Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మన ఊరి రామాయణం

సినిమా రివ్యూ: మన ఊరి రామాయణం

రివ్యూ: మన ఊరి రామాయణం
రేటింగ్‌: నాట్‌ అప్లికబుల్‌

బ్యానర్‌: ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, ఫస్ట్‌ కాపీ పిక్చర్స్‌
తారాగణం: ప్రకాష్‌రాజ్‌, ప్రియమణి, పృధ్వీ, సత్యదేవ్‌, రఘుబాబు తదితరులు
సంగీతం: ఇళయరాజా
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: ముఖేశ్‌
నిర్మాతలు: ప్రకాష్‌రాజ్‌, రామ్‌జీ నరసింహన్‌
కథనం, దర్శకత్వం: ప్రకాష్‌రాజ్‌
విడుదల తేదీ: అక్టోబరు 7, 2016

ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చూస్తేనే తన అభిరుచి ఏంటనేది తెలుస్తుంది. రెగ్యులర్‌ సినిమాలు తీయడం ఇష్టపడని ప్రకాష్‌రాజ్‌ తన కథల్లో మానవ సంబంధాలపై దృష్టి పెడుతుంటారు. 'మన ఊరి రామాయణం' కూడా అలా మానవ సంబంధాలు, మానవీయ విలువలకి సంబంధించిన చిత్రమే. మలయాళంలో వచ్చిన 'షట్టర్‌' అనే చిత్రానికి రీమేక్‌ అయిన 'మన ఊరి రామాయణం' దేనినీ మన నెత్తిన రుద్దకుండానే చాలా సందేశాలిస్తుంది. వాస్తవాన్ని ప్రతిబింబించే పాత్రలతో కథలోకి మనల్ని లీనం చేసి, వారికి మంచి జరగాలని కోరుకునేట్టు చేస్తుంది. 

ఊరందరితో పెద్ద మనిషి అనిపించుకునే భుజంగయ్యకి (ప్రకాష్‌రాజ్‌) ఇంట్లో మాత్రం గౌరవం ఉండదు. తన మాటే చెల్లాలి అన్నట్టు కూతురి ఇష్టాన్ని పట్టించుకోకుండా, ఆమెకి పెళ్లి చేస్తానంటూ పట్టుబడతాడు. శ్రీరామనవమి ఉత్సవాలకి ఊరంతా తన పోస్టర్లు వేయించుకుని దర్పం ఒలకబోస్తుంటాడు. డబ్బు, పలుకుబడి ఉందనే గర్వంతో పోలీసులకి సైతం గౌరవమివ్వడు. ఒక సందర్భంలో అతను బలహీనతకి లోనయి సుశీల (ప్రియమణి) అనే వేశ్యతో సమయం గడపాలని అనుకుంటాడు. అతని నమ్మిన బంటు అయిన శివ (సత్యదేవ్‌) గురువుని, ఆమెని లోపలకి పంపించి కొట్టు తాళం పెడతాడు. గంటలో వస్తానంటూ వెళ్లిన శివ ‌ఒక సమస్యలో పడతాడు. తనని అలా ఆమెతో ఎవరైనా చూస్తే పరువు పోతుందనే భయంతో భుజంగం వణికిపోతుంటాడు. తన ఆటోలో స్క్రిప్టు మర్చిపోయిన సినీ దర్శకుడు గరుడ (పృధ్వీ) సాయంతో ఎలాగైనా వాళ్లని అక్కడ్నుంచి తప్పించాలని శివ ప్రయత్నిస్తుంటాడు.

అలా ఆ గదిలో వేశ్యతో ఇరుక్కుపోయిన భుజంగయ్యకి తన గురించి తన వెనుక తన స్నేహితులు ఏమనుకుంటున్నారు, తనకి ఊళ్లో ఎంతమంది నమ్మకమైన వాళ్లున్నారు, కూతురి ఫీలింగ్స్‌కి అస్సలు విలువ ఇవ్వని తన పరువు కోసం కూతురు ఏం చేస్తుంది? ఇలా చాలా విషయాలపై కళ్లు తెరుచుకుంటాయి. ఒక రోజు మొత్తం సుశీలతో గదిలో ఉండిపోయిన భుజంగయ్య బయటకి వచ్చేసరికి తనలోని అహం చచ్చిపోయి, కుటుంబం మీద ప్రేమ అధికమవుతుంది. ఈ రిఫార్మేషన్‌ ప్రాసెస్‌ అంతా కేవలం సన్నివేశ బలంతోనే జరుగుతుంది తప్ప ఎక్కడా భారీ డైలాగులు, కనువిప్పు కలిగించడానికి మెలోడ్రామా సీన్లు ఉండవు. కథని సింపుల్‌గా చెప్పడమే కాకుండా, ఈ పాత్రలకి ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ రేకెత్తించడంలో 'మన ఊరి రామాయణం' గొప్పతనం తెలుస్తుంది. 

