Advertisement

Advertisement


Home > Movies - Reviews

రాముడే రావణుడైతే! అనే జై లవకుశ

రాముడే రావణుడైతే! అనే జై లవకుశ

(నా రేటింగ్‌ 2.75.. వీలైతే ఒక సారి చూసిన పర్వాలేదు.. చూడాల్సింది ఎన్టీఆర్‌ కోసమే)

(నా రేటింగ్‌ 2.75.. వీలైతే ఒక సారి చూసిన పర్వాలేదు.. చూడాల్సింది ఎన్టీఆర్‌ కోసమే)

ఒక తల్లికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు చూడటానికి ఒకేలా ఉన్నా– ఒకడికి నత్తి. దీనితో అమ్మ తప్ప మిగిలిన ప్రపంచమంతా (సొంత అన్నదమ్ములతో సహా) ఆ కుర్రాడిని చిన్న చూపు చూస్తుంది. అవమానిస్తుంది. దీనితో రాముడిగా మారాల్సిన ఆ కుర్రాడు రావణుడవుతాడు. లక్షణుడు లవుడవుతాడు. భరతుడు కుశుడవుతాడు.

‘విధి ఆడే ఈ వింత నాటకంలో– ఈ ముగ్గురూ ఎలా విడిపోయారు? ఎలా కలిసారు?’ అనేదే జై లవకుశ కథ. దీనిలో లవుడు– నిజంగా అందరినీ ప్రేమించే మంచి బాలుడు. ‘స్కూల్లో చెబితే పాఠం అవుతుంది.. జీవితం నేర్పితే గుణపాఠం’ అవుతుందనే తత్వాన్ని ఆలస్యంగానైనా గ్రహించినవాడు.

ఇక కుశుడు నిజమైన లవర్‌బాయ్‌. నాకు కొట్టేయటంతో పాటు.. కొట్టడం కూడా వచ్చనే చిన్న దొంగ. ఇక జై నిజమైన రావణాసుడు. ‘మనం లేదు.. నేను మాత్రమే ఉందని’ ప్రపంచంపై గర్జించే పక్కా విలన్‌. ఈ కథను టింకరింగ్‌ చేయటానికి మధ్యలో కొందరు విలన్స్‌ ఎలాగా ఉన్నారు. వారున్నారు కాబట్టి ఫైట్స్‌ ఉంటాయి. దీనితో పాటు స్వింగ్‌ స్వింగ్‌ అంటూ ఒక ఐటం సాంగ్‌తో రెచ్చగొట్టడానికి తమన్నా కూడా ఉంది.

చిన్నప్పుడు విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు– పెద్ద అయిన ఏఏ పరిస్థితుల్లో కలిసారు.. అప్పుడు ఏం జరిగింది అనేదీ సినిమా కథ. ‘పద్ధతిగా పెరిగితే నీలా ఉంటాడు.. గాలిలో పెరిగితే నాలా ఉంటాడు.. కసిగా పెరిగితే వీడిలా ఉంటాడు’ అనే డైలాగ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ క్యారెక్టర్లను డైరక్టర్‌ బాబీ మలచటానికి ప్రయత్నించాడు. చాలా వరకూ విజయవంతమయ్యాడు.

బాబీ గురించి చెప్పుకొనే ముందు ప్రముఖంగా చెప్పుకోవాల్సింది –  జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన గురించి. మూడు భిన్నమైన వ్యక్తిత్వాలున్న పాత్రలు వేసి– వాటిని పండించటం ఏ నటుడికైనా కత్తి మీద సామే. ఎన్టీఆర్‌, ఎన్నాఆర్‌, కమల్‌ హాసన్‌లు కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత చేసిన ప్రయోగాన్ని జూనియర్‌ చిన్న వయస్సులోనే చేశాడు. అయినా మనకు చూడటానికి ఇబ్బంది అనిపించదు.

