Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అలా ఎలా?

సినిమా రివ్యూ: అలా ఎలా?

రివ్యూ: అలా ఎలా?
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అశోకా క్రియేషన్స్‌
తారాగణం: రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిషోర్‌, హీబా పటేల్‌, షాని, ఖుషీ, భానుశ్రీ మెహ్రా, రవి వర్మ తదితరులు
సంగీతం: భీమ్స్‌
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌
నిర్మాత: అశోక్‌ వర్ధన్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: అనీష్‌ కృష్ణ
విడుదల తేదీ: నవంబర్‌ 28, 2014

ఆకర్షణీయమైన ప్రోమోస్‌తో విడుదలకి ముందు సోషల్‌ మీడియాలో కాస్త సందడి చేసిన ‘అలా ఎలా?’కి వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌ కూడా బాగుంది. యూత్‌కి ఇట్టే కనెక్ట్‌ అయ్యే ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో కామెడీ హైలైట్‌గా నిలిచింది. 

కథేంటి?

రెండు కోట్లు కట్నం వస్తుందని తనకి అస్సలు తెలియని దివ్య (ఖుషి) అనే పల్లెటూరి అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడిపోతాడు కార్తీక్‌ (రాహుల్‌). అయితే పెళ్లికి ముందు ఆమె ఎవరనేది అస్సలు తెలీకపోవడం కంటే తనని పరిచయం చేసుకుని, ప్రేమించి... పెళ్లిలో సర్‌ప్రైజ్‌ ఇస్తే బాగుంటుందని తన స్నేహితులు (వెన్నెల కిషోర్‌, షాని) ఇద్దరితో కలిసి ఆమె ఊరికి వెళతాడు. అక్కడ దివ్య స్నేహితురాలు శృతి (హీబా పటేల్‌) సాయం తీసుకుని దివ్యకి దగ్గర కావాలనుకుంటాడు.  

కళాకారుల పనితీరు:

‘అందాల రాక్షసి’ ఫేమ్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ఇందులో సగటు యంగ్‌స్టర్‌ క్యారెక్టర్‌ చేసాడు. చూడ్డానికి క్లాస్‌గా ఉన్నా క్యారెక్టర్‌కి తగినట్టు మౌల్డ్‌ అయ్యాడు. కామెడీ సీన్స్‌లో మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు. సిద్ధార్థ్‌, ఉదయ్‌కిరణ్‌.. స్లాట్‌ని ఫిల్‌ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయితనిలో. 

హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేసిన వెన్నెల కిషోర్‌ తనని ఫ్రెండ్‌ అంటూ పరిచయం చేస్తే ఒప్పుకోడు. తను కూడా హీరోనే అంటాడు. నిజంగానే ఈ సినిమాకి వెన్నెల కిషోర్‌ హీరో అయ్యాడు. తన కామెడీతో సినిమాని చాలా సందర్భాల్లో లిఫ్ట్‌ చేసాడు. షాని అతనికి మంచి సపోర్ట్‌ ఇచ్చాడు. 

హీరోయిన్స్‌ ఇద్దరూ చాలా మామూలుగా ఉన్నారు. ఇద్దరూ హీరోయిన్‌ మెటీరియల్‌ కాదు. హీబా పటేల్‌ది ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్‌ కానీ చూడ్డానికి చాలా చాలా మామూలుగా ఉంది. క్యారెక్టర్‌కి అవసరమని కావాలని ఆమెని ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. మిస్‌లీడ్‌ చేయడమే ఉద్దేశమైతే చిన్మయిలాంటి పాపులర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్‌ చెప్పించకుండా ఉండాల్సింది. ఖుషి జస్ట్‌ ఓకే. భానుశ్రీమెహ్రా కంప్లీట్‌గా సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌కి షిఫ్ట్‌ అయిపోయింది. 

సాంకేతిక వర్గం పనితీరు:    

భీమ్స్‌ మ్యూజిక్‌ బాగానే ఉంది. ఒకటి, రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. కానీ ఈ చిత్రంలో పాటల అవసరం అంత లేదనిపించింది. కనీసం మూడు పాటలైనా స్పీడ్‌ బ్రేకర్స్‌లా వచ్చి పడతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సందర్భాల్లో కెమెరా యాంగిల్స్‌ ఆకట్టుకుంటాయి. చిన్న సినిమా అయినా కానీ విజువల్‌గా సినిమా రిచ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. 

