Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: పోలీసోడు

సినిమా రివ్యూ: పోలీసోడు

రివ్యూ: పోలీసోడు (పోలీస్‌)
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వి క్రియేషన్స్‌
తారాగణం: విజయ్‌, సమంత, ఎమీ జాక్సన్‌, బేబీ నైనిక, ప్రభు, మహేంద్రన్‌, రాజేంద్రన్‌ తదితరులు
మాటలు: సాహితి
సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌
కూర్పు: ఆంథోనీ ఎల్‌. రూబెన్‌
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి. విలియమ్స్‌
నిర్మాత: కలైపులి ఎస్‌. ధాను
రచన, దర్శకత్వం: అట్లీ
విడుదల తేదీ: ఏప్రిల్‌ 15, 2016

పోలీసులకి గౌరవ భంగం కలిగించరాదని 'పోలీసోడు' అనే పేరుని 'పోలీస్‌'గా మార్చారు కానీ పోలీసోడు టైటిల్‌తోనే 'తెరి' తెలుగు వెర్షన్‌ ప్రదర్శితమవుతోంది. తమిళనాట విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌కి తెలుగులో మార్కెట్‌ పెంచాలనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతోంది. రజనీ, కమల్‌ని మినహాయిస్తే ఇక్కడ స్ట్రాంగ్‌ మార్కెట్‌ ఉన్న తమిళ హీరోలు విక్రమ్‌ లేదా సూర్య ఆషామాషీ మాస్‌ సినిమాలతో అది సంపాదించుకోలేదు. విక్రమ్‌కి శివపుత్రుడు, అపరిచితుడు లాంటి చిత్రాలతో, సూర్యకి గజినితో ఇక్కడ మార్కెట్‌ ఏర్పడింది. సగటు కమర్షియల్‌ సినిమాలు చేయడానికి మనకే బోలెడంత మంది సూపర్‌స్టార్లు ఉన్నారు కనుక అలాంటివి కొత్తగా తమిళనాడు నుంచి అనువ'దించుకోవాల్సిన' పని లేదు. 

'తెరి' అలియాస్‌ 'పోలీసోడు' అలియాస్‌ 'పోలీస్‌' అచ్చంగా విజయ్‌ అభిమానులని దృష్టిలో ఉంచుకుని, అతని సూపర్‌స్టార్‌ ఇమేజ్‌కి తగినట్టుగా తెరకెక్కించిన చిత్రం. విజయ్‌ అభిమానులు ఈలలు వేసి, పేపర్లు ఎగరేసి, డాన్సులేసి, చొక్కాలు చించుకోవడానికి కావల్సినన్ని మూమెంట్స్‌తో దర్శకుడు అట్లీ 'తెరి'ని అచ్చంగా ఫాన్స్‌ కోసమే తీసినట్టున్నాడు. ప్రేమ తర్వాత కూడా లైఫ్‌ ఉంటుంది అనే సున్నితమైన సందేశాన్నిస్తూ అతను తీసిన 'రాజా రాణి' చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. అలాంటి దర్శకుడు విజయ్‌లాంటి స్టార్‌తో జత కడితే కొత్తరకం కమర్షియల్‌ సినిమా వస్తుందనుకుంటే, హీరో వర్షిప్‌తోనే సరిపెట్టేసాడు. సినిమా నిండా హై స్పీడ్‌ షాట్లే. హీరో స్లో మోషన్‌లో కార్‌ దిగుతాడు, స్లో మోషన్‌లో నడుస్తాడు, స్లో మోషన్‌లోనే కళ్లజోడు పెట్టుకుంటాడు, చూయింగ్‌ గమ్‌ నోట్లో వేసుకుంటాడు. అప్పుడప్పుడూ విలన్‌కి కూడా ఈ హై స్పీడ్‌ ఎలివేషన్లు ఇచ్చారు. ఈ స్లో మోషన్‌ తంతు మొత్తం కట్‌ చేసినా, లేదా నార్మల్‌ స్పీడ్‌లో తీసి ఉన్నా ఒక అరగంట నిడివి తగ్గేదంటే అతిశయోక్తి కాదు. 

ఇంతకీ కథేంటంటే... ఒక బలమైన కారణం వల్ల వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ తన ఐడెంటిటీ మార్చుకుని, గొడవలకి పోకుండా సాధు జీవితం గడుపుతుంటాడు హీరో. ఇంతకీ అతను అన్నీ వదిలేసుకుని అలా బతకడానికి కారణమేంటనేదే కథ. ఈ కథ వినగానే 'బాషా' అని, 'ఇంద్ర' అని, 'నరసింహనాయుడు' అని, 'మాస్టర్‌' అని చాలా సినిమాలు మదిలోకి వచ్చి ఉంటాయి. అట్లీ తన సినిమాకి అంత పాత కథనే ఎంచుకున్నాడు మరి. గతంలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అయిన హీరో కేరళ వెళ్లిపోయి బేకరీ నడుపుకుంటూ, కూతుర్ని చదివించుకుంటూ ఉంటాడు. ఫస్ట్‌ సీన్‌ చూడగానే స్టోరీ ఏంటనేది ఈజీగా గెస్‌ చేసేయవచ్చు. అలాంటి రొటీన్‌ స్టోరీని ఇంట్రెస్టింగ్‌గా నడిపించకుండా కేవలం హీరో ఎలివేషన్లు లేదా ఓవర్‌ డ్రమెటిక్‌ సీన్లతో నింపేసారు. 

