పలికించి తన పాత్రని రక్తి కట్టించింది. పెద్దల పాత్రలకి ఎంచుకున్న వారంతా కూడా మంచి పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనీష్‌ కురువిల్లా గుర్తుండిపోతాడు. సాంకేతిక వర్గం కూడా సూపర్బ్‌ అవుట్‌పుట్‌ ఇచ్చి కొత్త దర్శకుడి పని సులువు చేసింది. సంగీతం వీనుల విందుగా ఉంటే, ఛాయాగ్రహణం కంటికింపుగా అనిపిస్తుంది. కొత్తవారిని, వారి ఆలోచనల్ని ప్రోత్సహించడంలోనే నిర్మాతల అభిరుచి తెలుస్తుంది.

తరుణ్‌పై తెలిసో, తెలియకుండానో శేఖర్‌ కమ్ముల ప్రభావం బాగానే ఉన్నట్టుంది. నేపథ్య సంగీతం, సన్నివేశాలు, సహజమైన పాత్రలు, సింపుల్‌ సంభాషణలు అన్నీ 'ఆనంద్‌', 'గోదావరి' చిత్రాలని గుర్తుకి తెస్తాయి. మొదటి సినిమాతోనే ముద్ర వేసిన తరుణ్‌ భాస్కర్‌ తదుపరి చిత్రాలపై అంచనాలుంటాయి. మరి వాటిని అందుకోవాల్సిన ఒత్తిడిని జయించి ఎలాంటి సినిమాలతో మన ముందుకొస్తాడనేది చూడాలి. 

బోటమ్‌ లైన్‌: అలరించే 'పెళ్ళి చూపులు'

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?