Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కిక్‌ 2

సినిమా రివ్యూ: కిక్‌ 2

రివ్యూ: కిక్‌ 2
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ 
తారాగణం: రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌, బ్రహ్మానందం, సంజయ్‌ మిశ్రా, కబీర్‌ దుహన్‌ సింగ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
కథ, మాటలు: వక్కంతం వంశీ
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌
కథనం, దర్శకత్వం: సురేందర్‌ రెడ్డి
విడుదల తేదీ: ఆగస్టు 21, 2015

రవితేజ, సురేందర్‌ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి చేసిన 'కిక్‌' ఇక్కడ ఘన విజయం సాధించడమే కాదు... తమిళం, కన్నడం, హిందీ భాషల్లోకి రీమేక్‌ కూడా అయింది. కథ చెప్పుకుంటే సగటు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అనిపించినా కానీ అన్నీ సరిగ్గా కుదిరిన ఆ చిత్రం టైటిల్‌కి తగ్గట్టు అనిపించింది. అందుకే అటు రవితేజ, ఇటు సురేందర్‌ కెరీర్‌లలో స్పెషల్‌ మూవీగా నిలిచిపోయింది. దానికి కొనసాగింపుగా మరో చిత్రం చేయాలనుకోవడం మార్కెటింగ్‌ కోణంలో మంచి ఆలోచనే కావచ్చు కానీ మళ్లీ అలాంటి పర్‌ఫెక్ట్‌ మిక్స్‌ ఆఫ్‌ మసాలా కుదరడం మాత్రం అంత ఈజీ కానే కాదు. 

కిక్‌ కోరుకునే కళ్యాణ్‌ (రవితేజ) కొడుకు కంఫర్ట్‌ లేదని తల్లి కడుపులోంచి ఏడు నెలలకే బయటకి తన్నుకొచ్చేసిన టైపు. రాబిన్‌హుడ్‌ (రవితేజ) దేంట్లో అయినా కంఫర్ట్‌ కావాలనుకునే ఒక రకం చిత్రమైన క్యారెక్టర్‌. తన కంఫర్ట్‌ కోసం ఏదైనా చేసేసే రాబిన్‌హుడ్‌ పక్క వాడికి ఏం జరిగినా పట్టించుకోడు. కానీ అతడిలోనే తమని ఆదుకునే దేవుడున్నాడని నమ్ముతారు విలాస్‌పూర్‌ జనం. సాలమన్‌ సింగ్‌ ఠాకూర్‌ (రవికిషన్‌) రూపంలో తమని వేధిస్తున్న రాక్షసుడిని సంహరించే ధీరుడు రాబిన్‌హుడ్‌ మాత్రమేనని భావించి అతడిని ఎలాగైనా అక్కడికి రప్పించాలనుకుంటారు. అందులో వాళ్లు సక్సెస్‌ అవుతారు కూడా. కానీ తన కంఫర్ట్‌కి కష్టం రానంత వరకు ఎవరినీ పట్టించుకోని రాబిన్‌హుడ్‌ ఎప్పుడెళ్లి ఠాకూర్‌తో కయ్యం పెట్టుకుంటాడు? ఊరోళ్ల గొడవని తన నెత్తిన ఎందుకు తెచ్చుకుంటాడు?

