Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఇంకొక్కడు

రివ్యూ: ఇంకొక్కడు
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: తమీన్స్‌ ఫిలింస్‌
తారాగణం: విక్రమ్‌, నయనతార, నిత్య మీనన్‌, నాజర్‌, తంబి రామయ్య, కరుణాకరన్‌, రిత్విక తదితరులు
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
కూర్పు: భువన్‌ శ్రీనివాసన్‌
ఛాయాగ్రహణం: ఆర్‌.డి. రాజశేఖర్‌
నిర్మాత: శిబు తమీన్స్‌
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌
విడుదల తేదీ: సెప్టెంబరు 8, 2016

ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేయడాన్ని ఇష్టపడే విక్రమ్‌కి కొత్త కొత్త గెటప్స్‌ వేయడమన్నా, పాత్ర కోసం తనని తాను 'మలచుకోవడమన్నా' సరదా. అతనికున్న ఈ ఆసక్తి క్రమేపీ బలహీనతగా మారిందనిపిస్తోంది. విక్రమ్‌కున్న ఈ బలహీనత మీద కొడుతూ, తనకి సరికొత్త గెటప్‌ వేసే ఆస్కారముందని ఊరిస్తూ, నాసి రకం కథలు వినిపించి ఓకే చేసేసుకుంటున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతోంది. హీరోలని కొత్త గెటప్స్‌లో చూడడమనేది ప్రేక్షకులకి కూడా ఇష్టమే. పాత్రకి అనుగుణంగా ఆహార్యాన్ని మార్చుకునే విక్రమ్‌లాంటి వాళ్లు సరికొత్తగా కనిపిస్తే అదింకా పెద్ద ఆకర్షణే. అయితే కేవలం గెటప్స్‌ వేయడానికే సినిమాలు చేయడమన్నట్టు కాకుండా, కథకి అవసరం అనిపించినప్పుడే అలా కనిపిస్తే ఉపయోగముంటుంది కానీ, ఊరికే మేకప్పులేసుకుని దిగిపోతే అది వేస్ట్‌ అయిపోవడం మినహా ఏ ప్రయోజనముండదు. 

శివపుత్రుడు, అపరిచితుడు చిత్రాలు అంతగా ఆదరణ పొందాయంటే అందులో విక్రమ్‌ వేసిన గెటప్‌ కారణం కానే కాదు. ఆ కథల్లో బలం ఉండడం వల్ల, ఆ పాత్రల్ని గొప్పగా తీర్చిదిద్దడం వల్ల అవి సక్సెస్‌ అయ్యాయి తప్ప ఇతర హంగుల వల్ల కాదు. దీనిని అతనితో పని చేస్తున్న దర్శకులు విస్మరించడం విచిత్రంగా లేదు కానీ విక్రమ్‌ కూడా దానిని గుర్తించకపోవడమే వింతగా అనిపిస్తోంది. ఇటీవలి విక్రమ్‌ చిత్రాలన్నీ పరాజయం పాలవడానికి బలహీనమైన కథ, కథనాలే కారణం. వరుసగా నిరాశపరుస్తోన్న విక్రమ్‌ చిత్రాల సరసన ఇప్పుడు 'ఇంకొక్కడు' చేరాడు. 

విలన్‌ పాత్రలో విక్రమ్‌, అందునా ఆ పాత్ర 'ట్రాన్స్‌జెండర్‌' అంటే ఖచ్చితంగా ఎక్సయిటింగ్‌ ఫ్యాక్టరే. ఇలాంటి పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, మరొకరి వల్ల సాధ్యం కాదనిపించేలా బాడీ లాంగ్వేజ్‌తోనే మెస్మరైజ్‌ చేయడం విక్రమ్‌ స్పెషాలిటీ. ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి ఈ 'ఫ్యాక్టర్‌' బాగా పని చేస్తుందనేది తీసిన వాళ్లకీ తెలుసు. అందుకే ఈ సినిమా పబ్లిసిటీలో 'లవ్‌' క్యారెక్టర్‌కి అంతటి ఇంపార్టెన్స్‌ ఇచ్చారు. విక్రమ్‌ ఎప్పటిలానే ఆ క్యారెక్టర్‌ని ఓన్‌ చేసుకుని, తనకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో రక్తి కట్టించాడు. తను చేసిన 'రా ఏజెంట్‌', 'ట్రాన్స్‌జెండర్‌ సైంటిస్ట్‌' పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించడంలో విక్రమ్‌ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. అయితే ఈ పాత్రల్ని ఎక్సయిటింగ్‌గా మలచడంలో దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 