Video: Ala Ela Songs & Trailers

దర్శకుడు అనీష్‌ కృష్ణ రాసిన సంభాషణలు నవ్విస్తాయి. స్నేహితుల మధ్య సన్నివేశాల్లో సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. యంగ్‌ ఆడియన్స్‌కి కావాల్సిన ఫన్‌ బాగా అందించాడు కానీ అసలైన ప్రేమకథని మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. 

హైలైట్స్‌:

  • కామెడీ
  • క్లయిమాక్స్‌

డ్రాబ్యాక్స్‌:

  • సెకండాఫ్‌ సైడ్‌ ట్రాక్‌ పట్టింది
  • హీరోయిన్స్‌

విశ్లేషణ:

సరదాగా నవ్వుకోడానికి ఈ చిత్రంలో చాలా సన్నివేశాలున్నాయి. స్క్రీన్‌ప్లేలో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ అయితే చాలానే ఉన్నాయి కానీ కామెడీతో పాస్‌ అయిపోతుంది. సినిమా బోర్‌ కొడుతుందన్న ప్రతిసారీ ఒక మంచి డైలాగ్‌ కానీ, కామెడీ కాన్వర్‌జేషన్‌ కానీ, ఫన్నీ సీన్‌ కానీ వచ్చి స్పిరిట్‌ లిఫ్ట్‌ చేస్తుంది. ‘పెళ్లయిన మగాళ్లని... తల్లయిన ఆడాళ్లని ఈజీగా గుర్తుపట్టొచ్చు’లాంటి నవ్వొచ్చే డైలాగ్స్‌ చాలా ఉన్నాయి. 

ఒక కీలక సందర్భంలో హీరోతో మాట్లాడ్డానికి కాల్‌ చేస్తాడు అతని ఫ్రెండ్‌. ఫోన్‌ రాగానే ‘రేయ్‌.. నేనే నీకు ఫోన్‌ చేద్దామనుకున్నారా’ అంటాడు హీరో. వెంటనే.. ‘అయితే నువ్వే చెయ్‌’ అని కాల్‌ కట్‌ చేసేస్తాడు ఫ్రెండ్‌. ఇలాంటి ఫన్నీ సీన్స్‌ సినిమా అంతటా ఉన్నాయి. అసలు కథ చాలా సాధారణంగా, డల్‌గా ఉన్నా కానీ ఇటువంటి స్పాంటేనియస్‌ కామెడీతో ‘అలా ఎలా’ పైసా వసూల్‌ అనిపిస్తుంది. 

ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్‌ చేయడానికి పర్‌ఫెక్ట్‌ ఫిల్మ్‌ ఇది. ఫస్టాఫ్‌ చాలా వేగంగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో మాత్రం వినోదం తగ్గి... కథ మీద ఫోకస్‌ పెరిగింది. ఆ కీలక సన్నివేశాలని సరిగ్గా తీసి ఉంటే ఈ చిత్రం రేంజ్‌ బాగా పెరిగేది. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు వచ్చిన ప్రతిసారీ మూవీ డల్‌ అయిపోతుంది. స్నేహితులు ముగ్గురూ తెరపై కనిపించిన ప్రతిసారీ సూపర్‌ ఫన్‌ వర్కవుట్‌ అయింది. 

అవసరం లేని పాటలు తగ్గించి, రెండు గంటల్లోనే ముగించేసి ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అలాగే లవ్‌ స్టోరీపై కూడా ఫోకస్‌ పెట్టి దానిని కూడా అలరించేలా తీర్చిదిద్ది ఉండాల్సింది. సెకండాఫ్‌లో గ్రాఫ్‌ బాగా పడిపోయినా కానీ క్లయిమాక్స్‌లో మళ్లీ ఊపందుకుని పాజిటివ్‌ నోట్‌లో ఎండ్‌ అవుతుంది. కాలక్షేపానికి లోటు లేని సినిమా ఇది. క్రౌడ్‌ పుల్లింగ్‌ స్టార్‌ కాస్ట్‌ లేకపోవడం ఈ చిత్రానికి మేజర్‌ డిజట్వాంటేజ్‌. దానిని అధిగమించి ఎంతవరకు ఫేర్‌ చేస్తుందనేది చూడాలి. 

బోటమ్‌ లైన్‌: అలా అలా... సరదా సరదాగా!

-గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?