'కిక్‌' కోరుకునే హీరో క్యారెక్టర్‌ నుంచి ఎంత ఫన్‌ సృష్టించవచ్చు అనేది చూపించిన సురేందర్‌ ఈసారి 'కంఫర్ట్‌' కోసం తపించే క్యారెక్టర్‌తో ఎంటర్‌టైన్‌ చేయాలని చూసాడు. వేగ్‌ ఐడియాతో ఒక థిన్‌ లైన్‌ స్టోరీ రాసేసుకుని సెట్స్‌ మీదకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుందే తప్ప సాలిడ్‌ బేస్‌ కోసం స్పెషల్‌ ఎఫర్ట్స్‌ పెట్టిన దాఖలాలు కనిపించవు. హీరోకో పెక్యూలియర్‌ క్యారెక్టరైజేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎమోషన్‌ మిక్స్‌ అయిన ట్రీట్‌మెంట్‌ వక్కంతం వంశీ కథల్లో కామన్‌గా వుండే లక్షణాలు. ఆ లక్షణాలు ఇందులో కూడా ఉన్నాయి కానీ పకడ్బందీ కథ అయితే సిద్ధం కాలేదు. తమని ఆదుకునేవాడు ఎక్కడ్నుంచో వస్తాడని ఎదురు చూసే గ్రామవాసులు, అక్కడికొచ్చి వారి కష్టాలు తీర్చే హీరో... థీమ్‌ చూస్తే 'ఖలేజా' చిత్రాన్ని తలపుకొస్తుంది. అయితే ఆ చిత్రంలో గ్రామవాసుల ఎమోషన్స్‌ని సీరియస్‌గా చూపిస్తే, ఇక్కడ దానినీ కామెడీ చేయాలని చూశారు. పుట్టిన మగబిడ్డలు అందరినీ తీసుకెళ్లిపోయి మత్తుకి బానిసలని చూసి, తమ కన్నవాళ్లనే చంపే కసాయిలుగా మార్చేస్తున్న వాడి కింద నలిగిపోతున్న జనం ఇంత చలాకీగా ఉంటారంటే నమ్మబుద్ధి కాదు. ఆ ఊరి మొత్తాన్ని వానర సైన్యంలా చూపించి నవ్వించాలనుకున్నారు కానీ వారు పడుతున్న కష్టాలకి, వారు చేసే దానికీ సింక్‌ అవలేదు. 

ఎక్కడో ఎవరినో చావగొట్టాడని తెలిసి అతడిని తమ ఊరికి రప్పించడం కోసం ఒక పెద్ద స్కెచ్‌ వేసి, అతను వచ్చేలోగా తెలుగు కూడా నేర్చేసుకుని, ఈ క్రమంలో తమ శక్తికి మించి ఖర్చు పెట్టేసి, ఆ తర్వాత అతడికి విలన్‌తో గొడవ పెట్టడం కోసం నానా పాట్లు పడీ.. ఆ గ్రామస్తులు చేసిందంతా నేల విడిచి చేసిన సాములానే అనిపిస్తుంది తప్ప నమ్మశక్యమనిపించదు. హీరోకి మంచి భోజనం పెట్టడం కోసమని ఊరు మొత్తం ఒక పూట పస్తులుంటూ ఉంటారు. అలాంటిది అతడిని ట్రాప్‌ చేయడం కోసం వేల కొద్దీ ఖర్చు పెట్టించేస్తారు. రకుల్‌ ప్రీత్‌ క్యారెక్టర్‌ని రియాలిటీకి దగ్గరగా చూపించే కనీస ప్రయత్నమైనా చేయలేదు. డీటెయిల్స్‌లోకి వెళితే మరీ నిట్‌పిక్కింగ్‌ అనిపించవచ్చు కానీ లాజిక్‌ లేని ఈ వ్యవహారం చుట్టూ కథ అల్లుకుని, అలాంటి డొల్ల పునాదులపై ఒక సినీ సౌధాన్ని నిర్మించాలనుకోవడం సబబు కాదు. 