Watch Inkokkakdu Movie Public Talk

ఈ రెండు పాత్రలు ఎదురు పడిన తర్వాత ప్లే ఎంత బాగుంటుందో అనే ఆసక్తి ఇంటర్వెల్‌ సీన్‌లో కలుగుతుంది. కానీ ద్వితీయార్థం పూర్తిగా ఫ్లాట్‌గా మారిపోయి, ఎలాంటి ఆసక్తి రేకెత్తించకుండా చప్పగా సాగిపోతుంది. హీరో, విలన్‌ మధ్య సీన్స్‌ కూడా తేలిపోయాయి. సైంటిఫిక్‌ పద్ధతుల్లో తన పని తాను చేసుకుంటూ పోయే విలన్‌పై తీసిన ఎక్స్‌క్లూజివ్‌ సీన్స్‌ ఏవీ ఎగ్జయిట్‌ చేయలేదు. 'స్పీడ్‌' ఇన్‌హేలర్‌కి సంబంధించిన సీన్స్‌ మొదట్లో బాగున్నా ఆ తర్వాత అవి కూడా బోర్‌ అనిపిస్తాయి. ముఖ్యంగా దానిని దర్శకుడు తన ఇష్టానికి వాడుకోవడం వల్ల ఆ ఎలిమెంట్‌ సైతం వేస్ట్‌ అయిపోయింది. పరుగులు పెట్టించే కథనం ఉండాల్సిన ఇలాంటి సెటప్‌లో ఆ 'స్పీడ్‌' ఎక్కడా కనిపించకుండా పోయింది. పేజీల కొద్దీ డైలాగులతో, సైన్సు పాఠాలతో ఒక లెవల్‌ దాటిన తర్వాత 'ఇంకొక్కడు' బాగా విసిగించింది. తన నటనతో కొన్ని సందర్భాల్లో విక్రమ్‌ దీని పాలిట రక్షకుడు అయ్యాడు కానీ అతని వల్ల కూడా కాని లెవల్‌కి స్క్రీన్‌ప్లే ట్రాక్‌ తప్పేసింది. 

ఇతర తారాగణంలో నయనతార మాత్రమే గుర్తుంటుంది. ప్రాధాన్యత లేని పాత్రలో నిత్యమీనన్‌ టాలెంట్‌ మరొక్కసారి వృధా అయింది. తంబి రామయ్య కామెడీ సినిమాకి హెల్ప్‌ కాకపోగా, విసుగుని రెట్టింపు చేసింది. ఆర్‌.డి. రాజశేఖర్‌ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ఎస్సెట్‌గా నిలిచింది. యాక్షన్‌ సీన్స్‌ క్వాలిటీగా ఉన్నాయి. విజువల్‌గా ఈ చిత్రాన్ని ఉన్నత శ్రేణిలో తీర్చిదిద్దారు. నిర్మాతలు ఖర్చుకి అస్సలు వెనకాడలేదు. హారిస్‌ జైరాజ్‌ నేపథ్య సంగీతం చాలా బాగుంది. హలెనా సాంగ్‌ ట్యూన్‌, చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటాయి. ఒక చక్కని స్పై థ్రిల్లర్‌ కావడానికి తగ్గ సెటప్‌ ఉన్నప్పటికీ బ్యాడ్‌ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ వల్ల 'ఇంకొక్కడు' కేవలం మరో 'విక్రమ్‌ సినిమా'గా మాత్రం మిగిలిపోయింది. 

బోటమ్‌ లైన్‌: విక్రమ్‌ కష్టాన్ని 'ఇంకొక్కడు' వేస్ట్‌ చేసాడు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?