Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: రాజా చెయ్యి వేస్తే

సినిమా రివ్యూ: రాజా చెయ్యి వేస్తే

రివ్యూ: రాజా చెయ్యి వేస్తే
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: వారాహి చలనచిత్రం
తారాగణం: నారా రోహిత్‌, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘు కారుమంచి, శశాంక్‌, శివాజీరాజా తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
కూర్పు: తమ్మిరాజు
ఛాయాగ్రహణం: భాస్కర్‌ సామల
నిర్మాత: రజని కొర్రపాటి
కథ, కథనం, దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి
విడుదల తేదీ: ఏప్రిల్‌ 29, 2016

ఒక రొటీన్‌ రివెంజ్‌ ప్లాట్‌ని తీసుకుని దానిని తెలివిగా చెప్పాలని చూసాడు దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి. ఆలోచన మంచిదే కానీ... తెలివితేటల్ని తెరపై చూపించడం అనుకున్నంత తేలిక కాదని అతనికి ఈపాటికి తెలిసుండాలి. హీరో తెలివైనవాడని చుట్టు పక్కల పాత్రలు చెబుతుంటాయి కానీ అతను చేసే పనులేవీ అపారమైన తెలివితేటలున్న వాడు చేస్తున్నట్టు కనిపించవు. తెలివైనవాడెప్పుడూ అవతలి వాడి కంటే రెండడుగులు ముందే ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ హీరో కనీసం తనకి విలన్‌ పంపించే క్యాష్‌ బ్యాగ్‌లో ఏవైనా ట్రాకింగ్‌ డివైస్‌లు పెట్టి ఉంటాడేమో అన్నది కూడా ఆలోచించడు. 

పతాక సన్నివేశంలో హీరో ఒక మాట అంటాడు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని చూసావ్‌.. అదే పద్మవ్యూహం అభిమన్యుడు పన్నితే ఎలాగుంటుందో చూస్తావా అంటాడు. అబ్బో ఇప్పుడేదో మైండ్‌ బద్ధలైపోయే అద్భుతం జరగబోతోందని ప్రిపేర్‌ అయితే తీరా అక్కడ జరిగేది ఏంటంటే, విలన్‌ని కొట్టడానికి హీరో చేతికి ఒక్కొక్కరూ ఒక్కో ఆయుధం అందిస్తుంటారు. అదే మన హీరో పన్నిన పద్మవ్యూహం. స్మశానానికి వచ్చిన విలన్‌ని చంపడానికి ప్లాన్‌ చెప్పమంటే సినిమా డైరెక్టర్‌ అవుదామని అనుకుంటోన్న మన హీరోగారు ఒక సీన్‌ రాస్తారు. ఆ సీన్‌ ఏంటంటే.. టోపీ, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, బొకేలో గన్‌ పెట్టుకుని వేరే సమాధి దగ్గరకి వెళ్లాలట. బొకేలోంచి గన్‌ తీసి విలన్‌ని కాల్చేయాలట. దీనికంటే విలన్‌ని చంపడానికి అవతలి గ్యాంగే మంచి ప్లాన్‌ వేస్తుంది. వాళ్ల ప్లాన్‌ ఏమిటంటే, ఒకడు శవంలా కాఫిన్‌ బాక్స్‌లో పడుకుంటాడు. విలన్‌ వచ్చినప్పుడు కాఫిన్‌ బాక్స్‌లోంచి లేచి కాల్పులు మొదలు పెడతాడు. 

ఇలా చెప్పుకుంటూ పోతే తెలివైనవాడు అని హీరో గురించి గొప్పలు చెప్పడమే తప్ప అతనెక్కడా మేథావిలా అనిపించడు. అలాగే పరమ కిరాతకుడు అంటూ విలన్‌ గురించి మాటలు చెప్పుకోవడమే తప్ప అతడిని చూస్తే ఏమాత్రం భయం కలగదు. కేవలం మాటల్లో మెరిసిన రాజా చేతల్లోకి వచ్చేసరికి తేలిపోయాడు. దర్శకుడు చాలా చెబుదామని అనుకున్నాడు కానీ దాన్ని తెర మీదకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. హీరో ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుందని అతని పక్కనున్న పాత్రలు అంటాయి. తీరా ఆ ప్రేమకథలో కొత్తగా అనిపించినదంటూ ఏదీ ఉండదు. ఇక అసలు కథలోకి వస్తే 'అతనొక్కడే' చిత్రాన్ని తలపించే ఒక ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశం. తమ తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకునేందుకు హీరో రంగప్రవేశం... ఇదేమో 'ఊసరవెల్లి'ని గుర్తు చేస్తుంది. కథాపరంగా కొత్తదనం లేనప్పుడు కథనంతో కట్టి పడేయగలగాలి. అందుకోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు కానీ ఆకట్టుకునే ప్రోడక్ట్‌ అయితే సిద్ధం చేయలేకపోయాడు. 

నారా రోహిత్‌ కార్యోన్ముఖుడైన తర్వాత తన జోన్‌లోకి వచ్చినట్టు అనిపించాడు. తారకరత్న మాత్రం 'మాణిక్‌' అనే క్రూరమైన విలన్‌కి తగ్గ వాచకం, ఆహార్యం, అభినయం దేంట్లోను పర్‌ఫెక్షన్‌ చూపించలేక పోయాడు. ఇతడిని చంపేయాలనే భావన విలన్‌ రేకెత్తించనప్పుడు, ఇతను చాలా తెలివిగా చంపేస్తాడనే నమ్మకం హీరో కూడా కలిగించనప్పుడు ఇక ఈ 'మైండ్‌ గేమ్‌' రక్తి కట్టే అవకాశానికి స్వయంగా అడ్డుకట్ట వేసుకున్నట్టే. ఇషా తల్వార్‌ నటన ఆకట్టుకోకపోయినా చూడ్డానికి అందంగా ఉంది. శశాంక్‌, శివాజీరాజా లాంటి అనుభవజ్ఞులు కూడా కొన్ని సందర్భాల్లో మరీ 'నటిస్తున్నట్టు' అనిపించారు. 

పాటలు ఏమంత ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం ఫరవాలేదు. కెమెరా వర్క్‌ బాగుంది. దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఒక పాత కథని తన నెరేషన్‌తో ఆసక్తికరంగా మలిచేందుకు చూసాడు. కొన్ని చోట్ల కథలోకి ఇన్‌వాల్వ్‌ చేయడంలో సక్సెస్‌ అయినప్పటికీ కీలకమైన విషయాలని కరక్ట్‌గా తెరకెక్కించడంలో తడబడ్డాడు. ఇంటర్వెల్‌కి ముందు, తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు బిగి సడలకుండా సాగిన ఈ చిత్రానికి అదే టెంపోని మెయింటైన్‌ చేసి ఉన్నట్టయితే ఫలితం మరోలా ఉండేది. మరోసారి నారా రోహిత్‌ ఎంచుకున్న కథలో విషయం ఉందనిపించినా కానీ అది తెర మీదకి మలిచిన విధానంలో జరిగిన పొరపాట్ల వల్ల రిజల్ట్‌ రివర్స్‌ అయింది. 

బోటమ్‌ లైన్‌: రాజా చెయ్యి వేస్తే.. అది రాంగైపోయింది!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?