ఈ మూడు పాత్రల్లోను– కథలో రావణాసురుడికి ప్రతిరూపమైన జై పాత్రలో అతని అభినయం ప్రశంసనీయమనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి అనాదరణకు గురైన పిల్లవాడి మానసిక పరిస్థితి పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపించే విధంగా అతని నటన ఆకట్టుకుంటుంది. మిగిలిన రెండు పాత్రలు  సాధారణమే అనిపిస్తాయి. జై పాత్ర– రాయిజ్‌లో షారూక్‌ పాత్ర మాదిరిగా కనిపిస్తుంది. (చిన్నతనంలో పగ విషయం పక్కన పెడితే.. ఒక ఐడెంటిటీ కోసం పడే తపన.. వేషధారణ.. శత్రువులపై పగ తీర్చుకొనే విధానం మొదలైనవి అలా అనిపిస్తాయి). రెండున్నర గంటల పాటు ప్రతి ఫ్రేమ్‌లోను ఎన్టీఆర్‌ కనిపిస్తూనే ఉంటాడు.

ఇక హీరోయిన్లు రాశీఖన్నా, నివేద థామస్‌లకు ప్రాముఖ్యమున్న పాత్రలు లేవు. అయినా ఇద్దరు తమకున్న పరిమిత పాత్రలలో చమక్కుమనిపిస్తారు. రాశీతో పోలిస్తే నివేద పుష్టిగా కనిపిస్తుంది. నినుకోరి సినిమాతో పోలిస్తే ఆమెలో వచ్చిన ఈ మార్పు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. హీరో, హీరోయిన్లు అయిపోయారు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది డైరక్టర్‌ బాబీ గురించి.

పవర్‌, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ వంటి చిత్రాలు తీసిన బాబీ– వాటి నుంచి అనేక (గుణ) పాఠాలు నేర్చుకున్నాడనిపిస్తుంది. కాన్వాస్‌ పెద్దదయినప్పుడు.. దానిలో అనేక పాత్రలు.. అనేక సన్నివేశాలు ఉన్నప్పుడు– వాటి గుదిగుచ్చటం అంత సులభమైన పని కాదు. గబ్బర్‌సింగ్‌, పవర్‌లలో బాబీ విఫలమయింది అక్కడే. జై లవ కుశలో మాత్రం కథాగమనంలో ఎక్కడా బ్రేక్‌లు ఉండవు. ట్విస్ట్‌లు కూడా స్పీడ్‌బ్రేకర్స్‌లా అనిపించవు. డైలాగ్స్‌ విషయంలో కూడా బాబీ మంచి వర్క్‌ చేశాడనే చెప్పవచ్చు.

ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి కొత్తగా చెప్పాల్సినదేమి లేదు. తన ట్రెండ్‌ను కొనసాగించాడు. ఇదే ఇంకొంత కాలం కొనసాగితే– ప్రేక్షకులకు బోరు కొడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మోనాటనీ నుంచి తను బయట పడాల్సిన అవసరముంది. ఈ సినిమాలో ఒక సర్‌ప్రైజ్‌ ప్యాకేజీ తమన్నా ఐటం సాంగ్‌. దీన్ని హీరోయిన్లగా ఒక వెలుగు వెలిగిన వారు అస్తిత్వం కోసం ఐటం సాంగ్స్‌ చేయాల్సిన అవసరముందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ సినిమాను చూసిన తర్వాత– హిందీ సినిమాల మాదిరిగా మన తెలుగువారు క్యారెక్టరైజేషన్స్‌ విషయంలో ఎందుకు శ్రద్ధ వహించరనే ఆలోచన తప్పనిసరిగా కలుగుతుంది. ఒక మంచి టేకాఫ్‌తో ప్రారంభమయిన సినిమా మధ్యకు వచ్చేసరికి ఒక పాట, ఒక ఫైట్‌ ఫార్మాట్‌కు ఎందుకు వచ్చేస్తుందో తెలియదు. అదే విధంగా చిన్న, పెద్ద విలన్స్‌ అందరినీ ఇనప రాడ్లతోను, గొడళ్లతో చితకబాది.. కత్తులతో పోడిచేస్తేనే హీరోయిజం అవుతుందనే భావన.. క్లైమాక్స్‌లో కనీసం వంద మంది రౌడీలనైనా హీరో ఎదిరించాలనే ఆలోచన– మన డైరక్టర్ల బుర్రల నుంచి ఎందుకు పోవటం లేదో అర్థం కాదు.

చివరగా– ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిన టెక్నిషియన్స్‌– సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు, గీత రచయితలు– చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రిలు. ముఖ్యంగా చంద్రబోస్‌ రాసిన గీతాల్లో ఎక్స్‌ప్రెషన్స్‌ తాజాగా అనిపిస్తాయి. వీలైతే కుటుంబంతో చూడాల్సిన సినిమా ఇది. 

భావన
[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?