హీరో పోలీస్‌గా పరిచయం కాగానే ఫస్ట్‌ సీన్‌... గవర్నమెంట్‌ స్కూల్‌ని ఆక్రమించుకున్న రౌడీలకి బుద్ధి చెప్తాడు. మన గబ్బర్‌సింగ్‌ని గుర్తు చేస్తాడు. తర్వాతి సీన్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద చిన్న పిల్లల్ని వికలాంగుల్ని చేసి బిక్షమెత్తించే బ్యాచ్‌కి బుద్ధి చెప్తాడు. ఆ క్రమంలోనే డాక్టరైన హీరోయిన్‌తో పరిచయం. నిర్భయ ఘటనని తలపించే సీన్‌తో ఇంటర్వెల్‌. అక్కడే విలన్‌తో హీరోకి క్లాష్‌. వర్తమానంలో హీరో, కూతురు మాత్రమే మిగిలారంటే గతంలో ఏమై ఉంటుందనేది ఊహించడం అంత కష్టమేం కాదు. ఒకానొక పాయింట్‌లో మళ్లీ తన ఐడెంటిటీ రివీల్‌ అవడం, హీరో వచ్చి దుష్టసంహారం చేయడం, అంతే సినిమా! కనీసం ఒక్క ట్విస్టు కానీ, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ కానీ లేకుండా, మనం ఊహించింది తియ్యకపోతే మనమెక్కడ హర్ట్‌ అవుతామో అన్నట్టు అట్లీ చాలా, చాలా ఫ్లాట్‌గా తీసుకుంటూ పోయాడు. 

కొన్ని సీన్లు ఎమోషనల్‌గానే ఉన్నాయి కానీ వాటి కోసమని దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని చివరి వరకు చూడడం కష్టమే. కనీసం విజయ్‌, సమంత లవ్‌ ట్రాక్‌లో అయినా ఫ్రెష్‌నెస్‌ లేదు. విజయ్‌, బేబీ నైనిక మధ్య సీన్లు, వారిద్దరి సంభాషణలే ఈ చిత్రానికి చెప్పుకోతగ్గ ఎస్సెట్‌. తన కూతుర్ని చంపడానికి విలన్‌ అంత పెద్ద ప్లాన్‌ చేస్తే, దెయ్యం మాదిరిగా డ్రామా ఆడి వారి ఆట కట్టించడమైతే మరీ టూమచ్‌ అనిపిస్తుంది. హీరోని స్టయిలిష్‌గా చూపించడానికి ఆ సీన్‌, ఈ సీన్‌ అని లేకుండా ప్రతి చోటా స్టయిల్‌ మీదే ఫోకస్‌ పెట్టారు. ఓ సీన్లో తుపాకులతో ఒక బ్యాచ్‌ వచ్చి కాల్పులు జరుపుతోంటే, స్లో మోషన్‌లో కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకున్నాక కానీ హీరోగారు కాల్చడం మొదలు పెట్టరు. 

విజయ్‌ గొప్ప యాక్టరేం కాదు. అతనికో స్టయిల్‌ ఉంది. దానిని తమిళ జనం ఇష్టపడతారు. అతని శైలిలో మనవాళ్లకి నచ్చే ప్రత్యేకతలేం లేవు. సమంత బాగానే చేసింది. ఎమీకి పెట్టిన విగ్‌ కామెడీగా ఉంది. విలన్‌గా మహేంద్రన్‌ నటన బాగుంది. ప్రభు, రాజేంద్రన్‌, రాధిక సహాయ పాత్రలు చేసారు. జి.వి. ప్రకాష్‌కుమార్‌ నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటర్‌కి ఫ్రీడమ్‌ ఇచ్చి ఉండాల్సింది. ఎడిట్‌ చేసేయడానికి చాలానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. 

కొన్ని ఆకట్టుకునే సీన్లు, ఉత్తమ సాంకేతిక విలువలు ఉన్నప్పటికీ దాదాపు మూడు గంటల పాటు కూర్చోపెట్టే కంటెంట్‌ లేకపోవడంతో 'పోలీసోడు' అలరించిన దాని కంటే ఎక్కువగా విసిగిస్తాడు. కనీసం తెలుగు వెర్షన్‌ వరకు అయినా నిడివి తగ్గించుకుని ఉండాల్సింది. అఫ్‌కోర్స్‌ అలా తగ్గించినంత మాత్రాన ఇందులో విషయం పెరుగుతుందని కాదు. ప్రేక్షకులకి త్వరగా బయటపడే వీలుండేదంతే. 

బోటమ్‌ లైన్‌: మేటర్‌ లేదు!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?