భుజంగయ్య పర్‌ఫెక్ట్‌ కాదనేది మనకి ముందు నుంచీ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఒక బలహీన క్షణంలో అతనో ఇబ్బందిలో పడితే, అతను ఎలాగైనా అక్కడ్నుంచి బయట పడాలని కోరుకుంటాం. అతను చేసిన చెడ్డ పని తన ఇంట్లో ఎవరికో తెలిసిపోతే అయ్యో అనుకుంటాం. అతడిని బయటకి తీసుకురావాల్సిన ఆటో డ్రైవర్‌ వేరే చోట చిక్కుకుపోతే అతను ఎలాగైనా అక్కడ్నుంచి బయటపడి వెళ్లాలని ఆరాట పడతాం. తనతో ఉన్న పెద్ద మనిషి పరువు ఏమైపోతుందనే చింత లేకుండా గట్టిగా మాట్లాడుతోన్న సుశీలతో అవకాశముంటే సైలెంట్‌గా ఉండమని చెప్పాలనుకుంటాం. ఇంతగా ఒక పాత్ర గురించి ప్రేక్షకుడు పరితపిస్తే ఆ దర్శకుడికి అంతకంటే సక్సెస్‌ ఏముంటుంది? 

ఇది నిస్సందేహంగా ప్రకాష్‌రాజ్‌ దర్శకత్వం వహించిన సినిమాల్లోనే కాకుండా ఇటీవల వచ్చిన చాలా చిత్రాల కంటే ఉత్తమమైనది. కాకపోతే వాణిజ్య విలువలు లేకపోవడం, మరీ లిమిటెడ్‌ ఆడియన్స్‌కి మాత్రమే అప్పీలింగ్‌గా ఉండడం ఈ చిత్రానికి ఆర్థిక పరమైన విజయానికి అడ్డుకట్ట వేసేస్తుంది. ఉత్తమాభిరుచి ఉన్న ప్రేక్షకులు, సజీవమైన పాత్రలని, సంఘటనలని తెరపై చూడ్డానికి ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని మిస్‌ చేసుకోకూడదు. 

జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న ప్రియమణి, ప్రకాష్‌రాజ్‌ ఇద్దరికీ పెద్ద కాన్వాస్‌ కావాలా ఏంటి? వాళ్లెంతటి ఉత్తమ నటులనే సంగతి ఇరుకు గదిలో ఇరుక్కుపోయిన రెండు పాత్రలు పోషించిన ఈ చిత్రమే ఇంకోసారి నిరూపిస్తుంది. ఎప్పుడూ భారీ డైలాగ్స్‌ చెప్పే ప్రకాష్‌రాజ్‌ ఇందులో చాలా భాగం దాదాపు మౌనంగా ఉంటూనే అద్భుతమైన హావభావాలు పలికిస్తారు. తన పరువు ఎక్కడ పోతుందోననే భయాన్ని, తన స్నేహితులే తన గురించి హేళనగా మాట్లాడుకునేప్పుడు అసహాయతని ఆయన అభినయించిన తీరుకి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే. ప్రియమణి నటనలో ఒక్క రాంగ్‌ నోట్‌ లేదు. చేసింది వేశ్య పాత్ర అయినా ఎక్కడా అశ్లీలత లేకుండానే ఆ క్యారెక్టర్‌ని అద్భుతంగా పండించింది. ఎప్పుడూ లౌడ్‌ కామెడీ క్యారెక్టర్లు చేస్తోన్న పృధ్వీ ఇందులో ఒక ఫిలిం డైరెక్టర్‌ క్యారెక్టర్‌ని పండించిన తీరు తనలోని మరో కోణాన్ని తెలియజేస్తుంది. పృధ్వీ టాలెంట్‌ని మనవాళ్లు ఎంత మిస్‌యూజ్‌ చేస్తున్నారనే సంగతి దీంతో ఔస్పష్టమవుతుంది. గురువు కోసం ఆరాటపడే పాత్రలో సత్యదేవ్‌ (జ్యోతిలక్ష్మి ఫేమ్‌) చక్కని సహకారం అందించాడు. 

కళా దర్శకత్వం, సంగీతం, ఛాయాగ్రహణం అన్నీ సినిమాని ఎలివేట్‌ చేసేలా కుదిరాయి. ప్రకాష్‌రాజ్‌ కేవలం తన అభిరుచిని చాటుకోవడమే కాకుండా, తనలో ఒక మంచి దర్శకుడున్నాడని ఈ చిత్రంతో నిరూపించాడు. అయితే ఈ చిత్రానికి మరీ లిమిటెడ్‌ అప్పీల్‌ ఉంది. వేగంగా సాగే మసాలా సినిమాలని ఇష్టపడే వారికి ఇదో నాటకంలా అనిపించినా ఆశ్చర్యం లేదు. పాటలు, కామెడీలు, ఫైట్లూ వగైరా ఏం లేకుండా సజీవమైన పాత్రలని, మానవీయ విలువలున్న చిత్రాన్ని, అన్నిటికీ మించి కట్టి పడేసే పిట్టకథని చూడాలని ఉంటే ఈ రామాయణం వీక్షించాల్సిందే. 

బాటమ్‌ లైన్‌: ప్రియ ప్రకాశం!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?