Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అభినేత్రి

సినిమా రివ్యూ: అభినేత్రి

రివ్యూ: అభినేత్రి
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: ఎంవివి ఫిలింస్‌, కోన ఫిలిం కార్పొరేషన్‌
తారాగణం: తమన్నా, ప్రభుదేవా, సోను సూద్‌, మురళి శర్మ, సప్తగిరి, పృధ్వీ, హేమ, ఎమీ జాక్సన్‌ తదితరులు
కథ: ఎ.ఎల్‌. విజయ్‌, పాల్‌ ఆరోన్‌
మాటలు: కోన వెంకట్‌
సంగీతం: సాజిద్‌ వాజిద్‌
కూర్పు: ఆంటోనీ
ఛాయాగ్రహణం: మనూష్‌ నందన్‌
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ
కథనం, దర్శకత్వం: ఎ.ఎల్‌. విజయ్‌
విడుదల తేదీ: అక్టోబరు 7, 2016

తమన్నా, ప్రభుదేవా, సోను సూద్‌... ఈ ముగ్గురికీ తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలో బాగా గుర్తింపు ఉండడంతో 'అభినేత్రి' చిత్రాన్ని మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు. ఇప్పుడు ఏ భాషలో అయినా చెల్లిపోతోన్న జోనర్‌ కనుక యూనివర్సల్‌ అప్పీల్‌ ఉంటుందని 'హారర్‌/కామెడీ'ని ఎంచుకున్నట్టున్నారు. అయితే ఈ జోనర్‌లో వస్తోన్న మిగతా సినిమాల శైలిలో కాకుండా విజయ్‌ కాస్త కొత్తగా ఆలోచించి, తన హారర్‌ కామెడీతో కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు చూసాడు. 

ఒకే మూసలో సాగిపోయే హారర్‌ కామెడీల మధ్య 'అభినేత్రి' ఖచ్చితంగా ఉనికి నిలుపుకుంటుంది. అయితే దీనిని హారర్‌ కామెడీగా పరిగణించడం కంటే ఒక ఫ్యామిలీ డ్రామాకి హారర్‌ ఎలిమెంట్‌ జోడించారనడం సబబేమో. మోడరన్‌గా ఉంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కలలు కన్న కృష్ణ (ప్రభుదేవా) అయిష్టంగానే దేవి (తమన్నా) అనే పల్లెటూరి అమ్మాయిని చేసుకుంటాడు. ఆమెతో అడ్జస్ట్‌ కాలేకపోతున్న టైమ్‌లో వాళ్లు కొత్తగా ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్తారు. అప్పట్నుంచి దేవి అదోలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రూబీ ఆత్మ దేవిని ఆవహించిందని కృష్ణకి అర్థమవుతుంది. రూబీనుంచి భార్యని కాపాడుకునే దశలో తెలీకుండానే దేవికి కృష్ణ దగ్గరవుతాడు. అలా భార్యాభర్తల మధ్య సఖ్యతకి ఓ దెయ్యం దోహదపడుతుందన్నమాట.

దేవిని రూబీ ఆవహించిందని కృష్ణ తెలుసుకోవడం ఇంటర్వెల్‌ పాయింట్‌. అటుపై హారర్‌ సీన్స్‌ బాగా ఉంటాయనే అంచనాలు ఏర్పడతాయి. కానీ దెయ్యం, కృష్ణ మధ్య ఒప్పందం జరగడం, ఒక్కసారైనా వెండితెరపై తనని తాను చూసుకోవాలనే కోరిక తీరితే దేవిని వదిలేస్తాననడంతో కథలో ఇక రసవత్తరమైన పాయింటేమీ లేకుండా పోతుంది. దేవితో సినిమా హీరో రాజ్‌ (సోను సూద్‌) ప్రేమలో పడడం వల్ల కూడా ఆసక్తి పుట్టదు. సెకండ్‌ హాఫ్‌ టోటల్‌గా ఫ్లాట్‌గా తయారవుతుంది. అంతకుముందు దెయ్యం పేరు చెబితే వణికిపోయే కృష్ణ ఆ తర్వాత దానినే బ్లాక్‌మెయిల్‌ చేసే లెవల్‌కి వెళ్లిపోతాడు. దాంతో ఇక కామెడీకి కూడా ఆస్కారం తగ్గిపోతుంది. సెకండాఫ్‌ ఎంత ఫ్లాట్‌గా ఉంటుందంటే కనీసం కథకి పతాక సన్నివేశం కూడా లేకుండా పోయింది. అలా ముగించేసిన తర్వాత 'ఏంటి ఇంతేనా, ఏదో ఎక్స్‌పెక్ట్‌ చేసి ఇంతదూరం వచ్చాం, కాస్తయినా ఎక్సయిటింగ్‌గా ఏదోటి చెయ్యండి ప్లీజ్‌' అని అడగాలనిపిస్తుంది. 

మంచి కథ అయితే ఉంది కానీ దానికి ఆసక్తికరమైన కథనం లేకపోవడంతో 'అభినేత్రి' ఒక సో సో సినిమాగా మిగిలిపోయింది. విజువల్‌గా సినిమా చాలా బాగా తెరకెక్కింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ టాప్‌ క్లాస్‌ అనిపిస్తుంది. స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగా కుదిరాయి. విజయ్‌ షాట్‌ మేకింగ్‌, ఈ జోనర్‌పై అతని టేక్‌ ఆకట్టుకుంటుంది. కానీ కథనం బలంగా లేకపోవడం, సెకండాఫ్‌ పూర్తిగా ఫ్లాట్‌ అయిపోవడంతో అభినేత్రి థియేటర్‌నుంచి అసంతృప్తిగానే బయటకి రావాల్సొస్తుంది.

చాలా కాలం తర్వాత తెర మీదకొచ్చిన ప్రభుదేవా తన మార్కు కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని డాన్సుల్లో వేగం ఏమాత్రం తగ్గలేదు. సోనూ సూద్‌ పాత్రకి అనుగుణంగా నటించాడు. అతని క్యారెక్టర్‌కి కూడా చిన్న కామెడీ యాంగిల్‌ ఇచ్చారు. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా పూర్తిగా తమన్నాదే. రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో ఆమె అభినయం బాగుంది. సినిమా హీరోయిన్‌గా గ్లామరస్‌గా, దేవిగా డీ గ్లామరైజ్డ్‌గా ఆమె రెండు రకాలుగాను మెప్పించింది. సప్తగిరి, మురళి శర్మ కామెడీకి ఉపయోగపడ్డారు. 

హారర్‌ సినిమాల్లో కొత్త కోణం చూపించినప్పటికీ, జోనర్‌కి అవసరమైన థ్రిల్స్‌ ఇవ్వడంలో, లేదా నవ్వించడంలో అభినేత్రి అత్తెసరు మార్కులే స్కోర్‌ చేస్తుంది. ఫైనల్‌గా ఏదీ పూర్తి డోస్‌లో ఇవ్వలేక ఒక సగటు సినిమాగా మిగిలిపోయి, అసంతృప్తి కలిగిస్తుంది. 

బాటమ్‌ లైన్‌: అంతంత మాత్రమే!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?