రవితేజతో ఉన్న అడ్వాంటేజ్‌ ఏంటంటే... ఏమీ లేని సీన్‌లోకి కూడా తన ఎనర్జీతో ఏదో ఉందనే భ్రమ కల్పించేయగలడు. కిక్‌ 2 వీక్‌ అనిపించిన పలు సందర్భాల్లో రవితేజ కొమ్ము కాసాడు. రవితేజతో పాటు థమన్‌ కూడా ఒక చెయ్యేసాడు. నువ్వే నువ్వే, మమ్మీ మమ్మీ, కుక్కురుకురు పాటలు ఇప్పటికే పాపులర్‌ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తోను తమన్‌ ఆకట్టుకున్న రేర్‌ మూవీ ఇది. 'కిక్‌ 2' టోటల్‌ డిజప్పాయింట్‌మెంట్‌ కాకుండా వీళ్లిద్దరూ చాలా వరకు ఆదుకున్నారనే చెప్పాలి. డిపెండబుల్‌ జోడీ రవితేజ, బ్రహ్మానందం ఇందులో కూడా కొన్ని నవ్వులు పండించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ క్యారెక్టర్‌ని ఇష్టానికి రాసేసుకున్నా కానీ ఆమె మాత్రం తన గ్లామర్‌తో ఆకట్టుకోగలిగింది. సంజయ్‌ మిశ్రా, రాజ్‌పాల్‌ యాదవ్‌ కామెడీ మిస్‌ఫైర్‌ అయింది. తనికెళ్ల భరణి క్యారెక్టర్‌ ఎఫెక్టివ్‌గా లేదు. రవికిషన్‌, కబీర్‌ ఫర్లేదనిపించారు. 

మనోజ్‌ పరమహంస ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కళ్యాణ్‌రామ్‌ ఖర్చుకి వెనుకాడలేదనే సంగతి స్పష్టంగా కనిపించింది. దర్శకత్వ పరంగా సురేందర్‌ అక్కడక్కడా మెరుపులు మెరిపించాడే తప్ప ఓవరాల్‌గా తన టాలెంట్‌కి తగ్గ అవుట్‌పుట్‌ ఇవ్వలేకపోయాడు. శాంతికి చిహ్నమైన పావురం కూడా పగ కోరుకుంటే, ఆ ఊరి ప్రజలని పగ వద్దనేంత మంచివాళ్లని సింబాలిక్‌గా చెప్పడం బాగుంది. 

టేకాఫ్‌ బాలేకపోయినా రవితేజ టేకోవర్‌ చేసిన తర్వాత ఫస్ట్‌ హాఫ్‌ ఒకింత సాఫీగానే సాగింది. రవితేజ  బ్రాండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే వారికి కాలక్షేపమైపోతుంది. ద్వితీయార్థంలో రవితేజ ముద్ర కానీ, సురేందర్‌ మార్కు కానీ కనిపించకుండా పోయింది. కామెడీ కోసం చేసిన దాంట్లో చాలా వరకు మిస్‌ఫైర్‌ అయింది. ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యే డెప్త్‌ కొరవడింది. విలన్‌తో హీరో కాన్‌ఫ్రంటేషన్‌ కోసం వెయిట్‌ చేయడం ఒక్కటే సెకండాఫ్‌లో ఉన్న ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌. అది ఎక్కడ జరిగితే అక్కడ సినిమా చివరి ఘట్టానికి చేరిపోతుంది కనుక దానిని డిలే చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో కొత్త విలన్‌ని కూడా కథలోకి దించారు. హీరో ఎలివేషన్‌ కోరుకునే వారు ఒకట్రెండు ఆకట్టుకునే సన్నివేశాలతో తృప్తి పడవచ్చు. ఇలా అక్కడక్కడా కాస్త వర్కవుట్‌ అయిన సీన్లు, నవ్వించిన కామెడీ ఘట్టాలు, పాటలు, రవితేజ ప్రెజెన్స్‌ మినహా 'కిక్‌ 2'లో కిక్కు లేకుండాపోయింది. కిక్‌ బ్రాండ్‌కి ఉన్న ఆకర్షణ శక్తితో ఈ రెండోది కంఫర్టబుల్‌గా బండి లాగేస్తుందో లేదో చూడాలి.

బోటమ్‌ లైన్‌: కంఫర్ట్‌ చూసుకుంటే కిక్‌ తగ్గింది!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?