Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: చుట్టాలబ్బాయి

సినిమా రివ్యూ: చుట్టాలబ్బాయి

రివ్యూ: చుట్టాలబ్బాయి
రేటింగ్‌: 2/5

బ్యానర్‌: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌
తారాగణం: ఆది, నమితా ప్రమోద్‌, సాయికుమార్‌, అభిమన్యు సింగ్‌, జాన్‌ కొక్కెన్‌, పృధ్వీ, పోసాని, అలీ, రఘుబాబు, షకలక శంకర్‌, అన్నపూర్ణ తదితరులు
మాటలు: భవాని ప్రసాద్‌
సంగీతం: తమన్‌
కూర్పు: ఎస్‌.ఆర్‌. శేఖర్‌
ఛాయాగ్రహణం: ఎస్‌. అరుణ్‌ కుమార్‌
నిర్మాతలు: వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి
కథ, కథనం, దర్శకత్వం: వీరభద్రమ్‌
విడుదల తేదీ: ఆగస్టు 19, 2016

'అహ నా పెళ్లంట', 'పూలరంగడు'లాంటి కామెడీ చిత్రాలతో జర్నీ స్టార్ట్‌ చేసిన వీరభద్రమ్‌ 'భాయ్‌'తో కమర్షియల్‌ డైరెక్టర్‌ అనిపించుకునే ప్రయత్నంలో భంగపడ్డాడు. మళ్లీ సోలో హీరోగా నటించనేకూడదని నాగార్జున నిర్ణయించుకునే స్థాయిలో అపజయం, అపహాస్యం పాలయిన భాయ్‌ తర్వాత గ్యాప్‌ తీసుకున్న వీరభద్రమ్‌ 'చుట్టాలబ్బాయి' విషయంలో హద్దులు దాటకుండా, అతి లేకుండా చూసుకోవడానికి పట్టుబట్టి ప్రయత్నించినట్టు అనిపించింది. అయితే ఈ ప్రయత్నంలో కొత్తదనం పరంగా కూడా హద్దులు పెట్టుకున్నట్టు మూస కథ, కథనాలతో సరిపెట్టేసాడు. సేఫ్‌ బెట్‌ సినిమా తీయాలనే తాపత్రయంలో అసలు ఏమాత్రం రక్తి కట్టించని ఒక సాదా సీదా కమర్షియల్‌ సినిమాని తీర్చిదిద్దాడు. 

స్టార్ట్‌ టు ఎండ్‌ కొత్తగా అనిపించే ఒక్క సీన్‌ ఉండదు. దర్శకుడి ముద్ర తెలిపే ఒక్క షాట్‌ ఉండదు. ప్రతి సీన్‌ కనీసం ఒక పదిసార్లయినా చూసినట్టుంటుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఎక్కడికక్కడ తెలిసిపోతుంటుంది. ప్రతి పావుగంటకీ ఒక కొత్త పాత్రని ప్రవేశ పెట్టడం మినహా వీరభద్రమ్‌ రాసుకున్న కథనంలో విషయం లేకపోయింది. టికెట్‌ కొనేసాం కాబట్టి కూర్చోవడమే తప్ప ఏ క్షణంలో థియేటర్‌ వదిలేసి వచ్చినా మిస్‌ అయ్యేదంటూ ఏమీ ఉండదంటే మీరే అర్థం చేసుకోండి. 

ప్రతి పాత్రకీ విపరీతమైన బిల్డప్‌ ఇచ్చి మరీ ఇంట్రడ్యూస్‌ చేసిన డైరెక్టర్‌ ఆ తర్వాత వాటిని ఎఫెక్టివ్‌గా నడిపించలేకపోయాడు. హీరోయిన్‌ అన్నయ్యగా పోలీస్‌ కమీషనర్‌కి పిచ్చ బిల్డప్‌తో ఎంట్రీ ఇస్తారు. అయితే చెల్లెలు ఎవరితోనో పారిపోతే ఏదో మాఫియా డాన్‌ మాదిరిగా పోలీసులని వెంట పంపిస్తాడే తప్ప తన పవర్‌ చూపించడు. హీరో తండ్రి పాత్రలో సాయికుమార్‌ కూడా పేద్ద ఫైట్‌తో పెదరాయుడు లెవల్లో ఎంట్రీ ఇస్తాడు. కానీ ఆ తర్వాత 'బొమ్మరిల్లు' ఫాదర్‌లా ఇంట్లో మెతగ్గా కనిపిస్తుంటాడు. జాన్‌ కొక్కెన్‌కి కూడా సేమ్‌ లెవల్‌ ఇంట్రడక్షన్‌ ఉంటుంది, వెంటనే తుస్సుమంటుంది. 

ఆది ఎప్పటిలా కాన్ఫిడెంట్‌గా చేసుకుంటూ పోయాడు. కథల ఎంపికలో తనకున్న బలహీనతని మాత్రం మరోసారి చాటుకున్నాడు. నమిత నటన బాగుంది. వీరిద్దరి జోడీ ఆకర్షణీయంగా ఉండడం వల్లే 'చుట్టాలబ్బాయి' అంతో ఇంతో కూర్చోబెట్టగలిగింది. సాయికుమార్‌ గెటప్‌ బాగా కుదిరింది. అభిమన్యుసింగ్‌ బిర్ర బిగుసుకుపోయి స్టోన్‌ ఫేస్‌తో ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌ విసిగిస్తుంది. పృధ్వీ కామెడీ రొటీన్‌గా ఉన్నప్పటికీ అతని టైమింగ్‌ కారణంగా కొన్ని జోకులు పేలాయి. అలీ, రఘుబాబు, పోసాని ఎవరి శైలిలో వారు నవ్వించడానికి కృషి చేసారు. 

తమన్‌ పాటల్లో రెండు, మూడు హుషారుగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ప్లస్‌పాయింట్‌. విజువల్స్‌ కలర్‌ఫుల్‌గా ఉండడం, నిర్మాణ పరంగా రాజీ పడకపోవడం వల్ల విజువల్‌ క్వాలిటీ పరంగా 'చుట్టాలబ్బాయి' మెప్పించినా, కంటెంట్‌ లేకపోవడం వల్ల తేలిపోయింది. సాంకేతిక నిపుణులు, నటీనటవర్గంలో చాలా మంది నుంచి పూర్తి సహకారం అందినా కానీ వారి టాలెంట్‌ని, సిన్సియారిటీని తన రచన, దర్శకత్వంతో వేస్ట్‌ చేసుకున్నాడు వీరభద్రమ్‌. త్రివిక్రమ్‌ శైలిని అనుకరించడానికి సంభాషణల రచయిత విఫలయత్నం చేసాడు. 

ఫస్ట్‌ హాఫ్‌లో 'చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌'ని కాపీ చేసినట్టు అనిపించినా, సెకండ్‌ హాఫ్‌కి వచ్చే సరికి కేవలం శుభం కార్డు వేసే సమయం కోసం వేచి చూస్తూ కాలక్షేపం చేసారన్న భావన కలుగుతుంది. కనీసం టైటిల్‌కి కూడా కథతో సంబంధం లేకుండా పోయింది. తీసిన వాళ్ల కొన్ని నెలల కష్టం, చూసిన వాళ్ల రెండున్నర గంటల సమయం వృధా చేయడం మినహా ఈ 'చుట్టాలబ్బాయి' చేసిందంటూ ఏం లేదు. 

బోటమ్‌ లైన్‌: చూడ్డానికేం లేదబ్బాయి!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?